SUCCESS STORY : కానిస్టేబుల్ టు సివిల్స్ .. ఈ ర్యాంకర్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా .. తెలుసు

యూపీఎస్సీ సివిల్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాలలో సామాన్య కుటుంబాల నుండి వచ్చిన వారే రాణించి .. ప్రతిభ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ఒకరని చెప్పవచ్చు. ఈయన మూడు సార్లు యూపీఎస్సీ కి ప్రయత్నించి, నాలుగవ సారి 780వ ర్యాంక్ ను సాధించారు. అసలు ఈయన వ్యక్తి గత జీవితాన్ని తెలుసుకుంటే కళ్లు చమ్మగిల్లాల్సిందే. అంతేకాదు ఓ అధికారి తనను అవమానించినందుకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి సివిల్స్ లో రాణించాలనే ఉద్దేశ్యంతో ఇష్టపడి చదివి చివరకు విజయాన్ని అందుకున్నారు. తన విజయంపై లోకల్ 18 తో ఉదయ్ కృష్ణారెడ్డి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

యూపీఎస్సీ ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామం. ఇదొక చిన్న పల్లెటూరు. అయితే కృష్ణారెడ్డి కి బాల్యం లోనే మాతృవియోగం కలిగింది. దీనితో మాతృ ప్రేమకు దూరమైన కృష్ణారెడ్డి ని అతని నానమ్మ రమణమ్మ అక్కున చేర్చుకుంది. అంతలోనే కృష్ణారెడ్డి తండ్రి సైతం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఓ వైపు కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్న నానమ్మ , మరోవైపు తన మనవడి చదువు ను ముందుకు సాగేలా చేసింది. బాల్యం నుండి ఏదైనా తలుచుకుంటే సాధించే గుణం గల కృష్ణారెడ్డి బాల్యంలోనే ఉన్నతాధికారి కావాలని భావించారు. 2012 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కృష్ణారెడ్డి 19 ఏళ్ల వయస్సులోనే కానిస్టేబుల్ గా అన్ని అర్హతలు సాధించి ఉద్యోగాన్ని సాధించారు. అయితే 2019 లో తాను పని చేస్తున్న పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి తో ఉన్న విభేధాల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక ఆ రాజీనామా నే నేడు సివిల్ ర్యాంకర్ గా నిలబెట్టింది అంటున్నారు కృష్ణారెడ్డి.

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన కృష్ణారెడ్డి తన మకాం హైదరాబాద్ కు మార్చారు. అనంతరం సివిల్ సర్వీసెస్ కోచింగ్ కు ఢిల్లీ కి వెళ్ళి , అనంతరం మరలా హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నారు. మూడు సార్లు యూపీఎస్సీ కి ప్రయత్నించి చివరగా తాజాగా విడుదలైన ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించారు. అయితే తనను పెంచి పోషించిన నానమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని, నానమ్మ ఇప్పటి వరకు తాను పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నట్లు భావిస్తుందన్నారు. చివరకు తాను ప్రస్తుతం సాధించిన విజయాన్ని నానమ్మ కు తెలిపిన ఆ మధుర క్షణాలు ఎప్పటికీ మరువలేనివన్నారు.

తాను సివిల్స్ ప్రిపేర్ అయ్యే సమయంలో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నట్లు, లక్ష్యమే గురి గా ఎంచుకొని నిత్యం పుస్తకాల పఠనం సాగించానన్నారు. ఎవరైనా సివిల్స్ సాధించాలంటే మొదటగా ఇష్టపడి చదవడం, కసిగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సంకల్పించాలన్నారు. అయితే తాను ప్రజా సేవలో మంచి ఉన్నతాధికారిగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తానన్నారు .. అలాగే బాల్యంలోనే తన తల్లిని పోగొట్టుకున్న తాను ఆధ్యాత్మిక చింతనను అలవరుచుకున్నానన్నారు. దీనితో మనుషుల వలె జంతు సంరక్షణ కు సైతం ప్రాధాన్యత ఇవ్వాలన్నది తన ఆకాంక్ష గా తెలిపారు. ప్రస్తుతం ప్రమాదంలో ఉన్న వారిని రక్షిస్తున్న 108 వాహనాల వలె , పశు పక్షాధులకు సైతం అత్యవసర సమయంలో చికిత్సను అందించేందుకు 109 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఏది ఏమైనా బాల్యం నుండి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఉదయ్ కృష్ణారెడ్డి తన లక్ష్యాన్ని చేరుకోగా , వారి గ్రామంలో అభినందనలు వెల్లువెత్తాయి.

2024-04-19T13:50:17Z dg43tfdfdgfd