WORLD LAUGHTER DAY 2024: మూతి ముడుచుకుంటే వచ్చేదేం లేదు, ప్రతిరోజూ నవ్వండి నవ్వించండి, ఎక్కువకాలం జీవిస్తారు

World laughter day 2024: నవ్వు ఒక మెడిసిన్. ఎన్ని మందులు వాడినా పోని మానసిక రోగాలు.. నవ్వుతో పోతాయి. అందుకే ప్రతిరోజూ నవ్వమని చెబుతూ ఉంటారు వైద్యులు. అసూయ, పగ, కోపంతో రగిలిపోయే కన్నా... నవ్వుల్లో మునిగి తేలండి. ఈ ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది. నవ్వు గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే ప్రతి ఏటా ప్రపంచ నవ్వుల దినోత్సవం మే నెలలో వచ్చే మొదటి ఆదివారం నాడు నిర్వహించుకుంటారు. నవ్వుకు వైద్యం చేసే లక్షణాలు ఎక్కువ. నవ్వుతూ ఉంటే మీ జీవితకాలం కూడా పెరుగుతూ ఉంటుంది. నవ్వు ప్రయోజనాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎప్పుడు మొదలైంది?

ప్రపంచ నవ్వుల దినోత్సవం 1998లో మొదలైంది. ముంబైకి చెందిన డాక్టర్ మదన్ కటారియా నవ్వుల క్లబ్ ను స్థాపించి ఈ దినోత్సవానికి పునాది వేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా మీలో వచ్చే మొదటి ఆదివారం ఈ నవ్వుల దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.

ప్రపంచ నవ్వుల దినోత్సవం ఉద్దేశం ఒకటే. ప్రతి వ్యక్తి నవ్వుతూ, నవ్విస్తూ జీవించాలి. అప్పుడే వారి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే వారి జీవన కాలం కూడా పెరుగుతుంది. నవ్వులో వైద్యం చేసే లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ విషయాలన్నింటిపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా నవ్వుల దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.

నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలు

రోజులో కనీసం నాలుగైదు సార్లు అయినా సంతోషంగా నవ్వాలి. అలా నవ్వడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది. నవ్వడం వల్ల ఆనందాన్ని ఇచ్చే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను అణిచివేస్తాయి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న నొప్పులు కూడా తగ్గుతాయి. ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. శరీరంలోని అవయవాలు చురుగ్గా పనిచేయడం మొదలుపెడతాయి.

నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఆధునిక కాలంలో అధికంగా వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టే శక్తి నవ్వుకే ఉంది. సానుకూల భావోద్వేగాలు కలగాలంటే మీరు ఎంతగా నవ్వితే అంత మంచిది. నవ్వడం, ఒకరిని ఆనందంగా కౌగిలించుకోవడం అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. మానసికంగా ఉన్న అవసరాలను తొలగిస్తాయి. మీ శారీరక సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.

నవ్వు మిమ్మల్ని ఉత్సాహపరిచి మీలో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. మిమ్మల్ని స్థిరంగా, ఏకాగ్రతగా, శ్రద్ధగా ప్రతి పనిని చేసేలా ప్రోత్సహిస్తుంది. నవ్వడం వల్ల వైద్యుడు వద్దకు వెళ్లే అవకాశాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ప్రతిరోజూ కనీసం అరగంట పాటైనా బిగ్గరగా నవ్వడం నేర్చుకోండి.

2024-05-04T23:43:00Z dg43tfdfdgfd