VARUN TEJ CAMPAIGN: బాబాయి కోసం అబ్బాయి ప్రచారం - పవన్ కళ్యాణ్ గురించి వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

పిఠాపురం: ఏపీలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. అభ్యర్థుల కోసం కుటుంబసభ్యులైన సినీ సెలబ్రిటీలు రంగంలోకి దిగుతున్నారు. జనసేన అధినేత, పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ తరఫున టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధికారం లేకపోయినా అన్ని వర్గాలకు అండగా నిలచిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, బాబాయిని గెలిపించి అసెంబ్లీకి పంపాలని.. దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తారని వరుణ్ తేజ్ అన్నారు.

మెగా బ్రదర్, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన బాబాయి పవన్ కళ్యాణ్ తరఫున శనివారం నాడు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బాబాయి పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే.. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక స్థాయిలో ఉండేలా చేస్తారని పేర్కొన్నారు. తాత కొణిదెల వెంకట్రావు ఉద్యోగరీత్యా మా కుటుంబం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నివసించిందన్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం సొంత ఊరుగా చేసుకుంటామని వరుణ్ తేజ్ తెలిపారు. 

గొల్లప్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరుణ్ తేజ్ శనివారం నాడు భారీ రోడ్ షో నిర్వహించారు. తాటిపర్తిలో వరుణ్ తేజ్ గారు మాట్లాడుతూ "పడి లేచిన కెరటం మా బాబాయ్ పవన్ కళ్యాణ్. ఓటమిని తట్టుకుని పదేళ్లపాటు ప్రజల కోసం నిలబడ్డారు. పెదనాన్న చిరంజీవితో సహా మా కుటుంబం మొత్తం బాబాయి వెనుకే ఉన్నాం. నేను మీ లాంటి జన సైనికుడినే. జనసేన పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి జన సైనికుడికి ప్రత్యేక ధన్యవాదాలు. 

అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల వెంటే..

పవన్ కళ్యాణ్ అధికారం చేతిలో లేకున్నా కౌలు రైతుల కష్టాలు తీర్చారు. ఎంతోమంది మత్స్యకారులకు బాబాయి అండగా నిలిచారు. అన్ని వర్గాలకు అండగా నిలచిన నేత పవన్ కళ్యాణ్. మే 13న జరిగే ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా బాబాయ్‌ని, ఎంపీగా టీ టైమ్ ఓనర్ కాకినాడ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని’ వరుణ్ తేజ్ అని కోరారు. 

2024-04-27T16:37:38Z dg43tfdfdgfd