కాంగ్రెస్​లోకి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

కాంగ్రెస్​లోకి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

  • ఏఐసీసీ ఇన్ చార్జ్ మున్షీ, మంత్రి ఉత్తమ్ సమక్షంలో చేరిన శంకరమ్మ

హైదరాబాద్, వెలుగు: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్​పార్టీలో చేరారు. గురువారం గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్​చార్జ్​దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శంకరమ్మతో పాటు హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతోనే తెలంగాణ ఉద్యమం కీలకమలుపు తిరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో శంకరమ్మకు తగిన ప్రాధాన్యం, మర్యాద, గౌరవం ఉంటుందని ఆయన తెలిపారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో శంకరమ్మ తనపై పోటీ చేసినా పరస్పరం గౌరవంతో ఉన్నామని పేర్కొన్నారు. మోదీ పదేండ్ల పాలనలో తెలంగాణకు ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో 13 సీట్లు గెలుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు చోట్ల బీజేపీతో టఫ్ ఫైట్ ఉందని, ఒక చోట ఎంఐఎంతో పోటీ పడుతున్నామని, బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆయన మండిపడ్డారు.   

బీఆర్ఎస్ లో గుర్తింపు దక్కలేదు: శంకరమ్మ

పదేండ్లు బీఆర్ఎస్ లో కష్టపడ్డా గుర్తింపు దక్కలేదని శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరామని, తనతో పాటు చాలా మంది కార్యకర్తలు, నేతలు చేరినట్లు ఆమె తెలిపారు. శ్రీకాంతాచారి తోపాటు చాలామంది అమరులయ్యారయ్యారని, అమరవీరుల కుటుంబాల తరఫున ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ తోనే అమరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని శంకరమ్మ అన్నారు.

కాంగ్రెస్ లోకి బీజేపీ నేత ఆజ్మీరా ఆత్మారాం

ఆసిఫాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జ్ ఆజ్మీరా ఆత్మారాం కాంగ్రెస్ లో చేరారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసంలో ఆత్మారాంకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ ఇన్ చార్జ్ దీపా దాస్ మున్షిని ఆజ్మీరా ఆత్మారాం మర్యాదపూర్వకంగా కలిశారు. 2018,2023లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆత్మారాం ఓడిపోయారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-10T01:51:28Z dg43tfdfdgfd