ఆర్జీయూకేటీలో 69% అమ్మాయిలే

  • మొదటి విడుత సీట్లను కేటాయించిన అధికారులు

హైదరాబాద్‌, జూలై 3 (నమస్తే తెలంగాణ): చదువుల తల్లి సరస్వతి చెంతనే(బాసరలో) గల రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) బాలికలతో నిండుతున్నది. ఇక్కడ చదువుకుంటున్న వారిలో అత్యధికులు బాలికలే కాగా, ఈ విద్యాసంవత్సరం సైతం 69శాతం సీట్లను వారే సొంతం చేసుకున్నారు. బాలురు కేవలం 31శాతం సీట్లను మాత్రమే కైవసం చేసుకున్నారు. ఆర్జీయూకేటీ మొదటి విడుత సీట్లను బుధవారం కేటాయించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వీ వెంకటరమణ సీట్ల వివరాలను మీడియాకు వెల్లడించారు.

సిద్దిపేట జిల్లా నుంచి అత్యధికంగా

ఆరేండ్ల బీటెక్‌ కోర్సు (ఇంటర్‌+ బీటెక్‌)ను ఆర్జీయూకేటీలో నిర్వహిస్తుండగా, ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా పదోతరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీచేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 1,404 సీట్లలో 976 సీట్లను అమ్మాయిలే సొంతం చేసుకున్నారు. అబ్బాయిలు కేవలం 428 సీట్లను కైవసం చేసుకున్నారు. 10 జీపీఏ దక్కించుకున్నవారిలో బాలికలే అధికంగా ఉండటంతో ప్రవేశాల్లోనూ వారే సత్తాచాటారు.

జిల్లాలవారీగా వివరాలను పరిశీలిస్తే.. సిద్దిపేట జిల్లా నుంచి అత్యధికంగా 330 మంది, నిజామాబాద్‌ నుంచి 157, సంగారెడ్డి నుంచి 132, రాజన్న సిరిసిల్ల నుంచి 81, నిర్మల్‌ నుంచి 72 మంది చొప్పున ఆర్జీయూకేటీలో ప్రవేశాలు పొందారు. ఈనెల 8 నుంచి 10 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, జూలై 4న పీహెచ్‌, స్పోర్ట్స్‌, జూలై 5న ఎన్‌సీసీ, క్యాప్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపడుతామని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ తెలిపారు. సీట్లు పొందినవారిలో 95శాతం సర్కారు బడుల్లోని విద్యార్థులే ఉండగా, కేవలం 5శాతం సీట్లను ప్రైవేట్‌ విద్యార్థులు సొంతం చేసుకున్నట్టు తెలిపారు.

2024-07-03T20:11:21Z dg43tfdfdgfd