SATURDAY MOTIVATION: ముఖేష్ అంబానీ నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన కొన్ని విజయ రహస్యాలు ఇవిగో

Saturday Motivation: భారతదేశంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం 115 బిలియన్ డాలర్ల ఆస్తులు అతని పేరుతో ఉన్నాయి. ప్రపంచంలోనే తొమ్మిదవ అతి సంపన్న వ్యక్తి ఈయన. అతని విజయం వెనుక ఎంతో కృషి ఉంది. అతని విజయ రహస్యాలను తెలుసుకుంటే మీరు కూడా మీ జీవితంలో వ్యాపారవేత్తగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.

ముకేశ్ అంబానీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. అదే సమయంలో అతని తండ్రి ధీరుభాయ్ అంబానీ చదువును మధ్యలోనే వదిలేసి వ్యాపారాన్ని చూసుకోమని చెప్పారు. ముఖేష్ తన తండ్రి చెప్పిన బాటలోనే నడిచారు. చదువు వదిలి రానని మొండికేయలేదు. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి రావడంతో అనుభవాల ద్వారానే వ్యాపారాన్ని ఎలా విజయవంతంగా నడిపించాలో నేర్చుకున్నారు. వ్యాపారంలోని చతురతను తండ్రి నుంచి, అలాగే అనుభవాల నుంచి తెలుసుకున్నాడు. చదువు ముఖ్యమే కానీ డిగ్రీలు... వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయని మాత్రం హామీ ఇవ్వలేమని అంటారు.

ఏదైనా సాధించాక ఆ విజయాన్ని చూసి పొంగిపోతూ అక్కడే ఉండిపోకూడదని, మరిన్ని విజయాలు అందుకునేందుకు వెళ్లాలని అంటారు ముఖేష్ అంబానీ. కొత్త ఆలోచనలను, కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వెళితేనే ఎదగడానికి అవకాశం ఉంటుందని చెబుతారు ఆయన. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ను పెట్రో కెమికల్ కంపెనీగా వదిలేయలేదు. రిటైల్ డిజిటల్ సేవలకు కూడా విస్తరించారు. మనదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇంతగా విరాజిల్లుతోందంటే దానికి అతను స్థాపించిన జియో కూడా కారణమే.

ఒక సంస్థ ఎదగాలంటే ఆ సంస్థను నడిపించే వ్యక్తి మాత్రమే కష్టపడితే సరిపోదు, అతను మాత్రమే ముఖ్యమైన వ్యక్తి కాదు, ఆ కంపెనీలో పని చేసే ప్రతి ఉద్యోగి ముఖ్యమైన వాడే. ఉద్యోగుల ప్రాముఖ్యతను ముకేశ్ అంబానీ అర్థం చేసుకున్నారు. అందుకే తన ఉద్యోగుల శ్రేయస్సుకు ఎప్పుడూ మొదటి స్థానాన్ని ఇచ్చేవారు. రిలయన్స్ విజయానికి వెన్నెముక తన దగ్గర పనిచేసే ఉద్యోగులేనని చెప్పుకుంటారు.

డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోకూడదని... జీవితంలో ఏదైనా గొప్పది సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవాలని, అది సాధించాక డబ్బు దానికదే వస్తుందని చెబుతారు ముకేశ్ అంబానీ. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా తరచూ చేయడం వల్ల మరింతగా ఉత్తేజితమవుతామని, అందుకే రిలయన్స్ ఫౌండేషన్ స్థాపించినట్టు చెప్పారాయన. లాభాపాక్ష లేకుండా చేసే పనులు మానసిక ప్రశాంతతను ఇస్తాయని అవి మరింతగా జీవితంలో ముందుకు వెళ్లేందుకు దారి చూపిస్తాయని అంటారు.

ముఖేష్ అంబానీ యువతకు ఇస్తున్నా సలహా ఏమిటంటే... యువత పెద్దగా కలలు కనాలి, జీవితంలో ఒక అభిరుచిని, ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పనిచేయాలి. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను దృష్టిలో ఉంచుకుంటే ఎప్పటికీ మీరు విజయవంతం కాలేరు అని అంటారాయన.

2024-04-19T23:58:41Z dg43tfdfdgfd