కాకా బీఆర్​ అంబేద్కర్​ కాలేజీకి న్యాక్​ ఏ గ్రేడ్​

కాకా బీఆర్​ అంబేద్కర్​ కాలేజీకి న్యాక్​ ఏ గ్రేడ్​

  • ఓయూ అఫిలియేషన్ కాలేజీల్లో ఈ ఒక్క కాలేజీకే దక్కిన ఘనత
  • 4 సీజీపీఏ పాయింట్లకు గానూ 3.09 స్కోర్​
  • ఇన్నొవేషన్స్, ప్లేస్ మెంట్స్​కు మంచి అవకాశం
  • న్యాక్​ గుర్తింపుపై కరస్పాండెంట్​ సరోజా వివేకానంద్​ హర్షం

హైదరాబాద్, వెలుగు:  కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించింది. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాల్​కు నేషనల్ అసెస్‌‌‌‌మెంట్ అండ్ అక్రెడిటేష‌‌‌‌న్ కౌన్సిల్(న్యాక్‌‌‌‌) డైరెక్టర్​ లేఖ రాశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అఫిలియేషన్ సర్కారు, ప్రైవేటు కాలేజీల్లో ఒక్క కాకా బీఆర్​ అంబేద్కర్ కాలేజీకి మాత్రమే ‘ఏ’ గ్రేడ్ దక్కింది. దీనిపై కాలేజీ మేనేజ్​మెంట్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని అవకాశాలకు తోడ్పాటు

హైదరాబాద్​ బాగ్ లింగంపల్లిలో ఉన్న కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీని ఈ నెల18,19 తేదీల్లో న్యాక్ పీర్ టీమ్ విజిట్ చేసింది. ఈ సందర్భంగా కాలేజీలోని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, బోధన తీరు, లైబ్రరీ, క్లాసు రూమ్స్, ల్యాబ్స్ తదితర అన్ని వసతులను పరిశీలించింది. విద్యార్థులు, పేరెంట్స్, అలుమిని బృందంతోనూ మాట్లాడి, వివరాలు తెలుసుకున్నది. రీసెర్చ్ ను ప్రోత్సాహించడంపై ఆరా తీసింది. వివిధ డిపార్ట్​మెంట్లను స్వయంగా పీర్ కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్​ ఇచ్చారు. కాలేజీ పనితీరుపై పీర్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. కాలేజీ డెవలప్ మెంట్ కోసం మరిన్ని సూచనలను చేసింది. తాజాగా కాలేజీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఇస్తునట్టు ఉత్తర్వులు విడుదల చేసింది. 4 సీజీపీఏ పాయింట్లకు గానూ 3.09 సీజీపీఏ పాయింట్ల స్కోర్ ఇచ్చి, ఐదేండ్ల పీరియెడ్​తో ఏ గ్రేడ్ కేటాయించింది. కాలేజీ స్టేటస్ ను గుర్తించేందుకు, ఇన్నొవేషన్స్ ను ప్రోత్సహించేందుకు న్యాక్  ‘ఏ’ గ్రేడ్​ తోడ్పాటునందిస్తుంది. ఈ కాలేజీలో చదివే స్టూడెంట్లకు నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీల్లో మంచి ప్లేస్ మెంట్స్ లభించే అవకాశముంది. ఇతర వర్సిటీలతో ఎక్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకూ ఉపయోగపడుతుంది. 

కాకా ఆశయాలకు తగ్గట్టుగా విద్యాసంస్థలు 

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు జి.వెంకటస్వామి 1973లో బాగ్ లింగంపల్లిలో బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలను స్థాపించారు. ముందుగా స్కూల్​తో ప్రారంభమై.. ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, లా, జర్నలిజం ఇలా పలు కోర్సులను అందిస్తున్నది. విశాలమైన గ్రౌండ్ తో పాటు  ప్రత్యేకంగా క్రికెట్ గ్రౌండ్, అధునాతన కంప్యూటర్ ల్యాబ్, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి విశాలమైన బిల్డింగ్​తో విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావాలను పెంచేందుకు ఎన్​సీసీ, ఎన్​ఎస్ఎస్ యూనిట్లను కాలేజీలో ఏర్పాటు చేశారు. ఈ విద్యాసంస్థలు ఏటా ఏంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ, అందరి మన్ననలను పొందుతున్నది. కాకా వెంకటస్వామి ఆశయాలకు తగ్గట్టుగా విద్యాసంస్థలు కొనసాగుతున్నాయని, కాలేజీకి న్యాక్​ ఏ గ్రేడ్​ లభించడం ఎంతో సంతోషకరమని సిబ్బంది అన్నారు. 

సమిష్టి కృషికి నిదర్శనం: సరోజా వివేకానంద్

కాకా బీఆర్​ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం సంతోషంగా ఉందని కాలేజీ కరస్పాండెంట్ గడ్డం సరోజా వివేకానంద్ అన్నారు. ‘‘ఈ విజయం మా లెక్చరర్లు, సిబ్బంది, స్టూడెంట్ల సమిష్టి కృషికి నిదర్శనం. ఓయూ పరిధిలో 770కి పైగా కాలేజీలుండగా, వీటిలో 33 అటానమస్ కాలేజీలున్నాయి. వీటిలో 30 కాలేజీల్లో మాత్రమే న్యాక్ గ్రేడ్ ఉంది. మా కాకా బీఆర్​ అంబేద్కర్ కాలేజీకి ఏ గ్రేడ్ రావడం గర్వంగా ఉంది” అని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత వెంకటస్వామి (కాకా) 50 ఏండ్ల కింద స్థాపించిన ఈ కాలేజీ ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తున్నదని చెప్పారు. న్యాక్ ఏ గ్రేడ్​ గుర్తింపు రావడం వెనుక కాలేజీ ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కృషి ఉందని.. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు సరోజా వివేకానంద్​ అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-27T01:09:29Z dg43tfdfdgfd