ఐకే గుజ్రాల్: ‘నాతో మాట్లాడాలనుకుంటే మర్యాదగా మాట్లాడు’ అని సంజయ్ గాంధీతో ఎందుకు అన్నారు?

10 నెలల 27 రోజులు. ఇందర్ కుమార్ గుజ్రాల్ భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలం అది. తక్కువ కాలమే అయినప్పటికీ భారత రాజకీయాల పట్ల ఆయన అవగాహన, విదేశాంగ విధానంలో ఆయన కృషి ఏ మాత్రం విస్మరించరానిది.

ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులైన మంత్రులలో గుజ్రాల్‌ కూడా ఒకరిని భావించేవారు. తర్వాత ఆయన ఆమెకు ఎదురు తిరిగారు. ఎమర్జెన్సీ కాలంలో పత్రికల మీద సెన్సార్ ‌షిప్ విధించడాన్ని ఆయన వ్యతిరేకించారు. దీంతో ఆయన మంత్రి పదవి పోయింది.

గుజ్రాల్ పార్టీకి విధేయుడని కాంగ్రెస్ అధిష్టానం భావించినప్పటికీ, ఆయన ఎప్పుడు వామపక్షాలను విమర్శిస్తూ ఉండేవారు. 90లలో గుజ్రాల్ విజ్ఞుడైన రాజకీయ వేత్త అనే పేరు సంపాదించుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆయనకు రాజకీయ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటమే దీనికి కారణమై ఉండవచ్చు.

పొరుగు దేశాలతో భారతదేశం సంబంధాలు కావచ్చు, అణువిధానం కావచ్చు, గుజ్రాల్ ఆలోచనలు కొన్నిసార్లు సమయానికి తగినట్లు, మరి కొన్ని సార్లు భవిష్యత్ పరిణామాలకు అనుగుణంగా సాగేవి.

అనుకోకుండా భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఐకే గుజ్రాల్ కథ స్వాతంత్ర్యానికి పూర్వం ప్రస్తుత పాకిస్తాన్‌లో మొదలైంది.

పాకిస్తాన్‌తో ఆయనకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ప్రస్తుత పాకిస్తాన్‌లో పుట్టారు. ఆయన తండ్రి అవతార్ నారాయణ్ పాకిస్తాన్ రాజ్యాంగ సభలో సభ్యుడు.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జీలం జిల్లాలోని పరి దర్వేజా అనే గ్రామంలో 1919 డిసెంబల్ 4న గుజ్రాల్ జన్మించారు. లాహోర్‌లో చదువుకున్నారు.

విద్యార్ధి దశలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఐకే గుజ్రాల్ చాలే జావ్ ఉద్యమంలో భాగంగా జైలుకు వెళ్లారు.

భారత దేశం విడిపోయిన తర్వాత గుజ్రాల్ కుటుంబం కొంత కాలం పాటు పాకిస్తాన్‌లోనే ఉంది. అవతార్ నారాయణ్ న్యాయవాది కావడంతో ఆయన కాంగ్రెస్‌లో ఉత్సాహంగా పని చేసేవారు. దీంతో ఆయనకు వెస్ట్ పంజాబ్ రాజ్యాంగ సభలో స్థానం దక్కింది.

దేశం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం పాకిస్తాన్‌లోకి రావడంతో, సహచరుల విజ్ఞప్తి మేరకు ఆయన పాకిస్తాన్‌లోనే ఉన్నారు. 1949లో ఆయన కుటుంబం భారత్‌కు వచ్చింది.

ఇందర్ కుమార్ గుజ్రాల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంత కాలం తర్వాత రాజకీయాల్లో చురుగ్గా మారారు. ఇందిరా గాంధీకి సన్నిహితులైన రాజకీయ నాయకుల బృందంలో చోటు సంపాదించుకున్నారు.

అత్యవసర పరిస్థితి, సెన్సార్‌షిప్‌ను వ్యతిరేకించిన గుజ్రాల్

1975లో గుజ్రాల్ కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ లోక్‌సభ సభ్యత్వాన్నిర్దు చేసింది. ఈ సమయంలోనే సంజయ్ గాంధీ గుజ్రాల్‌ను పిలిచారు.

సంజయ్ గాంధీకి అప్పుడు అధికారికంగా ఎలాంటి పదవి లేదు. అయినప్పటికీ మీడియా, రేడియోల్లో ఏమేం ప్రసారం చేయాలనే దానిపై ఆయన గుజ్రాల్‌కు సూచనలు ఇచ్చారు.

అయితే గుజ్రాల్‌ మౌనంగా ఉండే వ్యక్తి కాదు. సంజయ్‌గాంధీకి ఆయన ఎదురు చెప్పేవారు.

జర్నలిస్టు నీర్జా చౌదరి రాసిన “ హౌ ద ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్” పుస్తకంలో ఓ సంఘటన గురించి వివరించారు. రేడియో వార్తలలో మొదట తన గురించి చెప్పాలని సంజయ్ గాంధీ గుజ్రాల్‌ను ఆదేశించారు.

“వార్తల్లో నీ గురించి చెప్పలేను, మీ అమ్మ గురించి చెబుతాను. నీది నా కుమారుడి వయసు. నాతో మాట్లాడాలని అనుకుంటే మర్యాదగా మాట్లాడు” అని గుజ్రాల్ సంజయ్ గాంధీతో చెప్పారు.

ఈ వ్యవహారంలో ఇందిరా గాంధీ కుమారుడి వైపు మొగ్గారు. ఎమర్జెన్సీ అమలు చేసిన తొలి రోజే గుజ్రాల్‌ను ప్రణాళికా సంఘానికి పంపించారు. తర్వాత ఆయనను మాస్కోలో భారత రాయబారిగా నియమించారు.

మాస్కో, సద్దాంతో ఫోటో, ప్రవాస భారతీయుల తరలింపు

గుజ్రాల్ తరువాత కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీలో చేరారు. కానీ ఎమర్జెన్సీ తరువాత జనతా ప్రభుత్వం ఆయనను మాస్కోలోనే కొనసాగించింది.

గుజ్రాల్ రాయబారిగా ఉన్న సమయంలో అప్పటి సోవియట్ రష్యా, భారత్ సంబంధాలు మరింతగా మెరుగుపడ్డాయి. అందుకే అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ మాస్కో బాధ్యతలు చూసుకోవాల్సిందిగా గుజ్రాల్‌ను స్వయంగా కోరారు.

తరువాత వీపీ సింగ్ ప్రధాని అయిన తరువాత గుజ్రాల్‌ను విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగా నియమించారు. ఆ సమయంలోనే గల్ఫ్ యుద్దం వచ్చింది.

ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన కువైట్‌ను ఆక్రమించారు. దీంతో కువైట్‌లో వేలాదిమంది భారతీయులు చిక్కుకుపోయారు. వారు అక్కడ నుంచి తప్పించుకునే మార్గాలు వెదకడం మొదలుపెట్టారు.

విదేశాంగ మంత్రి గుజ్రాల్ అమెరికాను ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ సఫలం కాలేకపోయారు. ఆపైన గుజ్రాల్ నేరుగా 1990 ఆగస్టు 19న బాగ్దాద్‌కు వెళ్ళి సద్దామ్‌ హుస్సేన్‌ను కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో బయటకు రావడంతో వివాదం రేగింది.

తన పుస్తకం ‘మేటర్స్ ఆఫ్ డిస్క్రీషన్, యాన్ ఆటోబయోగ్రఫీ’ లో ఆ మీటింగ్ గురించి గుజ్రాల్ వివరించారు.

‘‘సద్దాం హుస్సేన్ మిలటరీ యూనిఫామ్ ధరించి ఉన్నారు. ఆయన నడుం దగ్గర పిస్తోలు ఉంది. ఆయన నన్ను చూడగానే కౌగిలించుకున్నారు. ఆ ఫోటో ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికలలోనూ ప్రచురితమైంది. ప్రపంచమంతా సద్దాం చర్యలను ఖండిస్తున్న తరుణంలో మేం ఆ ఫోటో ప్రచురణ వల్ల కొంత ఇబ్బందికి గురయ్యాం. భారత విదేశాంగ మంత్రి సద్దాంను కౌగిలించుకున్నారనే సందేశం ఆ ఫోటో ద్వారా ప్రపంచమంతా వెళ్ళింది’’

అయితే ఫోటో సంగతి ఎలా ఉన్నా, సద్దాంతో చర్చల అనంతరం గుజ్రాల్ ఇరాక్ విదేశాంగమంత్రి తారిక్ అజీజ్‌ను కలుసుకుని, భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి సంబంధించిన ప్రణాళికను వివరించారు.

గుజ్రాల్ ఆగస్టు 22న బాగ్దాద్ నుంచి కువైట్ చేరుకున్నారు. భారత రాయబార కార్యాలయం ముందు కారుపైకి ఎక్కి అక్కడ గుమికూడిన వేలాదిమంది భారీయులనుద్దేశించి మాట్లాడారు. ఆ తరువాత రోజు దిల్లీకి తిరిగి వచ్చారు.

ఆయనతోపాటు ఓ గర్భిణి సహా 150మంది భారతీయులు, కువైట్‌లో నివసిస్తున్న భారతీయులు తమ కుటుంబాలకు రాసిన లేఖలతో కూడిన బ్యాగ్‌ను తీసుకుని ఆయన దిల్లీకి చేరారు.

దీని తరువాత కొన్ని కష్టాలు ఎదురైనా లక్షా 70వేలమంది భారతీయులను ఎయిర్ ఇండియా విమానాల ద్వారా కువైట్ నుంచి వెనక్కు తీసుకురాగలిగారు.

పౌరవిమానాల ద్వారా ఇంతమందిని తరలించడం చరిత్రలో అతిపెద్ద రక్షణ కార్యక్రమంగా నిలిచింది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులోనూ నమోదైంది.

గుజ్రాల్ సిద్ధాంతం

హెచ్.డి. దేవెగౌడ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ 1996లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గుజ్రాల్ విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈజిస్ట్, దక్షిణాఫ్రికాలలో పర్యటించారు.

రెండు తడవలు విదేశాంగ మంత్రిగానూ, ప్రధానిగానూ గుజ్రాల్ భారతదేశం కోసం ఓ వ్యూహాత్మక దార్శనిక విధానాలను రూపొందించారు. దానినే ‘గుజ్రాల్ సిద్ధాంతం’ లేదంటే ‘గుజ్రాల్ ప్రిన్సిపల్స్’ అంటారు.

ఈ సిద్ధాంతం ప్రకారం భారతదేశం తన భద్రత విషయంలో రాజీ పడకుండా, ప్రతిదానికీ సాయం ఆశించకుండా పొరుగునున్న దేశాలకు సాయపడాలి.

ఈ సిద్ధాంతాన్ని చూసిన కొందరు నిపుణులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తరువాత దార్శనితక కలిగిన మరో ప్రధానిగా గుజ్రాల్‌ను అభివర్ణించారు.

అయితే ఈ సిద్ధాంతం అమలుపై అసమ్మతి కూడా ఉంది.

ఎందుకంటే ఈ సిద్ధాంతం వల్ల భారత్, పాకిస్తాన్ సంబంధాలలో తక్షణం పెద్ద మార్పేమీ తీసుకురాదు. పైగా పొరుగునున్న చిన్న దేశాలు మెరుగైన సంబంధాలను తమ దౌత్య విజయంగా చెప్పుకుంటున్నందున గుజ్రాల్‌కు దక్కాల్సిన ఘనత కూడా దక్కలేదు.

ఇందుకు ఉదాహరణ చెప్పుకోవాలంటే 1996లో గుజ్రాల్ విదేశాంగ మంత్రిగా బంగ్లాదేశ్‌తో ఉన్న గంగా నీటి వాటాల సమస్యను పరిష్కరించారు. ఇందుకోసం ఆయన బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వాన్ని, పశ్చిమబెంగాల్‌లోని కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని ఒప్పించారు. నిజానికి ఇది అంత తేలికైన పనికాదు.

కానీ వాస్తవంలో భారత్ విదేశాంగ విధానం రీత్యా చూసినప్పుడు ఈ ఒప్పందం ద్వారా పెద్దగా లాభపడిందేమీ లేదు. తరువాత బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత క్రమంగా ఇరుదేశాల మధ్య కొంతకాలం సంబంధాలు క్షీణించాయి.

భారత్, పాకిస్తాన్ సంబంధాల విషయంలో గుజ్రాల్ వ్యక్తిగత స్థాయులో ఓ వారధిలా పనిచేశారు. ఆయన పాకిస్తాన్ నాయకులతో సన్నిహితంగా ఉండటమే కాకుండా, ఆ దేశంలోని మానవ హక్కుల కార్యకర్తలతో, మేథావులతోనూ సన్నిహితంగా ఉండేవారు.

చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఆయన పాకిస్తాన్‌ను సందర్శించి, అక్కడి సామాన్య ప్రజలను కలుసుకునేవారు.

మొత్తం మీద గుజ్రాల్‌ను ఓ శాంతి కాముకుడిగా చిత్రీకరించారు. ఆయన భారత ప్రధాని అయ్యాక కూడా విదేశాంగ శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు.

గుజ్రాల్ ప్రధానిగా ఉన్న సమయంలోనే రసాయన ఆయుధాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది.

కానీ సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందాన్ని గుజ్రాల్ వ్యతిరేకించినట్టు కనిపిస్తోంది.

అందు వల్లే గుజ్రాల్ తరువాత ప్రధాని అయిన అటల్ బిహారి వాజ్‌పేయ్ ప్రభుత్వం 1998లో అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించగలిగింది.

భారత అణ్వస్త్ర విధానం

ప్రధానమంత్రిగా చివరి కొన్ని నెలల్లో గుజ్రాల్ అణు పరీక్ష అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారని నీర్జా చౌదరీ రాశారు.

కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకోవడంతో గుజ్రాల్ ప్రభుత్వం పడిపోయింది. అయితే, ఎన్నికల వరకు ఆయన తాత్కాలిక ప్రధానిగా కొనసాగారు.

అణు పరీక్షపై నిర్ణయం తీసుకునే ముందు, భారత్ ఈ పరీక్షల కోసం సన్నద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. అందుకే 1998లో అప్పటి డీఆర్‌డీవో చీఫ్‌ ఏపీజే అబ్దుల్‌ కలాంను గుజ్రాల్‌ కలిశారు.

“నేషనల్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించేందుకు గుజ్రాల్, హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ కార్యక్రమం తర్వాత లంచ్ సమయంలో ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను చూపించడానికి గుజ్రాల్‌ను అక్కడికి తీసుకెళ్లాం. కలాం, కె. సంతానంకు మాత్రమే గుజ్రాల్ పర్యటన గురించి తెలుసు’’ అని గుజ్రాల్‌కు అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎం.ఎన్. వోరా, నీర్జా చౌదరీకి చెప్పారు.

అణు పరీక్షకు పచ్చజెండా ఊపాలని జనవరిలో గుజ్రాల్ నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎంతమందికి, ఎవరికి ఈ పరీక్ష గురించి చెప్పాలో ఆయన చర్చించారు. శాస్త్రవేత్తలతో ఆయనే నేరుగా మాట్లాడేవారు.

అయితే, ఎన్నికల ప్రక్రియ మొదలు కానున్నందున అప్పుడే అణుపరీక్ష చేయొద్దని వోరా వారికి సూచించారు.

రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ కూడా ఇదే సలహా ఇవ్వడంతో గుజ్రాల్ అణుపరీక్ష నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని నీర్జా చౌదరి రాశారు.

తర్వాత, వాజ్‌పేయి ప్రభుత్వం 1998 మే 11, 13 తేదీల్లో పోఖ్రాన్‌లో అణు పరీక్షల్ని నిర్వహించింది.

దీంతో దేశంలోని శాస్త్రవేత్తల కృషిని గుజ్రాల్ అభినందించారు. అయితే బీజేపీ నేతృత్వంలోని కూటమి ఈ మొత్తం పరిస్థితిని నిర్వహించిన తీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వాజ్‌పేయికి గుజ్రాల్ లేఖ రాశారు.

1998 మే 29న రాజ్యసభలో మాట్లాడిన గుజ్రాల్ ఆ లేఖను గురించి ప్రస్తావించారు. ‘‘ఈ విజయాన్ని మీ పార్టీ విజయంగా చూడకండి. ఇది మీ పార్టీ విజయం కాదు’’ అని వాజ్‌పేయిని ఉద్దేశించి గుజ్రాల్ అన్నారు.

ప్రధానమంత్రిగా.......

గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21 నుంచి 1998 మార్చి 19 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. ముందుగా చెప్పుకున్నట్టుగా ఆయనకు ఈ పదవి అనూహ్యంగా దక్కింది.

1996 ఎన్నికల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం రెండు వారాల్లో పడిపోయింది. అప్పుడు యునైటెడ్ ఫ్రంట్‌, జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చింది. హెచ్.డి. దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు పలికింది.

అయితే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏడాదిలోపే ఈ ప్రభుత్వం పడిపోయింది.

అప్పుడు, మళ్లీ ఎన్నికలను నివారించడానికి, ఇందర్ కుమార్ గుజ్రాల్ పేరును ముందుకు తెచ్చారు. కాంగ్రెస్ బయటి నుంచి ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత గుజ్రాల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

గుజ్రాల్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే ఆయన సహచరుడు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేరు దాణా కుంభకోణం కేసులో చర్చనీయాంశమైంది. గుజ్రాల్ దానిపై చర్య తీసుకోవడానికి నిరాకరించారు. లాలూ యాదవ్ కారణంగానే గుజ్రాల్ బిహార్ నుంచి రాజ్యసభ సీటు పొందారు.

గుజ్రాల్ ప్రభుత్వం అప్పటి సీబీఐ డైరెక్టర్‌ను బదిలీ చేసింది. ఇది చాలా మంది ఆగ్రహానికి కారణమైంది.

ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఎమర్జెన్సీ విధించాలని గుజ్రాల్ సిఫార్సు చేశారు. అయితే, రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ దాన్ని వెనక్కి పంపారు. అలహాబాద్ హైకోర్టు కూడా ఉత్తరప్రదేశ్‌లో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తీర్పునిచ్చింది.

ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన ఒక మధ్యంతర నివేదికపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తాయి.

ఈ నివేదికలో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీ నాయకులు శ్రీలంకలోని ఎల్టీటీఈ మద్దతుదారులకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. (రాజీవ్ గాంధీ హత్యకు ఎల్టీటీఈ బాధ్యత వహించింది.)

డీఎంకే మంత్రులందరినీ ప్రభుత్వం నుంచి తొలగించాలని లేదా వారి మద్దతును ఉపసంహరించుకోవాలని గుజ్రాల్‌ను కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గుజ్రాల్ ఈ డిమాండ్‌ను తిరస్కరించారు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది. అయితే, తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు అధికారంలో ఉండాలని గుజ్రాల్‌ను రాష్ట్రపతి నారాయణన్ సూచించారు.

కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరూ విజయం సాధించలేదు. చివరకు ఎన్నికలు ప్రకటించారు. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదమూడు నెలల్లోనే పడిపోయి మళ్లీ ఎన్నికలు జరిగాయి.

1999 ఎన్నికల్లో గుజ్రాల్ పోటీ చేయలేదు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

2024-05-09T09:29:36Z dg43tfdfdgfd