ఎస్వీఆర్‌ పంతం.. ఆ సినిమా టైమ్‌లో ఎన్టీఆర్‌నే ఏడిపించాడు.. రామారావు భయపడేది ఆయనకేనా?

నటనలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ నువ్వా నేనా అనేలా ఉండేవారు. అయితే ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కి బాగా ఏడిపించాడట ఎస్వీఆర్‌. సినిమా మొత్తం చుక్కలు చూపించాడట. 

 

తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లు లాంటి వాళ్లు అని అంతా కొనియాడుతుంటారు. ఎస్వీఆర్‌ ప్రస్తావన చాలా తక్కువగా వస్తుంది. కానీ అప్పట్లో ఎస్వీఆర్‌ లేకుండా సినిమాలు ఉండేవి కావు, ఎన్టీఆర్‌ సినిమా అయినా, ఏఎన్నార్‌ మూవీ అయినా అందులో ఎస్వీఆర్‌ ఉండాల్సిందే అనేట్టుగా ఉండేది. అంతేకాదు ఈ ముగ్గురు కలిసి చాలా సినిమాలు చేశారు. అనేక విజయాలు అందుకున్నారు. 

 

కానీ అప్పట్లో ఎన్టీఆర్‌ డామినేషన్‌ ఎక్కువగా ఉండేది. ఆయన స్టార్‌డమ్‌, సినిమాలు ఆదరణ పొందడం, కలెక్షన్లు, ఎక్కువ రోజులు ఆడటం వంటి అనేక కారణాలతో ఎన్టీఆర్‌ ఓ మెట్టు ఎక్కువగా ఉండేవాడంటారు. నటన పరంగానూ, క్రమశిక్షణ విషయంలోనూ, సెట్‌లో వాతావరణంలోనూ ఎన్టీఆర్‌కి ఆ రెస్పెక్ట్ ఉండేది. కానీ నటన పరంగా ఎస్వీఆర్‌ తర్వాతే అనే వాళ్లు చాలా మందే ఉన్నారు. 

 

అంతేకాదు ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ భయపడేది ఒక్క ఎస్వీఆర్‌కి మాత్రమే అంటుంటారు. అంతేకాదు ఈ ఇద్దరికి పెద్దగా పడేది కాదట. నువ్వా నేనా అనేట్టుగానే ఉండేదని, ఎన్టీఆర్‌ సినిమాలంటే అంతా టైమ్‌కి వచ్చేవారని, కానీ ఎస్వీఆర్‌ మాత్రం తన టైమ్‌కి వచ్చేవారట. ఎన్టీఆర్‌ పెట్టే రూల్స్ ని కూడా ఫాలో అయ్యేవాడు కాదని, ఆ విషయంలో అవసరమైతే సినిమా నుంచి తప్పుకోవడానికి వెనకడుగు వేసేవారు కాదట. 

 

ఇద్దరు బావా, బావా అని పిలుచుకునే వారట. అంతటి సాన్నిహిత్యం ఉండేది. కానీ వర్క్ విషయంలో మాత్రం ఇద్దరికి ఇద్దరు నువ్వా నేనా అనేలా ఉండేవారని కైకాల సత్యనారాయణ తెలిపారు. ఎన్టీఆర్‌ తన ప్రొడక్షన్‌లో రూపొందించిన `ఉమ్మడి కుటుంబం` సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన తెలిపారు కైకాల. ఆ మూవీకి నాగభూషణం నటించిన జమిందార్‌ పాత్రకి మొదట ఎస్వీఆర్‌ని అనుకున్నారట. అయితే ప్రొడక్షన్‌ పరంగా కొన్ని రూల్స్ ఉండేవట. కాల్షీట్ల అగ్రిమెంట్లు ఉండేవని, దానికి సైన్‌ చేయమంటే ఎస్వీఆర్‌ చేయలేదు, అడ్జెస్ట్ చేసుకుందాం, ఫర్వాలేదు, జస్ట్ పద్దతి ప్రకారం వెళ్లాలి అంటే, నేను ఆ రూల్‌ ఫాలో కాను, నేను చేయాల్సింది చేస్తా అని అన్నాడట. 

 

ఎన్టీఆర్‌ కూడా ఆ విసయంలో తగ్గలేదట. దీంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట ఎస్వీఆర్‌. అంతేకాదు అడ్వాన్స్ కూడా తెల్లారి రివర్స్ ఇచ్చి పంపించాడట. పంతానికి పోతే ఎస్వీఆర్‌ ఎవరి మాట వినేవాడు కాదని, ఎంతకైనా వెళ్తారని, బతిమాలుకుంటే వాళ్లకోసం ఏమైనా చేస్తాడని తెలిపారు. 

 

ఈ క్రమంలో `శ్రీకృష్ణ సత్య` సినిమా షూటింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని చెబుతూ, ఆ మూవీ సమయంలోనూ ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌కి ఇలాంటి పంతాలే ఉండేవట. దీంతో ఎస్వీఆర్‌ రోజూ తాగి షూటింగ్‌కి వచ్చేవాడట. షూటింగ్‌ డిలే అయ్యేదట. సరిగా చేయలేకపోయాడట. డేట్స్ వేస్ట్ అయ్యేవట. ఇలా ఆ మూవీ షూటింగ్‌ టైమ్‌లో ఎన్టీఆర్‌ని బాగా ఏడిపించాడట ఎస్వీఆర్‌. ఓ రకంగా చుక్కలు చూపించాడట. 

 

`శ్రీ సత్య కృష్ణ` సినిమాకి కేవీ రెడ్డి దర్శకుడు. నిర్మాత ఎన్టీఆర్‌. అంతేకాదు రామారావు ఇందులో రాముడిగా, కృష్ణుడిగా, రావణ్‌గా నటించారు. ఎస్వీఆర్‌.. దుర్యోధనుడిగా, మహి రావణ్‌గా కనిపించారు. ఆ పాత్రకి ఆయన తప్ప మరెవ్వరూ వేయడానికి లేదు, ఆల్టర్‌నేట్‌ లేదు. దీంతో ఎస్వీరే వేయాలి. దీంతో ఆయన ఏం చెబితే అది చేయాల్సి వచ్చిందని, సినిమా షూటింగ్‌ మొత్తం ప్రాసెస్‌లో ఎన్టీఆర్‌కి ఏడుపు ఒక్కటే తక్కువ అని, పంతానికి పోతే అంతగా ఆడుకుంటాడని చెప్పారు కైకాల. 

 

కైకాల సత్యనారాయణ గతేడాది మరణించిన విషయం తెలిసిందే. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే షోలో ఈ విషయాలను కైకాల వెల్లడించారు. ఎస్వీఆర్‌ పంతం గురించి చెప్పుకొచ్చారు. ఆయన చాలా భోళా మనిషి అని, తనే అంటే గుండెల్లో పెట్టుకుంటాడని, తేడా చేస్తే దూరం పెడతాడని, రకరకాలుగా ఇబ్బంది పెడతాడని చెప్పారు కైకాల. ఈ రేర్‌ ఇంటర్వ్యూ విషయాలు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

2024-04-19T16:00:55Z dg43tfdfdgfd