SUCCESS STORY: బిజినెస్ బాస్ కావాలని జాబ్ వదిలి.. ఇప్పుడు నెలకు రూ.60వేలు సంపాదిస్తున్నాడు

తెల్లారిందా.. ఓ చుక్క వేయాల్సిందే. అదేనండీ టీ చుక్కలు. పేద , ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే టీ త్రాగడం సర్వసాధారణమే. గతంలో టీ లో రకాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎన్నో రకాల ఫ్లేవర్ లతో కూడిన టీ ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అల్లం టీ, మసాలా టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, ఇలాచి టీ, రోజ్ టీ, దమ్ టీ ఇలా పలు రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. దీనితో పలు రకాల రుచులు గల టీ ని సేవించేందుకు టీ ప్రియులు అమిత ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. ఇలా వరంగల్ నగరంలో రాకేష్ అనే యువకుడు టీ దుకాణం ఏర్పాటు చేసి, ప్రజలకు ఎన్నో రకాల టీ ఫ్లేవర్స్ పరిచయం చేస్తున్నారు. కానీ ఇతని వద్ద తందూరి చాయ్ వెరీ స్పెషల్. అందుకే ఈ చాయ్ త్రాగేందుకు ప్రజలు క్యూ కట్టేస్తున్నారు.

వరంగల్ నగరానికి చెందిన రాకేష్ డిగ్రీ వరకు చదువుకున్నారు. తన విద్యాభ్యాసం అనంతరం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఆశించిన వేతనం రాకపోవడంతో, స్వయం ఉపాధిలో రాణించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తందూరి చాయ్ దుకాణం ఏర్పాటు చేయాలని తలచి, వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

ఇంటర్ లో రైతు బిడ్డకు బెస్ట్ ర్యాంక్ కానీ.. గోల్ మాత్రం ఇది కాదట !

వరంగల్ నగరంలో మొదటి సారిగా తందూరి చాయ్ ఏర్పాటు చేయగా, ప్రజలు సైతం ఈ టీ రుచి చూడడం ప్రారంభించారు. ఇంకేముంది రోజు రోజుకు తందూరి చాయ్ అభిమానులు అధికం కాగా, వ్యాపారం జోరుగా సాగుతోంది. దాదాపు 4 సంవత్సరాల నుండి వరంగల్ ప్రజల ఆదరాభిమానాలతో ఈ టీ షాప్ విజయవంతంగా సాగుతోందని లోకల్18 తో నిర్వాహకులు రాకేష్ తెలిపారు.

ఇంటర్ ఫలితాలలో.. దుమ్ము లేపిన కూలీ కూతురు !

తందూరి చాయ్ తయారీకి టీ ఆకులు, మసాలా దినుసులు లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, సొంటి, మిరియాలు ఉపయోగిస్తామని, ఆ తర్వాత బట్టిలో కాల్చిన కుండల్లో ఈ చాయ్ ను అందించడం ద్వారా టీ మంచి రుచి వస్తుందన్నారు. ఈ తందూరి చాయ్ ధర రూ. 20 లు కాగా, రోజుకు సుమారు రూ.2వేల ఆదాయం వస్తుందని రాకేష్ తెలిపారు. తమ వద్దకు వరంగల్ వాసులే కాకుండా, పక్క గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఈ తందూరి చాయ్ త్రాగి వెళ్తారని, ప్రజలకు నాణ్యమైన టీ అందించడమే లక్ష్యంగా తాను ఈ టీ షాప్ ప్రారంభించడం జరిగిందన్నారు. తనను ఆదరిస్తున్న వరంగల్ వాసులకు రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి టీ షాప్ ద్వారా స్వయం ఉపాధి లో సక్సెస్ సాధించిన రాకేష్.. మున్ముందు కూడా మరింత సక్సెస్ సాధించాలని అందరం కోరుకుందాం !

2024-04-28T06:58:48Z dg43tfdfdgfd