కంటి చికిత్సకు వెళ్లాలనుకున్న వీరప్పన్‌ను సినీ ఫక్కీలో పోలీసులు ఎలా బోల్తా కొట్టించారు? ఆఖరి క్షణాల్లో జరిగిన డ్రామా ఏంటి?

‘‘వీరప్పన్ అడవిలోనే ఉండి ఉంటే, అసలు చనిపోయేవారే కాదు.’’

ఈ మాటలు అన్నది వీరప్పన్ సహచరులో లేదా స్నేహితులో కాదు. వీరప్పన్‌ను చంపిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందంలో కీలక పాత్ర పోషించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సెంథామరై కన్నన్ చెప్పిన మాటలివి. వీరప్పన్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో సెంథామరై కన్నన్ ముఖ్యుడు.

‘‘అతనికి ఎలాంటి బలహీనతలు లేవు. మద్యం తాగడు. స్త్రీలపై వ్యామోహం లేదు. దేవుడికి భయపడేవాడు. జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవాడు. తనకు నచ్చింది చేసేవాడు. జీవితంలో చాలా రక్తాన్ని చూశాడు. దేనికీ భయపడడు. పిరికివాడు కాదు’’ అని వీరప్పన్ గురించి సెంథామరై కన్నన్ వివరించారు.

దశాబ్ద కాలానికి పైగా వీరప్పన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమైన తమిళనాడు పోలీసులకు 2004 అక్టోబర్ 18వ తేదీ చిరస్మరణీయమైనది.

ఆపరేషన్ కుకూన్

అయితే, తొలిసారి అడవి నుంచి బయటకు వచ్చిన వీరప్పన్‌ను ధర్మపురి జిల్లా పాపిరెట్టిపట్టి సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కాల్చి చంపారు.

వీరప్పన్‌ను చంపడం కోసం నిర్వహించిన ‘‘ఆపరేషన్ కుకూన్’’‌కు తమిళనాడు టాస్క్‌ఫోర్స్ అధిపతి విజయ్ కుమార్, టాస్క్‌ఫోర్స్‌లోని ఇంటెలిజెన్స్ వింగ్ స్పెషల్ ఎస్పీ సెంథామరై కన్నన్‌లు నేతృత్వం వహించారు.

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చివరి క్షణాల గురించి చాలా షాకింగ్ సమాచారం అందుబాటులో ఉంది. కానీ, ఈ విషయంలో టాస్క్‌ఫోర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

వీరప్పన్ మృతిపై ఊహాగానాలు మాత్రమే ఉన్న సమయంలో, 2017లో ఐపీఎస్ విజయ్ కుమార్ రాసిన ‘చేజింగ్ ద బ్రిగేడ్’ అనే పుస్తకం బయటకు వచ్చింది. ‘‘ఆపరేషన్ కుకూన్’’కు నేతృత్వం వహించిన విజయ్ కుమార్ స్వయంగా ఈ పుస్తకాన్ని రాశారు. ఆపరేషన్ కుకూన్‌ ఎలా జరిగింది? వీరప్పన్‌ను ఏ రీతిలో చంపేశారు? అనే విషయాలను ఈ పుస్తకంలో ఆయన రాశారు.

వీరప్పన్‌ జీవిత కథ నేపథ్యంగా తీసిన ‘ద హంట్ ఫర్ వీరప్పన్’ అనే డాక్యుమెంటరీ 2023 ఆగస్టులో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో వీరప్పన్ చివరి రోజుల గురించి మాజీ ఎస్పీ సెంథామరై కన్నన్ చెప్పిన విషయాలకు, విజయ్ కుమార్ పుస్తకంలో రాసిన విషయాలకు మధ్య వైరుధ్యం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

కంటి సమస్యతో బాధపడుతున్న వీరప్పన్ చికిత్స పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ తర్వాత ఎల్టీటీఈలో చేరేందుకు శ్రీలంక వెళ్లనున్నారనే సంగతి తెలుసుకున్న విజయ్ కుమార్, సెంథామరై కన్నన్‌లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహం రచించారు. వీరప్పన్‌ను హతమార్చేందుకు ‘ఆపరేషన్ కుకూన్’ అనే ప్రణాళిక రచించినట్లు విజయ్ కుమార్, సెంథామరై కన్నన్ చెప్పారు.

వీరప్పన్‌తో టచ్‌లో ఉన్న టాస్క్‌ఫోర్స్ అధికారి ఎవరు?

‘‘ఈ విషయమే అనేక సందేహాలకు తావిచ్చింది. వీరప్పన్ చనిపోయినప్పటి నుంచి, అతన్ని ఎలా చంపారనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఇద్దరూ దీని గురించి స్పష్టంగా చెప్పలేదు. విజయ్‌కుమార్ తన పుస్తకంలో చాలా విషయాలను దాచిపెట్టారు. అలాగే సంథామరై కన్నన్ కూడా తన ప్రసంగాల్లో చాలా అంశాలను బయటపెట్టలేదు. వీరప్పన్ చివరి గడియల గురించి వారిద్దరూ చెబుతున్న అంశాల్లో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయి’’ అని శివసుబ్రమణియమ్ ప్రశ్నించారు.

ఒక వార పత్రికకు పనిచేసిన శివసుబ్రమణియమ్, వీరప్పన్‌ను ఫోటో తీసిన మొదటి వ్యక్తి. కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను వీరప్పన్ కిడ్నాప్ చేసినప్పుడు, చర్చల కోసం తమిళనాడు ప్రభుత్వం పంపిన బృందంలో శివసుబ్రమణియమ్ కూడా సభ్యుడు.

విజయ్ కుమార్, సెంథామరై కన్నన్‌లు చెప్పిన విషయాల్లోని వైరుధ్యాల గురించి బీబీసీతో శివసుబ్రమణియమ్ వివరంగా చెప్పారు.

‘‘వీరప్పన్ కంటి చికిత్స పొందాలని, శ్రీలంక వెళ్లి ఎల్టీటీఈలో చేరాలని, ఆయుధాలను పొందాలని అనుకున్నప్పుడు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ వెల్లతురైని ఒక ఎల్టీటీఈ సభ్యుడిగా వీరప్పన్‌కు గ్యాంగ్‌కు పరిచయం చేశారు. ఎల్టీటీఈకి చెందిన వ్యక్తిగా వీరప్పన్ మనుషులకు వెల్లతురై పరిచయమయ్యారని విజయ్ కుమార్ చెప్పారు. కానీ, డాక్యుమెంటరీ సిరీస్‌లో సెంథామరైకన్నన్ మాట్లాడుతూ, తానే స్వయంగా వీరప్పన్‌తో చర్చలు జరిపినట్లు చెప్పారు. ఈ రెండింటిలో ఏది నిజం? నిజమేదో ఎవరు చెబుతారు?’’ అని శివసుబ్రమణియమ్ ప్రశ్నించారు.

అంబులెన్స్ డోర్‌ను తెరిచే అవకాశం లేదా?

వీరప్పన్ కుమార్తె విద్య కూడా తన తండ్రి మరణంపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. వీరప్పన్ చివరగా ప్రయాణించిన అంబులెన్స్ విషయంలో ఇద్దరు చెప్పిన మాటలు ఒకేలా లేవని ఆమె అన్నారు.

‘‘విజయ్ కుమార్ తన పుస్తకంలో, వీరప్పన్‌ను తీసుకొచ్చిన అంబులెన్స్‌కు లోపలి వైపు నుంచి డోర్లు తెరిచే అవకాశం లేకుండా చేశామని, అలాగే అతన్ని చంపేసినట్లు రాశారు. కానీ, సెంతామరైకన్నన్ మాట్లాడుతూ, అంబులెన్స్ ఆగినప్పుడు వీరప్పన్ తలను బయటకు పెట్టారని అన్నారు. ఈ రెండింటిలో ఏది నిజం? ఈ రెండూ నిజం కాదు. మా నాన్నను వాళ్లు ప్రాణాలతో పట్టుకొని గోళ్లు బయటకు లాగేసి చనిపోయేలా చిత్రహింసలు పెట్టారు’’ అని విద్యా వీరప్పన్ వివరించారు.

మొదట తనకు పోలీస్ అధికారులంటే గౌరవం ఉండేదని, తన తండ్రి గురించి ఇలా అబద్ధాలు చెప్పినప్పటి నుంచి ఆ గౌరవం పోయిందని ఆమె అన్నారు.

‘‘ఆయన ఒక పోలీస్ అధికారి అయ్యుండొచ్చు. మా నాన్నను చంపి ఉండొచ్చు. అలా చేయడం ఆయన విధి. వీరప్పన్‌ను చంపినందుకు ఆయనకు అవార్డులు, రివార్డులు లభించి ఉండొచ్చు. కానీ, ఒక మనిషి ఎలా చనిపోయాడో దాచిపెడుతూ ఒక పుస్తకాన్ని రాయడం ఎందుకు? ఆ పుస్తకం చదివితే అదంతా ఒక డ్రామా తరహాలో, చాలా విషయాల్ని దాచిపెట్టినట్లుగా అనిపిస్తుంది. ఒక పనిలో నిజాయితీగా లేని వ్యక్తి ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో నిజాయితీగా ఉంటారా? అనే సందేహం కలుగుతుంది’’ అని ఆమె చెప్పారు.

తన అమ్మానాన్నలు పోలీసుల చేతుల్లో చాలా బాధలు అనుభవించి ఉంటారని ఆమె అన్నారు.

‘‘మా అమ్మనాన్నల్ని పోలీసులు చాలా బాధపెట్టి ఉంటారు. వ్యక్తిగతంగా మాకు ఏమీ తెలియదు. ముందుగా పోలీసులంటే నాకు గౌరవం ఉండేది. కానీ, తాము పెట్టిన చిత్రహింసల్ని దాచిపెట్టి, మా నాన్న చేసిన పనుల గురించే పోలీసులు ఈ లోకానికి చాటిచెప్పడంతో వారిపై గౌరవం తగ్గిపోయింది. పోలీసుల అకృత్యాలకు మహిళలే కాదు చాలా మంది ప్రాణాలు విడిచారు. సదాశివం కమిషన్ నివేదిక ప్రకారం, బాధిత తల్లులకు ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదు’’ అని విద్య చెప్పారు.

వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ ఫోన్‌లో బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఓటీటీలో విడుదలైన డాక్యుమెంటరీలో నా పూర్తి ప్రసంగాన్ని వారు చూపించలేదు. వారికి కావాల్సినట్టుగా దాన్ని మార్చుకున్నారు. నా పూర్తి ప్రసంగాన్ని ప్రదర్శించి ఉంటే, అసలు నిజమేంటో ప్రజలకు అర్థమయ్యేది’’ అని అన్నారు.

సెంథామరై కన్నన్ ఏమన్నారు?

వీరప్పన్ చివరి క్షణాలపై తలెత్తుతున్న ప్రశ్నలు, వస్తోన్న ఆరోపణల గురించి బీబీసీతో సెంథామరై కన్నన్ మాట్లాడారు. నిజానికి వీరప్పన్‌ను అలా నేరుగా చంపాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘నిజాన్ని ఒప్పుకోలేని వారే అలా మాట్లాడుతుంటారు. నిజానికి, ఒక వ్యక్తిని అలా పట్టుకొని భోజనంలో విషం కలిపి చంపేస్తే, అది ఇంకా చాలా సమస్యలకు దారి తీస్తుంది. పైగా, వీరప్పన్‌ అలా నేరుగా చంపేయాల్సిన వ్యక్తి కాదు. కానీ, ఆయనను ప్రాణాలతో పట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. మా అందరి లక్ష్యం ఆయనను ప్రాణాలతో పట్టుకోవడమే. కానీ, ఆయన సహకారం లేకుండా ప్రాణాలతో పట్టుకోవడం చాలా కష్టం’’ అని సెంథామరైకన్నన్ వివరించారు.

అంబులెన్స్‌ విషయంలో వస్తోన్న వైరుధ్యాల గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ ఆపరేషన్ కోసమే ఆ వాహనంలో ప్రత్యేకంగా మార్పులు చేశాం. ముందు డోర్, కిటికీలను బయటి నుంచి తెరిచే విధంగా డిజైన్ చేశాం. డ్రైవర్ శరవణన్‌తో పాటు మరో వ్యక్తి వాహనం ముందుభాగంలో ఉండటంతో, వారి భద్రత కోసం డ్రైవర్‌కు, ప్రయాణీకుల సీట్లలో ముందు కూర్చున్న వారికి మధ్య ఉన్న కిటికీని లోపలివైపు నుంచి తెరిచే అవకాశం లేకుండా చేశాం. వారిద్దరి భద్రత కోసమే అలా చేశాం’’ అని ఆయన చెప్పారు.

వీరప్పన్‌ను మీసాలు తీసేయమన్నప్పుడు..

ఎల్టీటీఈ సభ్యుడిగా వీరప్పన్‌తో మాట్లాడిన వ్యక్తి ఎవరు? అనే విషయంపై వచ్చిన ఆరోపణల గురించి సెంథామరై కన్నన్ స్పందించారు. మొదటి నుంచి వీరప్పన్‌తో చర్చలు జరిపింది తానేనని ఆయన తెలిపారు.

‘‘ఆపరేషన్ కుకూన్‌కు ఒక వారం లేదా నెల ముందు వెళ్లూతురైకి ఆదేశాలు వెళ్లాయి. కానీ, అంతకుముందు నుంచే వీరప్పన్‌తో నేను మాట్లాడుతున్నా. కానీ, అది ప్రత్యక్ష సంభాషణ కాదు. ఉత్తరాలు, మెసెంజర్ల ద్వారా మా మధ్య సంప్రదింపులు జరిగేవి. అలాంటి ఒక సంభాషణ సందర్భంగా అతనికి మీసాలు తీసేయాలని చెప్పాను. మీసాలుంటే మీకేం సమస్య అని వీరప్పన్ ప్రశ్నించాడు’’ అని వెల్లడించారు.

‘‘మీరు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాలి. పడవలో శ్రీలంకకు బయల్దేరాలి. మీసాలు తీసేస్తే అంత సులువుగా ఎవరూ మిమ్మల్ని గుర్తుపట్టలేరు అని చెప్పాను. దాంతో ఆయన మీసాలు తీసేశారు’’ అని సెంథామరై కన్నన్ వివరించారు.

‘‘మా బృందంలో ఏ ఒక్కరు కూడా ఆయనను ఎప్పుడూ నేరుగా చూడలేదు. ఆపరేషన్ కుకూన్ ముగిశాక, మీసాల్లేకుండా వీరప్పన్‌ను గుర్తుపట్టలేకపోయాం. అసలు అతను వీరప్పనా? కాదా? అని మాలో చాలామంది సందేహించారు. కానీ, మా టాస్క్‌ఫోర్స్‌లోనే పనిచేసే వీరప్పన్ మేనల్లుడు, ‘అవును, అతను మా మామయ్య వీరప్పన్’ అని ధ్రువీకరించాడు’’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-04-19T07:15:11Z dg43tfdfdgfd