ఏడు నెలలు అవుతోంది.. ఇజ్రాయెల్ అనుకున్నది సాధించిందా?

అక్టోబర్ 7న గాజా నుంచి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాస్ ఫైటర్లు దాదాపు 1,200 మందిని చంపి, వందల మందిని బందీలుగా తీసుకెళ్లి ఏడు నెలలవుతోంది.

దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ "హమాస్‌ను నాశనం చేస్తానని" ప్రతిజ్ఞ చేసింది.

అలా అయితేనే ఇకపై ఎలాంటి ముప్పు రాబోదని, బందీలను ఇంటికి తీసుకొస్తామని హామీ ఇచ్చింది.

ఆ తరువాత జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యం దాడులకు 33,000 మంది పాలస్తీనియన్లు మరణించారని, గాజాలో చాలా ప్రాంతం ధ్వంసమైందని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటోంది.

వేలాది మంది హమాస్ ఫైటర్లను హతమార్చామని, హమాస్ దాడులు చేయడానికి ఉపయోగించిన గాజా భూభాగంలోని సొరంగాల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బహిరంగ ప్రకటనలు, దాని సోషల్ మీడియా పోస్టుల ద్వారా పేర్కొన్న సాక్ష్యాలను బీబీసీ వెరిఫై పరిశీలించింది.

ఎంతమంది హమాస్ ఫైటర్లు చనిపోయారు?

ఐడీఎఫ్ కమాండర్లను ఉటంకిస్తూ పేర్కొన్న రిపోర్టుల ప్రకారం, అక్టోబర్ 7కి ముందు గాజాలో హమాస్‌కు దాదాపు 30,000 మంది ఫైటర్లు ఉన్నట్లు భావిస్తారు.

హమాస్ గ్రూపు లీడర్‌గా పరిగణిస్తున్న ఇస్మాయిల్ హనియెహ్ వంటి సీనియర్ రాజకీయ ప్రముఖులు విదేశాలలో నివసిస్తున్నారు. కానీ దాని సైనిక నాయకత్వం చాలావరకు గాజా లోపల ఉన్నట్లు చెబుతారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 13,000 మంది హమాస్ ఫైటర్లను చంపినట్లు ఇటీవల ఐడీఎఫ్ ప్రకటించింది.

అయితే ఆ సంఖ్యను ఎలా లెక్కించారో ఐడీఎఫ్ చెప్పలేదు. హత్యకు గురైనట్లు చెబుతున్న హమాస్ నాయకుల పేర్లను కూడా ఇజ్రాయెల్ ప్రచురించింది.

అక్టోబర్ నుంచి ఈ విధంగా మొత్తం 113 మంది పేర్లు బయట పెట్టారు, వీరిలో అత్యధికులు యుద్ధం మొదలైన మొదటి మూడు నెలల్లో మరణించినట్లు తెలిపారు.

వీటన్నింటినీ పరిశీలిస్తే ఇజ్రాయెల్ సైన్యం 2024 మార్చి వరకు గాజాలో హమాస్ సీనియర్ నాయకులను చంపినట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు.

మార్చి 26న, హమాస్ సైనిక విభాగం డిప్యూటీ కమాండర్ మార్వాన్ ఇస్సాను చంపేసినట్టు ఐడీఎఫ్ చెప్పినా, హమాస్ దానిని ధ్రువీకరించలేదు.

ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఆయన ఒకరు, హమాస్ అత్యంత సీనియర్ నాయకుడు కూడా. ఇస్సాను హత్య చేశారని అమెరికా విశ్వసిస్తోంది.

సీనియర్ హమాస్ నాయకులు అని చెప్పుకునే వ్యక్తులను చంపేసినట్టు ఐడీఎఫ్ కొందరి పేర్లను ప్రచురిస్తోంది, అయితే వాళ్లంతా హమాస్ సభ్యులో, కాదో ధృవీకరించడం కష్టం.

వారిలో ముస్తఫా తురయా, దక్షిణ గాజాలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న సమయం(జనవరి)లో ప్రమాదానికి గురయ్యారు.

ఐడీఎఫ్ జాబితాలో డూప్లికేట్ పేర్లను కూడా బీబీసీ కనుగొంది.

హమాస్ రాజకీయ నాయకుడు సలేహ్ అల్-అరౌరీ జనవరిలో బీరుట్ దక్షిణ శివారు దహియేలో జరిగిన పేలుడులో మరణించారు. ఆ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు.

మేం కొందరు నిపుణులతో మాట్లాడగా, యాహ్యా సిన్వార్‌తో సహా గాజాలోని అనేక మంది ప్రముఖ నాయకులు ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లు వారు విశ్వసిస్తున్నారు.

"హమాస్ అత్యున్నత నాయకులను ఐడీఎఫ్ పట్టుకోలేకపోయింది" అని ఇజ్రాయెల్-పాలస్తీనియన్ వ్యవహారాలపై సీనియర్ విశ్లేషకులు, ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌కు చెందిన మైరవ్ జోన్స్‌జీన్ అన్నారు.

గాజాలో ఎంతమంది బందీలున్నారు?

ఇజ్రాయెల్ అధికారిక గణాంకాల ప్రకారం, అక్టోబర్ 7న 253 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.

  • ఖైదీల మార్పిడి లేదా ప్రత్యేక ఒప్పందాలలో భాగంగా వీరిలో 109 మంది విడుదలయ్యారు.
  • ఇజ్రాయెల్ సైన్యం ముగ్గురిని రక్షించింది.
  • 12 మంది బందీల మృతదేహాలు స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్‌లో భాగంగా అందులో ముగ్గురిని చంపినట్లు ఐడీఎఫ్ అంగీకరించింది.

బందీలలో బతికి ఉన్న అత్యంత పిన్న వయసు వ్యక్తికి 18 సంవత్సరాలు, పెద్ద వ్యక్తికి 85 సంవత్సరాలు. మిగిలిన 129 మంది బందీలలో 34 మంది చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది.

అయితే, ఐడీఎఫ్ వైమానిక దాడుల ఫలితంగా చనిపోయిన బందీల సంఖ్య ఎక్కువగా ఉందని హమాస్ అంటోంది. ఈ ఆరోపణలను ధృవీకరించడం సాధ్యం కాదు.

హమాస్ బందీలుగా తీసుకున్న ఇద్దరు అతి పిన్న వయస్కుల పేర్లు ఏరియల్, ఖీర్. అపహరణ జరిగినప్పుడు వారి వయసు వరుసగా 4 ఏళ్లు, 9 నెలలు. ఇరువురి మరణాలు రిపోర్టయ్యాయి, కానీ ధృవీకరణ కాలేదు.

హమాస్ సొరంగ మార్గం ధ్వంసమైందా?

గాజా సొరంగం నెట్‌వర్క్‌ను నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సొరంగం మార్గం వస్తువులను, ప్రజలను తరలించడానికి హమాస్ ఉపయోగిస్తుంటుంది.

సొరంగం నెట్‌వర్క్ 500 కి.మీ వరకు విస్తరించి ఉందని హమాస్ గతంలో తెలిపింది, అయితే దీనిని స్వతంత్రంగా ధృవీకరించడానికి మార్గం లేదు.

టన్నెల్ నెట్‌వర్క్‌లో ఎంత శాతం, ఎన్ని సొరంగాలు నాశనం చేశారని మేం ఐడీఎఫ్‌ని అడిగాం.

తమ బలగాలు "గాజాలోని హమాస్ మౌలిక సదుపాయాలను చాలావరకు ధ్వంసం చేశాయని" అధికారులు తెలిపారు. ఐడీఎఫ్ అప్పుడప్పుడు వారు వెలికితీసిన హమాస్ సొరంగాల సాక్ష్యాలను చూపుతుంది.

ఉదాహరణకు గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రికి దిగువన ఉన్న సొరంగం నెట్‌వర్క్‌లోని కొంత భాగాన్ని హమాస్ కమాండ్ సెంటర్‌గా ఉపయోగిస్తున్నట్లు నవంబర్‌లో ఐడీఎఫ్ ఒక వీడియో విడుదల చేసింది.

ఇజ్రాయెల్ దళాలు వెలికితీసిన మొత్తం నెట్‌వర్క్ పరిధిని బీబీసీ వెరిఫై గుర్తించే ప్రయత్నం చేసింది.

2023 అక్టోబర్ 7 నుంచి 2024 మార్చి 26 మధ్య గాజాలో టన్నెల్స్‌గా చెబుతున్న ఐడీఎఫ్ టెలిగ్రామ్ సందేశాలను సమీక్షించింది. వీటిలో 198 సొరంగాలను కనుగొన్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది.

ఇక్కడ సొరంగాలు లేదా సొరంగం షాఫ్ట్‌లు(ప్రవేశ ద్వారాలు) ఉన్నాయని సైన్యం తెలిపింది. మరో 141 సందేశాలలో సొరంగాలు ధ్వంసం లేదా కూల్చినట్లుగా పేర్కొంది.

అయితే, వాటిలో చాలావరకు సొరంగాల ఖచ్చితమైన వివరాలు లేదా నిర్దిష్ట స్థానాలు ఇవ్వలేదు, కాబట్టి ఐడీఎఫ్ వెలికితీసిన లేదా నాశనం చేసినట్లుగా చెబుతున్న టన్నెల్స్ నెట్‌వర్క్ పరిధిని ధృవీకరించడం సాధ్యం కాదు.

గాజా భూగర్భం సొరంగం మార్గాలు, వివిధ పరిమాణాలలో గదులు ఉన్నాయి. అలాగే సొరంగం ఉపరితలంతో కలిసే కేంద్రాన్ని టన్నెల్ షాఫ్ట్‌లు అంటారు.

అందులో 400కి పైగా టన్నెల్ షాఫ్ట్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అయితే ప్రతి షాఫ్ట్‌ను మొత్తం సొరంగంగా పరిగణించడం తప్పు అని ఇజ్రాయెల్‌లోని రీచ్‌మాన్ విశ్వవిద్యాలయంలో బోధించే భూగర్భ యుద్ధ నిపుణుడు డాక్టర్ డాఫ్నే రిచెమండ్-బరాక్ చెప్పారు.

టన్నెల్ షాఫ్ట్‌లను ధ్వంసం చేసినంత మాత్రానా నెట్‌వర్క్‌ను పూర్తిగా నాశనం చేసినట్లు కాదని ఆమె అన్నారు.

"హమాస్ సొరంగం నెట్‌వర్క్ స్థాయి, లోతును చూస్తే దాని భూగర్భ సైనిక నిర్మాణాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యం" అని డాఫ్నే అభిప్రాయపడ్డారు.

17 లక్షలకు పైగా నిరాశ్రయులు: ఐక్యరాజ్యసమితి

ఇజ్రాయెల్ దాడిలో 33వేల మంది మరణించారని, వారిలో 70 శాతానికి పైగా మహిళలు, పిల్లలేనని హమాస్ ఆరోగ్య శాఖ ఆరోపిస్తోంది.

హమాస్ మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో జనం వారి ఇళ్లను వదిలి వెళ్లిపోయారు, నిరాశ్రయులయ్యారు.

ఐక్యరాజ్యసమితి ప్రకారం 17 లక్షలకు పైగా ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లారు. వారి నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయి, గాజాలో సందడిగా ఉండే వీధులు శిథిలాలుగా మారాయి.

విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. శాటిలైట్ డేటా విశ్లేషణ ప్రకారం అక్టోబర్ 7 నుంచి గాజాలో 56 శాతానికి పైగా భవనాలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి.

యుద్ధం ప్రారంభమై ఆరు నెలలైనా ఇజ్రాయెల్ యుద్ధంలో తన లక్ష్యాలను చేరుకుందో లేదో ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-05-09T02:03:26Z dg43tfdfdgfd