VIRAL NEWS: ఊళ్లో తగవు తీర్చలేక తలలు పట్టుకున్న పోలీసులు, ఇట్టే పరిష్కరించిన బర్రె

Buffalo Settles Village Dispute: ఊళ్లో పంచాయితీ తీర్చాలంటే పెద్దలు వస్తారు. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేస్తారు. అక్కడా రాజీ కుదరకపోతే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఓ ఊళ్లో ఇద్దరి మధ్య జరిగిన గొడవకి బర్రె పరిష్కారం చూపించి ఆ తగవు తీర్చింది. యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. ఈ బర్రె నాదంటే నాదంటూ ఇద్దరు పంచాయితీ పెట్టుకున్నారు. చివరకు ఆ బర్రె అసలు యజమాని ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అక్కడితో ఆ గొడవకు ఫుల్‌స్టాప్ పడింది. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. బర్రె కోసం గొడవ పెట్టుకున్న ఇద్దరూ పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ పంచాయితీని ఎలా తేల్చాలో తెలియక కాస్త వినూత్నంగా ఆలోచించారు పోలీసులు. రోడ్డుపైకి తీసుకొచ్చి వదిలి పెట్టారు. అది నేరుగా తన యజమాని ఇంటికి వెళ్లిపోయింది. అక్కడితో ఈ తగవు తీరిపోయింది. 

ఏం జరిగిందంటే..?

ప్రతాప్‌గఢ్‌లోని ఓ గ్రామంలో బర్రె ఉన్నట్టుండి అదృశ్యమైంది. చాలా రోజులుగా జాడ కోసం ప్రయత్నించాడు. దాదాపు మూడు రోజుల పాటు వెతగ్గా మరో వ్యక్తి ఇంట్లో అది కనిపించింది. ఆ వ్యక్తిపై యజమాని ఫిర్యాదు చేశాడు. అక్రమంగా తన బర్రెని లాక్కున్నాడని ఆరోపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. గంటల పాటు పంచాయితీ నడిచింది. అయినా బర్రె నాదంటే నాదంటూ ఇద్దరూ వాదించారు. ఈ సమస్యకి బర్రె మాత్రమే పరిష్కారం చూపించగలదని భావించిన పోలీసులు దాన్ని రోడ్డుపైన వదిలేశారు. పోలీస్ స్టేషన్‌ నుంచి నేరుగా అసలు యజమాని ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి వరకూ బర్రె నాదని వాదించిన మరో వ్యక్తిని పోలీసులతో పాటు గ్రామస్థులూ మందలించి పంపించారు. 

2024-07-06T06:09:08Z dg43tfdfdgfd