క్రైస్తవంలోకి మారిన తండ్రి, అంత్యక్రియల కోసం కోర్టుకెక్కిన కొడుకు... కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ వైద్య కళాశాలలో నాలుగు రోజులుగా ఉన్న ఈశ్వర్ మృతదేహానికి ఎట్టకేలకు స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి.

పుట్టి పెరిగిన ఊరిలోనే తన తండ్రి అంతిమ సంస్కారాలు చేసే అవకాశం కల్పించాలంటూ ఈశ్వర్ కుమారుడు హైకోర్టును ఆశ్రయించారు.

ఒక వ్యక్తి చనిపోతే స్వగ్రామంలో అంత్యక్రియలు జరపలేని పరిస్థితులు ఎందుకువచ్చాయి?

కొన్నేళ్ళ కిందట ఈశ్వర్ క్రైస్తవంలోకి మారారు. ఆయన చనిపోయాకా కొందరు గ్రామస్తులు, హిందూ సంఘాలు గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరపడాన్ని వ్యతిరేకించాయి.

దీంతో ఈశ్వర్‌ కుమారుడు సార్తిక్ కొర్రం ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. శనివారం సాయంత్రం పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈశ్వర్ అంత్యక్రియలకు తగిన భద్రత కల్పించాల్సిందిగా జిల్లా సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

‘‘గ్రామంలో నిరసన వ్యక్తమవుతుండటంతో నేను హైకోర్టుకు వెళ్ళాను. మా నాన్నను గ్రామంలోనే సమాధి చేయడానికి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాను. దీని తరువాత మా పూర్వీకుల స్థలంలో మా నాన్న అంతిమ సంస్కారాలు నిర్వహించాం’’ అని సార్తిక్ కొర్రం బీబీసీకి చెప్పారు.

చింద్‌బాహార్ జిల్లా దార్భా గ్రామానికి చెందిన ఈశ్వర్ అనారోగ్యంతో జగదల్‌పుర్ ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో చేరారు. కానీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురువారం మృతి చెందారు.

పోలీస్ బందోబస్తు

ఈశ్వర్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వెళ్ళేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పార్పా పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్, ఈశ్వర్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్ళడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు.

క్రైస్తవ మతంలోకి మారిన ఈశ్వర్‌ అంత్యక్రియలు గ్రామంలో జరపడానికి ఒక వర్గానికి ఇష్టం లేదని మృతుని కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసు బలగాలను కూడా మోహరించారు.

దీంతో అప్పటి నుంచి ఈశ్వర్ మృతదేహం జిల్లా వైద్యశాలలోని మార్చురీలోనే ఉంది.

తన తండ్రి అంత్యక్రియలు గ్రామంలో జరుపుకోవడానికి అవకాశం కల్పించాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీకి సార్తిక్ కొర్రం విన్నవించినా ప్రయోజనం లేకపోయింది.

దీనిపై పోలీసు అధికారులతో బీబీసీ మాట్లాడటానికి ప్రయత్నించింది. వారు స్పందించడానికి నిరాకరించారు.

హైకోర్టు ఏం చెప్పింది

సెలవురోజు అయినప్పటికీ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు శనివారం సాయంత్రం విచారణకు స్వీకరించింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ మోహన్ పాండే తన తీర్పు మొదటి లైనులో ‘‘మిత్రాణి ధన్ ధాన్యాని ప్రజానాం సమ్మతానివ, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి’’ (ప్రపంచంలో స్నేహితులు, సంపద, ధాన్యం చాలా గౌరవం పొందుతాయి. కానీ కన్నతల్లి, పుట్టిన ఊరు స్వర్గానికి కంటే గొప్పవి ) అనే శ్లోకాన్ని ఉటంకించారు.

‘‘పిటిషనర్ తండ్రి చిందబాహార్ గ్రామంలోనే పుట్టి పెరిగారు. కొడుకు తన తండ్రి శవానికి అదే గ్రామంలో అంత్యక్రియలు జరగాలని కోరుకుంటున్నారు. అందుకే పై శ్లోకం ఇక్కడ ఉంటంకించడం సబబైనది. ‘కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి’’ అందుకే పిటిసనర్ అభిమతాన్ని గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై కూడా ఉంది’’ అని కోర్టు పేర్కొంది.

'భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఒక వ్యక్తికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించే హక్కు కల్పిస్తుంది. జీవించే హక్కు అంటే అర్థవంతమైన గౌరవంతో కూడిన జీవితాన్ని సూచిస్తుంది. ఈ గౌరవం మరణించిన వ్యక్తికి కూడా వర్తిస్తుంది’ అని కోర్టు పేర్కొంది.

కోర్టు తీర్పు వెలువడ్డాక ఈశ్వర్ మృతదేహాన్ని చింద్‌బహర్ గ్రామంలో ఆదివారం ఖననం చేశారు.

అయితే బయటి వ్యక్తులు గ్రామస్తులను రెచ్చగొట్టడం వల్లే ఇలా జరిగిందని కొంతమంది స్థానికులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ క్రిస్టియన్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ పన్నాల్ మాట్లాడుతూ ‘‘కోర్టు నిర్ణయం చారిత్రాత్మకం. న్యాయవ్యవస్థపై ఈ తీర్పు మరింత నమ్మకాన్ని పెంచింది. గడిచిన కొన్నేళ్ళుగా చత్తీస్‌గఢ్‌లోని క్రిస్టియన్లు అంతిమసంస్కారం నిర్వహించే విషయంలో అనేకచోట్ల వివాదాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ పెద్ద ఎవరైనా చనిపోతే అంత్యక్రియల విషయంలో వివాదం రేగుతోంది. ఈ తీర్పుతో క్రిస్టియన్ సమాజానికి ఊరట లభిస్తుందని భావిస్తున్నాను’’ అని చెప్పారు.

‘అంతిమ’ వివాదాలు

హైకోర్టు జోక్యంతో ఈశ్వర్ అంత్యక్రియలు ఆయన గ్రామంలోనే జరిగినా చాలామందికి అటువంటి పరిస్థితి లేదు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో తుల్సీనాగ్ కేరళలో కరెంట్ షాక్‌ కొట్టి మరణించారు. ఆయన జగదల్‌పుర్ పక్కనే ఉండే నవగుడ గ్రామ నివాసి.

తుల్సీ కుటుంబం క్రైస్తవంలోకి మారినందున ఆయన మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు జరపడానికి వీల్లేదని కొందరు అడ్డుకున్నారు.

దీంతో స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించలేకపోయారు.

తుల్సీ శవాన్ని గ్రామ సర్పంచ్ వినాసానికి సమీపంలో ఉంచి, తమకు అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అంటూ కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు.

పోలీసులు తుల్సీ శవాన్ని జగదల్‌పుర్‌లోని కార్కపాల్ క్రైస్తవుల స్మశాన వాటికకు తీసుకువచ్చారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉన్నందున తుల్సీ మృతదేహాన్ని అక్కడ ఖననం చేయడం కుదరదని చెప్పారు. దీంతో ఆయన శవాన్ని ఐదురోజుపాలు అలాగే ఉంచారు.

అంతిమంగా తుల్సీ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించలేకపోయారు.

బస్తర్, నారాయణ్‌పుర్, కాంకేర్, కొండగావ్, దంతేవాడ లాంటి పలు జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.

మృతదేహాల ఖననం విషయంలో ఉద్రిక్తతలు తలెత్తడం, చివరకు స్వగ్రామంలో కాకుండా మృతదేహాలను ఎక్కడికో తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

కొన్ని ప్రాంతాలలో అయితే ఖననం చేసిన శవాలను కూడా బయటకు తీయించిన సందర్భాలు ఉన్నాయి.

బస్తర్ 5వ షెడ్యూల్ ప్రాంతం ఇక్కడ పంచాయత్ ఎక్స్‌టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా చట్టం వర్తిస్తుంది. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలన్నా, ప్రార్థనామందిరం నిర్మించుకోవాలన్నా గ్రామసభ అనుమతి తప్పనిసరి.

అందువల్లే కోయిలీబేడా లాంటి పంచాయతీలలో క్రైస్తవంలోకి మారిన వారి అంతిమిసంస్కారాలను ఎట్టిపరిస్థితులలోనూ గ్రామంలో నిర్వహించడానికి వీల్లేదని గ్రామసభ తీర్మానించింది.

అయితే 5వ షెడ్యూల్ పరిధిలోకి రాని ప్రాంతాలలోనూ ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

‘‘బస్తర్‌లో గిరిజనులు హిందువులుగా మారుతున్నారు. ఇతర ప్రాంతాలలో వారు క్రైస్తవంలోకి మారుతున్నారు. దీంతో ఘర్షణలు ఏర్పడుతున్నాయి. గిరిజనులు వారి సంస్కృతికి దూరమవుతున్నారు. అది మత విశ్వాసాల ఉచ్చులో చిక్కుకుపోతోంది. గిరిజనుల విశ్వాసాలను, సంప్రదాయాలను పరిరక్షించాలి’’ అని సర్వ ఆదివాసీ సమాజం, కేంద్ర మాజీ మంత్రి అర్వింద్ నేతమ్ చెప్పారు.

కానీ హైకోర్టు న్యాయవాది పంకజ్ శర్మ మాట్లాడుతూ ఒక మత స్వేచ్ఛ కోసం మరో మతం స్వేచ్ఛను కాలరాయమని రాజ్యాంగం చెప్పలేదని అన్నారు.

‘‘గ్రామాలలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. తమ ఇష్టానుసారం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన గిరిజనులకు అంతిమ సంస్కారాలకు గ్రామంలో చోటు కల్పించకపోవడం వల్ల వారు ఒత్తిడికి గురై క్రైస్తవ మతాన్ని వదిలేస్తారనే ఆలోచనతో ఇదంతా చేస్తున్నారు’’ అని చెప్పారు.

తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అంతిమ సంస్కారాల విషయంలో తమకు ఊరట దక్కుతుందనే ఆశతో క్రైస్తవంలోకి మారిన గిరిజనులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-05-02T02:52:34Z dg43tfdfdgfd