ఐస్‌క్రీమ్‌ లేడీ

డిగ్రీ పట్టా చేతికి రాకముందే అమ్మానాన్నలు ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టారు. ఆ వరుణ్ని ఒప్పించిన వధువు పట్టా సాధించేదాకా పుట్టింటే ఉంది. ఆ తర్వాత అత్తవారింట అడుగుపెట్టి.. వంటశాలనే ప్రయోగశాలగా చేసుకుంది. అత్తింటి వారిని ఒప్పించి.. ఇంట్లోనే ఓ మూలకు చిన్న బేకరీని మొదలుపెట్టింది. ఆ బేకరి పెరిగి పెద్దదై ఎనిమిది వేల కోట్ల రూపాయల కంపెనీగా ఎదిగింది. క్రిమికా, ఇంగ్లిష్‌ ఓవెన్‌ బ్రాండ్ల పేరుతో భారతీయులు ఇష్టంగా తింటున్న బేకరీ తినుబండారాలన్నీ ఆ వంటింటి ప్రయోగాల్లో రజనీ బెక్టార్‌ కనిపెట్టినవే! ‘ఐస్‌క్రీమ్‌ లేడీ ఆఫ్‌ ఇండియా’గా గౌరవం పొందుతున్న స్వతంత్ర భారత తొలితరం వ్యాపారవేత్త జీవన చిత్రమిది..

కరాచీలోని ఒక ఉన్నత కుటుంబంలో పుట్టింది రజని. వాళ్ల నాన్న అకౌంటెంట్‌ జనరల్‌గా పని చేసేవాడు. తమ బంధువుల్లో అత్యధికులు ప్రభుత్వ శాఖల్లో ఉన్నతోద్యోగాలు చేసేవాళ్లు. దేశ విభజన సమయంలో రజని తల్లిదండ్రులు పిల్లాజెల్లాతో ఇండియాకు బయలుదేరారు. అప్పుడు ఆమె వయసు ఆరేండ్లు. ఆనాడు మత కలహాలు పెచ్చరిల్లాయి. ప్రభుత్వ శాఖల్లో అధికారులుగా ఉన్న బంధువుల సహకారంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం లేకుండా బయటపడేందుకు వాళ్లకు దారి దొరికింది. ఎట్టకేలకు ఇండియా చేరుకునేందుకు ఓ రైలు వాళ్ల కంటపడింది. ‘హమ్మయ్య.. ఇక ప్రాణానికి ముప్పు లేదు ’ అనుకున్నారు. కానీ, దగ్గరికి పోయి చూస్తే ఆ రైలు శవాలతో నిండి ఉంది. ఇండియా చేరుకోవాలవాలంటే ప్రయాణించాల్సింది శవాలతో..!

ఆ భయానక పరిస్థితుల్లో గుండె ధైర్యం చేసుకుని రజని కుటుంబం ఇండియాలోకి ప్రవేశించింది.

పెండ్లి నాటి ప్రమాణం

దారి పొడవునా ఎదురైన ప్రమాదాలను అధిగమిస్తూ చివరికి రజని తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకున్నారు. అక్కడే స్థిరపడ్డారు. ఆమె విద్యాభ్యాసం అక్కడే సాగింది. రజనీకి పదిహేడేండ్లు రాగానే ఇంట్లోవాళ్లు పెండ్లి నిశ్చయించారు. లూథియానాలోని వ్యాపార కుటుంబానికి చెందిన ధరమ్‌వీర్‌ వరుడు. అప్పుడు ఆమె ఢిల్లీలోని మిరిండా హౌస్‌లో డిగ్రీ చదువుతున్నది. ఆమెకు జీవితంలో ఎదగాలనే కోరిక ఉంది. చదువు కొనసాగించడానికి అడ్డుచెప్పనంటేనే పెండ్లికి ఓకే చెప్తానంది రజని. అతనూ ఒప్పుకొన్నాడు. పెండ్లయ్యాక డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత అత్తగారింటికి ప్రయాణమైంది.

మెట్టినింటి ప్రయోగాలు

రజని భర్త ఎరువులు, ధాన్యం వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆమె ఇంటి పనులు చేసుకునేది. కొన్నాళ్లకు ఆమె ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చింది. కాస్త పెద్దవాళ్లయ్యాక పిల్లల్ని హాస్టల్‌లో చేర్పించి చదువు చెప్పించారు. అప్పుడు ఆమెకు కొంత తీరిక సమయం దొరికింది. ఇంకేం తనకు ఇష్టమైన బేకింగ్‌ (కేకులు, రొట్టెల) తయారీ మొదలుపెట్టాలనుకుంది. కేకుల తయారీ నేర్చుకోవాలని పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరింది. ఇంటికి వచ్చాక బేకరీ ఐటమ్స్‌తో ప్రయోగాలు చేస్తూ ఉండేది. అలా చేసిన తినుబండారాలను రుచి చూసేందుకు రావాలని బంధువులు, స్నేహితుల్ని ఇంటికి పిలిచేది. వాటిని తిన్న వాళ్లంతా నువ్వు సొంతంగా వ్యాపారం చేస్తే పైకొస్తావని సలహాలిచ్చారు. వాళ్లందరి ప్రోత్సాహంతో 1978లో ఇంట్లోనే ఓ మూలకు చిన్న బేకరీని ప్రారంభించింది. తన శ్రమకు భర్త సహకారం తోడైంది. 20 వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టింది. ఆ తర్వాత కాలంలో చిన్నచిన్న లాభాలు అందుకుంటూ పెద్ద పెద్ద లక్ష్యాల వైపు అడుగులు వేసింది.

కిచెన్‌ టు కార్పొరేట్‌ కంపెనీ

రజని బేకరీ ఉత్పత్తులకు నానాటికీ ఆదరణ పెరిగింది. కొన్నాళ్లకు తన ఉత్పత్తులకు ఒక బ్రాండ్‌ నేమ్‌ ఉండాలని నిర్ణయానికి వచ్చింది. ‘క్రిమికా’ అనే బ్రాండ్‌ని రిజిస్టర్‌ చేసి, ఆ పేరుతో రకరకాల బిస్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. తను తయారు చేసే ఐస్‌క్రీమ్‌లు బాగున్నాయనే పేరు వచ్చింది. కస్టమర్ల సంఖ్యా పెరుగుతూ పోయింది. కొన్నేండ్లు గడిచిపోయాయి. తన బేకరీలో రోజుకు 50 వేల డబల్‌ రొట్టెలు తయారు చేయించే స్థాయికి ఆమె వ్యాపారం ఎదిగింది. ఒక్క బన్నులే కాదు బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, జామ్‌లు కూడా ఉత్పత్తి చేసేది. సంస్థ విస్తరించింది. పనివాళ్లూ పెరిగారు. ఆదాయమూ హెచ్చింది. పెరటిలో ప్రారంభమైన చిరు పరిశ్రమ కంపెనీ స్థాయికి ఎదిగింది.

నాణ్యతే గెలుపు సూత్రం

కొనుగోలుదారు కోరుకునే కమ్మని రుచిని అందిస్తే ఆదరిస్తారన్నది రజని నమ్మకం. అది వమ్ము కాలేదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఆమె ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. నాణ్యతను పాటిస్తూనే ఉంటుంది. మార్కెట్లోకి పరిచయం చేసిన ఏ ఉత్పత్తినీ వెనక్కి తీసుకోలేదు. వాటికి అంతలా డిమాండ్‌ ఉంది. మరోవైపు ‘ఇంగ్లిష్‌ ఓవెన్‌’ బ్రాండ్‌ తీసుకొచ్చింది. ఈ పేరుతో తయారయ్యే బ్రెడ్లు, సాస్‌, కెచప్‌, చట్నీలు, సిరప్‌లు, జామ్‌లకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉన్నది. సాధారణ అవుట్‌లెట్‌లు మాత్రమే కాదు పెద్ద పెద్ద కంపెనీలు ఇంగ్లిష్‌ ఓవెన్‌తో ఒప్పందం చేసుకుని పిజ్జాలు, బర్గర్ల వ్యాపారం చేస్తున్నాయి. ఈ విజయాలతో బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, బన్నుల మార్కెట్లో బహుళజాతి కంపెనీలతో పోటీ ఉన్నా రజని వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం 20 వేల రూపాయలతో ఇంటిలో ప్రారంభమైన బెక్టార్స్‌ ఫుడ్‌ బేకరీ పరిశ్రమ రూ.8,000 కోట్ల విలువ గల సంస్థగా ఎదిగింది. ఉత్పత్తుల్లో నాణ్యత తమ గెలుపు సూత్రం అంటుందామె. ఆ విజయ సూత్రమే రజనిని ‘ఐస్‌క్రీమ్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుచుకునేంత పాపులర్‌ చేసింది.

చీకటి రోజులు

1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. సిక్కులకు వ్యతిరేకంగా దాడులు మొదలయ్యాయి. ఆస్తులు ధ్వంసం చేయసాగారు. ఒక అల్లరి మూక రజని పెద్దకొడుకు అక్షయ్‌ని కిడ్నాప్‌ చేసింది. వాళ్ల నుంచి ఆ కుర్రాడు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు ఏడాది పాటు వ్యాపారం మూతపడింది. ఆర్థికంగా కుదేలైంది. పోయిన చోటే వెతుక్కోవాలన్నది రజని నమ్మిన సిద్ధాంతం. మళ్లీ వ్యాపారం మొదలుపెట్టింది. అదే ఏడాది అనుకోని అవకాశం రజని తలుపు తట్టింది. మెక్‌ డొనాల్డ్స్‌ కంపెనీ బన్నుల సరఫరా కోసం ఆమెతో ఒప్పందం చేసుకుంది. ఈ విజయం ఆమె ప్రస్థానంలో ఓ మైలురాయి మాత్రమే! తర్వాత ఆమె ఎన్ని మైలురాళ్లు దాటిందో లెక్కలేదు.

2024-07-02T21:56:26Z dg43tfdfdgfd