TAMILISAI: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు, ఎందుకంటే!

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన తమిళిసైపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో బీఆర్ఎస్ నేతలు కోరారు. తమిళనాడు నుంచి తమిళిసై బీజేపీ అభ్యర్థిగా మరోసారి లోక్ సభ ఎన్నికల బరిలోకి నిలిచారు. తన వద్ద డబ్బులు లేకపోవడం, ఎన్నికలకు ఖర్చు చేయకపోవడం వల్లే వరుస ఎన్నికల్లో ఓడిపోయాయని కొన్ని రోజుల కిందట తమిళిసై అన్నారు. 

తమిళిసై తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా తమిళిసై ప్రచారం చేశారు. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లో కొందరు ఓటర్లకు అయోధ్య రామ మందిరం ప్రతిమను పంపిణీ చేశారని బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు, బీజేపీ ఓట్లు అడిగేందుకు తమిళిసై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 16నుంచి దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, దాని ప్రకారం ఓటర్లకు మత సంబంధమైనవి వినియోగించకూడదు. దాని వల్ల ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని, ప్రలోభాలు, ఓటర్లను ఆకర్షించేందుకు కొన్ని మతపరమైన, ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నారని లేఖలో బీఆర్ఎస్ ఆరోపించింది. 

మాజీ గవర్నర్ తమిళిసైని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది. అదే విధంగా తమిళిసై ఎవరి తరపునైతే ప్రచారం చేశారో ఆ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని అడిగారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 ప్రకారం సెక్షన్ 123(3) కింద ఏ నేత, అభ్యర్థిగానీ ఓటర్లను కులం, మతం, జాతి ఆధారంగా ఓటర్లను ఓట్లు అడగటం గానీ, మతాలకు సంబంధించినవి పంచి పెట్టడం గానీ చేయకూడదు అని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

2024-05-08T16:15:51Z dg43tfdfdgfd