SRI RAMA NAVAMI: రాముడి పాత్ర చేసిన మొదటి హీరో ఎవరో తెలుసా? ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు!

రామాయణం ఎవర్ గ్రీన్ సినిమాటిక్ సబ్జెక్టు. ఒక సినిమాకు కావాల్సిన అన్ని పార్శ్వాలు ఉన్న ఇతిహాసం. ప్రతి హీరో లైఫ్ లో ఒక్కసారైనా రాముని పాత్ర చేయాలి అనుకుంటారు. మరి రామునిగా నటించిన తొలి తెలుగు హీరో ఎవరు? ఎందరు హీరోలు రామునిగా నటించారో చూద్దాం... 

 

శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకం. వాల్మీకి రచించిన రామాయణానికి వందల మంది దర్శకులు వెండితెర రూపం ఇచ్చారు. రాముని పాత్రకు ఎన్టీఆర్ ఒక బ్రాండ్ గా నిలిచారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు రాముని పాత్ర చేసిన హీరోలు ఉన్నారు. అలాగే కొందరికి మాత్రమే రాముని పాత్ర చేసే అవకాశం దక్కింది.

1932లో శ్రీరామ పాదుకా పట్టాభిషేకము టైటిల్ తో ఒక చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో నటుడు యడవల్లి సూర్యనారాయణ రాముని పాత్ర చేశారు. తెలుగులో శ్రీరామునిగా నటించిన మొదటి నటుడిగా ఆయన రికార్డులకు ఎక్కారు. 

 

1945లో పాదుకా పట్టాభిషేకం పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో సిఎస్ఆర్ ఆంజనేయులు రామునిగా నటించి మెప్పించారు. 

 

ఎన్టీఆర్ కంటే ముందు ఏఎన్నార్ రామునిగా నటించడం విశేషం. ఆయన డెబ్యూ మూవీ శ్రీ సీతా రామజననం(1944) మూవీలో ఏఎన్నార్ రాముడి పాత్ర చేశారు. రాముని పాత్రలకు ఎన్టీఆర్ ఫేమస్ అయ్యాక ఏఎన్నార్ ఆ పాత్ర చేయలేదు. 

 

ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ ప్రసిద్ధి గాంచారు. అందులోనూ రాముని పాత్రకు ఆయన  పెట్టింది పేరు. ఎన్టీఆర్ నటించిన లవకుశ(1963) రామాయణ ఆధారిత చిత్రాల్లో ఐకానిక్ గా నిలిచిపోయింది. 

 

నటుడు శోభన్ బాబు సైతం రామునిగా నటించి మెప్పించారు. 1971లో విడుదలైన సంపూర్ణ రామాయణం మూవీలో శోభన్ బాబు రామునిగా కనిపించారు. 

 

పసిప్రాయంలోనే రామునిగా నటించే అవకాశం దక్కించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 1997లో దర్శకుడు గుణశేఖర్ బలరామాయణం పేరుతో ప్రయోగాత్మక చిత్రం చేశారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రాముని పాత్ర చేశారు. 

 

ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ సైతం రామునిగా నటించి మెప్పించారు. బాపు దర్శకత్వంలో ఆయన నటించిన శ్రీరామ రాజ్యం(2011) చిత్రంలో రాముని పాత్ర చేశారు. 

 

రాముని పాత్ర చేసిన ఈ తరం స్టార్ హీరో ప్రభాస్. 2023లో విడుదలైన ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా చేసిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ ఈ చిత్ర దర్శకుడు. 

 

వీరితో పాటు సుమన్, శ్రీకాంత్, హరినాథ్, కాంతారావు సైతం శ్రీరాముడిగా వెండితెరపై కనువిందు చేశారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ జీవితంలో ఒక్కసారి కూడా ఆ పాత్ర చేయలేదు. 

2024-04-17T03:44:35Z dg43tfdfdgfd