అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు

అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు

అక్కినేని నాగేశ్వర రావు నటించిన ‘నవరాత్రి’ చలనచిత్రం సినిమా దర్శకునిగా తాతినేని రామారావుకు తొలి చిత్రం. 1966 వ సంవత్సరంలో వచ్చింది ఈ సినిమా.  దీనిలో నాగేశ్వర రావు ఏకంగా తొమ్మిది విధాలైన పాత్రలలో నటించారు. శివాజీ గణేశన్ తమిళంలో నటించిన చిత్రం ఆధారంగా తెలుగులో ఈ సినిమా తీయడం జరిగింది.  ఇది ఇటు నటుడు ఎ.ఎన్.ఆర్ కు, అటు దర్శకునిగా మెగాఫోన్ ను  చేపట్టిన తాతినేని రామారావుకు కూడా సాహసమే అని చెప్పాలి. సినిమా వంద రోజులాడింది. పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులు అయ్యారు. బ్రహ్మచారి (1968), మంచి మిత్రులు, భలే రంగడు, (1969), రైతు కుటుంబం (1972), మరపు రాని మనిషి, జీవన తరంగాలు (1973), యమగోల (1975), ఆలుమగలు (1977), దేవుడు చేసిన పెళ్లి, ఆటగాడు (1980).. ఇలాగ పలు హిట్ చిత్రాల కు తాతినేని రామారావు దర్శకత్వం వహించగలిగారు. ‘భార్యాబిడ్డలు’ (1972), ‘ఆత్మీయుడు (1977), ‘ఇల్లాలు’  ‘పండంటి జీవితం’ (1981), ‘ముగ్గురు మొనగాళ్లు’ (1983), ‘ప్రెసిడెంటు గారి అబ్బాయి’ (1987 ),  ‘తల్లితండ్రులు’ (1991) ఈయన మరికొన్ని హిట్ సినిమాలు. నటరత్న ఎన్.టి. రామారావుతో దర్శకుడు తాతినేని రామారావు తాను తీసిన ‘యమగోల’ను ‘లోక్ పర్ లోక్’ అనే టైటిల్ తోను, అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో తాను తీసిన ‘ఆలుమగలు’ సినిమాను ‘జుదాయి’ టైటిల్ తోను హిందీ భాషలో తీశారు. ‘లోక్ పర్ లోక్’ ఓ మోస్తరుగా ఆడింది. 1980వ సంవత్సరంలో విడుదలైన ‘జుదాయి’ బాగా ఆడింది.

హిందీ సినిమాలకు డైరెక్షన్​

హిందీలో అనేక సినిమాలకు డైరెక్షన్ చేశారు తాతినేని రామారావు. అవి అట్లాంటి ఇట్లాంటి సినిమాలు కావు. వాటి మాతృకలు మహత్తరమైనటువంటి హిట్ లు.  భారీ హిట్ సినిమాలను పరాయి భాష లో డైరెక్ట్ చేయడం కత్తి మీద సాము. తిరిగి తీయబోతున్న భాషలోని ప్రేక్షకుల అంతరంగాన్ని స్పర్శించి, వారిని రంజింప చేసే విధంగా మాతృకను తీర్చిదిద్దవల్సి ఉంటుంది. ఈ యజ్ఞంలో తాతినేని రామారావు సోమయాజియే అయ్యారు. ఆయన చేతిలో పడి ముస్తాబైన సినిమాలలో ‘మాంగ్ భరో సజ్ నా’ (కార్తీక దీపం హిందీ), ‘ఏక్ హీ భూల్’ , ‘జీవన్ ధారా’, ‘మైఁ ఇంతకామ్ లూంగా’, ‘యే తో కమాల్ హో గయా’, ‘అనురాగ దేవత’ (1982), ‘అంధా కానూన్’ , ‘ముఝే ఇన్ సాఫ్ చాహియే’ (1983) ‘న్యాయం కావాలి’  హిందీ రీమేక్ ఇది. ‘జాన్ జానీ జనార్దన్’ (1984), ‘పచ్చని కాపురం’ (1985), ‘నాచే మయూరి’ (1986),  ‘సన్ సార్’, ‘వతన్ కే రఖ్ వాలే’ (1987), ‘ఖత్రోంకే ఖిలాడి’ (1988), ‘రావణ్ రాజ్​ఎ ట్రూ స్టోరీ’ (1995) చక్కటి విజయాలను చేజిక్కించుకున్నాయి.  ఎంతలాగా అంటే అవన్నీ కలసి తాతినేని రామారావును సాటి లేని రామారావుగా మార్చివేశాయి అని చెప్పుకోవచ్చు.

అవార్డులు, రివార్డులు

నటసామ్రాట్ ఎ.ఎన్.ఆర్ కు ‘ఉత్తమ నటుడు’ అవార్డు, అందాల నటి రేఖకు ‘ఉత్తమ నటి’ అవార్డులు వచ్చిన సినిమాలలో తాతినేని రామారావు సినిమాలు ఉన్నాయి. కమల్ హాసన్, జరినా వాహబ్​లతో  ‘అమర ప్రేమ’ సినిమాకు 1978లో తాతినేని రామారావు దర్శకత్వం వహించారు . ప్రముఖ తార శ్రీదేవితో తాతినేని రామారావు ఆరు సినిమాలకు పనిచేశారు. అవి ‘ఆటగాడు’, ‘ఇల్లాలు’,  ‘అనురాగదేవత’, ‘ఇంక్విలాబ్’, ‘పచ్చని కాపురం’, ‘వతన్ కే రఖ్ వాలే’. వీటిలో మొదటి, ఆరో చిత్రాలు మినహా మిగతా నాలుగు సినిమాలలో శ్రీదేవి చేత మరపురానటువంటి అభినయాన్ని ప్రేక్షకుల మీదకు కురిపింప చేశారు తాతినేని రామారావు. ఈయన నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దోస్తీ దుశ్మనీ’ తోనే నటి భానుప్రియ హిందీ చిత్ర రంగంలో  ప్రవేశించారు. తాతినేని రామారావు మన తెలుగువాడు కావడం మన భాగ్యం.  83 ఏండ్ల వయస్సులో 2022 ఏప్రిల్ 20వ తేదీన తాతినేని రామారావు మన నుంచి విడిపోయారు. ఆయనకు ఇదే స్మృత్యంజలి.

- దిలీప్​ కేతవరపు

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T02:31:03Z dg43tfdfdgfd