అశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం

అశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం

  •     పురుగుల మందు తాగాక బంధువులకు వాట్సాప్​ మెసేజ్​ 
  •     ఉన్నతాధికారులు, సిబ్బంది తీరే కారణమని వెల్లడి 

అశ్వారావుపేట, వెలుగు : ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని ఆయన బంధువులు తెలిపారు. పురుగుల మందు తాగడం వల్ల రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని, డయాలసిస్ చేస్తున్నారని, లివర్ కూడా దెబ్బతిందని తెలిపారు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు ఎస్సై తన మొబైల్​నుంచి బంధువులకు, స్నేహితులకు ఓ మెసేజ్​పంపించాడు. 

అందులో ‘ఉన్నతాధికారులు వేధింపులు, సహచర సిబ్బంది చేసిన అవమానాలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నా. ఆఖరి క్షణాన భార్యాబిడ్డలు గుర్తుకురావడంతో బతకాలి అనిపించి ఇప్పుడే108కి ఫోన్​చేశా. నా ఫోన్​లో అన్ని ఆధారాలున్నాయి. నా రివాల్వర్​ను పోలీస్​ స్టేషన్​లో సరెండర్ చేశా. పత్రికల్లో నాపై వార్తలు రాయించి అవినీతిపరుడిగా చిత్రీకరించారు.

 వేధింపుల గురించి డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదు. అందుకే సూసైడ్​ చేసుకుంటున్నా’ అని వాట్సాప్  ​చేశాడు. ప్రస్తుతం ఎస్సై ఫోన్​ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లో చికిత్స పొందుతున్న ఎస్సై మెజిస్ట్రేట్ ఎదుట కూడా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది.  

©️ VIL Media Pvt Ltd.

2024-07-03T02:48:15Z dg43tfdfdgfd