ఇంకో వారం ఉంది ఆ లెక్క ఎక్కడికెళ్తుందో.. మంత్రి కోమటిరెడ్డి వీడియోతో యాంకర్ శ్యామల సెటైరికల్ ట్వీట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి జోరందుకుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. సమయాన్ని వృథా చేయకుండా గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇక ప్రధాన పార్టీల అభ్యర్తుల తరపున సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, యాంకర్లు ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పవన్ గెలుపుకోసం జబర్ధస్త్ ఆర్టిస్టులు ప్రచారం నిర్వహిస్తుండగా.. వైసీపీ అభ్యర్థుల తరపున యాంకర్ శ్యామల ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మెున్నటి వరకు ఏపీ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్‌గా ఉండి.. పవన్, చంద్రబాబులపై కామెంట్స్ చేసిన యాంకర్ శ్యామల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీడియోను షేర్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేసింది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. మెజార్టీ స్థానాలు సాధించటమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడికి దిగుతూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

అయితే బీఆర్ఎస్ పార్టీ సాధించే సీట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేర్వేరు చోట్ల సందర్భానుసారంగా రెండు కామెంట్లు చేశారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో రెండు సీట్లు కూడా రావని ఆ పార్టీకి రెండు సీట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. మరో చోట మీడియాతో మట్లాడిన కోమటిరెడ్డి కేసీఆర్‌కు 8 ఎంపీ సీట్లు వస్తే తాను రాజకీయాలు బంద్ చేస్తుంటానని.. సీట్లు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు బంద్ చేస్తారా? అని సవాల్ విసిరారు.

అందుకు సంబంధించిన వీడియో క్లిప్పులను షేర్ చేసిన యాంకర్ శ్యామల.. 'వారం వ్యవధిలో రెండు నుండి ఎనమిదికి వచ్చింది. ఇంకో వారం ఉంది.. ఎనమిది నుండి ఎక్కడికి పొద్దో ??? ప్రజలకు అర్థం అవుతుంది.. ఎవర్ని నమ్మాలి ఎవర్ని నమ్మకూడదు అని.' అని సెటైరికల్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నిజం చెప్పారని కొందరు అంటుండగా.. నీకు రాజకీయాలు అవసరమా? అని మండిపడుతున్నారు. ప్యాకేజీ తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెడుతున్నారని ఫైరవుతున్నారు. సినిమా ఆఫర్లు లేవని.. యాంకరింగ్ కూడా కష్టమేనని అందుకే రాజకీయాల్లోకి తొంగి చూస్తున్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T04:43:52Z dg43tfdfdgfd