అనలిస్టులనే ఆశ్చర్యపరిచేలా బుడ్డోడి అనాలిసిస్.. ముంబై టీంను ఏకిపారేసిన చిన్నారి ఫ్యాన్ (వీడియో)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్‌ కలిగిన జట్లలో ముంబై ఇండియన్స్‌ ఒకటి. సచిన్‌ టెండూల్కర్‌, రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ ప్లేయర్లు ఆ జట్టుకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ రావడానికి కారకులు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోనే ముంబై ఇండియన్స్‌ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. గొప్ప గొప్ప ప్లేయర్లకు సైతం సాధ్యం కానీ ఈ ఫీట్‌ను రోహిత్‌ శర్మ సాధించాడు. దీంతో అభిమానుల్లో హీరోగా నిలిచాడు.

అయితే ఈ సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్దిక్‌ పాండ్యాను ట్రేడ్‌ చేసుకుని మరీ హార్దిక్‌ను కెప్టెన్‌ చేసింది ముంబై యాజమాన్యం. ఈ నిర్ణయం రోహిత్ శర్మ ఫ్యాన్స్, ముంబై ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. దీనిపై చాలా మంది ఫ్యాన్స్‌ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కొందరేమో స్టేడియంతో హార్దిక్‌ పాండ్యాను హేళన చేశారు. దీనికి తోడు ఈ సీజన్‌ ఆరంభంలోనే ముంబై హ్యాట్రిక్‌ ఓటములు నమోదు చేయడం కూడా ఆ జట్టు ప్రతిష్టను దెబ్బతీసింది. హార్దిక్‌ వల్లే ఇదంతా జరుగుతోందని కొందరు ఫ్యాన్స్‌ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, హార్దిక్‌ పాండ్యా, కెప్టెన్సీ ముంబై ఇండియన్స్‌ ప్రదర్శనపై ఓ పదేళ్ల బాలుడి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చూసేందుకు చిన్నపిల్లాడిలా కనిపించినా.. అతడి ఆవేదన, మాటల ప్రవాహం చూపరులను ఆకట్టుకుంటోంది. పదేళ్ల వయసులోనే క్రీడా విశ్లేషకుడి తరహాలో అతడు గొప్ప విశ్లేషణ చేశాడు.

ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రదర్శనపై తనదైన శైలిలో విశ్లేషించాడు బాలుడు. జట్టును ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌పై ముంబై విధేయత చూపలేదని, హార్దిక్‌ పాండ్యా తీసుకున్న నిర్ణయాలు పరమ చెత్తగా ఉన్నాయని వ్యాఖ్యానించాడు. అందుకు అతడు చెప్పిన ఉదాహరణలు మరింత ఆసక్తికరం.

‘రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చి ముంబై తప్పు పని చేసింది. ఐదుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపిన ప్లేయర్‌పై ఎటువంటి విధేయత చూపలేదు. ముంబై ఇండియన్స్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలవడానికి కూడా రొమారియో షెఫర్డ్‌ కారణం. లాస్‌ ఓవర్‌లో అతడి హిట్టింగ్‌ జట్టును గెలిపించింది. మా బౌలర్లు కూడా మంచి ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయకపోవడం మంచిదైంది. అతడు బౌలింగ్ వేసి ఉంటే.. మ్యాచ్‌ 14 ఓవర్లలోనే ఢిల్లీ గెలిచేది’ అంటూ ఆ బాల విశ్లేషకుడు.. హార్దిక్‌ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు.

‘హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌ జట్టు నడిపించేందుకు అర్హుడు కాడు. అతడిని కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పించాలి. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌కు మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించాలి. హార్దిక్‌ పాండ్యా మొదటి ఓవర్‌ను ఎందుకు వేసినట్లు. జస్‌ప్రీత్‌ బుమ్రా, గెరాల్డ్‌ కొయెట్జీ లాంటి వికెట్‌ టేకింగ్ బౌలర్లు జట్టులో ఉన్నప్పటికీ.. అతడు మొదటి ఓవర్‌ బౌలింగ్‌ చేయడమేంటి?’ అని ఆ బాలుడు ప్రశ్నించాడు.

హార్దిక్‌ను ముంబై ఫ్రాంఛైజీ.. ఈ సీజన్‌ తర్వాత వేలంలోకి వదిలేయాలని, రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించాలని సదరు ముంబై ఇండియన్స్‌ చిన్నారి ఫ్యాన్‌ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చిన్నారి మాటల పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే అద్భుతమైన వాక్‌ చాతుర్యం కలిగి ఉన్నాడని, విశ్లేషణ తీరు కూడా అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T12:03:56Z dg43tfdfdgfd