చనిపోయినట్లు నాటకమాడి పోలీసుల కళ్ళు కప్పిన ఒక సీరియల్ రేపిస్ట్ చివరకు ఇలా దొరికిపోయాడు...

అతను ఒక మోసగాడు. లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్న నిందితుడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఊరి నుంచి పరారై చనిపోయినట్లు నాటకమాడాడు. కానీ, చివరకు తన గుట్టు రట్టవుతుందని ఊహించలేకపోయాడు.

జేడ్ స్కీ యుక్తవయసులో ఉండగా ఆకర్షణీయంగా ఉండే వీధి వర్తకుడు కిమ్ అవిష్‌ను కలుసుకున్నారు. అయితే, కిమ్ కారణంగా పదేళ్ళు తాను నరకం చూస్తానని, లైంగిక దాడికి గురవుతానని ఆ సమయంలో ఆమె ఊహించలేకపోయారు. తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని న్యాయస్థానం ముందు నిలబెట్టే కేసులో తానే కేంద్రబిందువు అవుతానని కూడా ఆమె అనుకోలేదు.

2000 సంవత్సరం ప్రారంభంలో ఈ కథ మొదలైంది. అవిష్‌కు స్కాట్లండ్‌లోని ఇన్వర్‌నెస్ నగర నడిబొడ్డున ఆభరణాల దుకాణం ఉండేది. ఈ ప్రాంతాన్ని జేడ్ తరచూ తన స్నేహితులతో కలిసి సందర్శిస్తూ ఉండేవారు.

పథకం ప్రకారం ఒంటరిని చేసి...

కిమ్ అవిష్ నగరంలో ఓ చిన్నపాటి సెల్రబిటీలా పేరు పొందారు.

ఆయన నిధుల సేకరణతో చేసే సేవా కార్యక్రమాల వల్ల స్థానిక మీడియాలో తరచూ కనిపిస్తుండేవారు.

‘‘ఆయన దాదాపు ఓ స్థానిక సెలబ్రిటీలా ఉండేవారు’’ అని జేడ్ చెప్పారు.

జేడ్ 18 ఏళ్ళ వయసులో ఉండగా, 40 ఏళ్ళ అవిష్‌ను చూస్తుండేవారు. ‘‘ఆయన ఇతర పెద్దవాళ్ళలా ఉండేవారు కాదు. ఆయనను మాలో ఒకరిగా భావించాం’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

వీరి బంధం దృఢంగా మారిన వేళ, జేడ్ స్కీని ఆమె కుటుంబం, స్నేహితుల నుంచి అవిస్ దూరం చేసి ఇన్వర్‌నెస్ నగర శివార్లలోని తన కార్వాన్‌లో ఉంచారు. ఈ కార్వాన్ దగ్గరకు ఒక్క అవిస్ తప్ప ఎవరూ వచ్చేవారు కాదు.

‘‘ఇప్పడు వెనక్కి తిరిగి చూసుకుంటే, నన్ను అన్నింటికి దూరం చేయడమనేది పథకం ప్రకారమే చేశాడని అర్థమవుతోంది’’ అని ఆమె చెప్పారు.

‘‘ఒకరోజు రాత్రి ఆయన నా దగ్గరికి వచ్చారు. చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దేని గురించో కలత చెందినట్టుగా కనిపించారు’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

‘‘కార్వాన్ బయట ఉన్న పిక్‌నిక్ బల్లపైకి చేరుకుని అరవడం మొదలు పెట్టారు. భయంగొలిపేట్టుగా జంతువులా శబ్దాలు చేశారు. దీని తరువాత అవిష్ నాపై మొదటిసారి అత్యాచారం చేశారు’’ అని ఆమె చెప్పారు.

జేడ్ ఒంటరి కాదు

ఆ తరువాత ‘తోడేళ్ళ డెన్’గా పేరొందిన తన ఇంటిలో ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఏళ్ళ తరబడి హింసను ఎదుర్కొన్న తరువాత 2015లో జేడ్ దీనిపై ఏదో ఒక చర్య తీసుకోవాలని భావించారు.

‘‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన ఎన్నడూ ఊహించి ఉండరు’’ అని ఆమె చెప్పారు.

‘‘బహుశా నేను ఫిర్యాదు చేశానని తెలిసి ఆయన షాక్ తిని ఉంటారని’’ చెప్పారు.

అయితే ఈ కేసులో జేడ్ ఒంటరి కారు.

ఏళ్ళ తరబడి అవిస్ తమను అత్యాచారం చేసి, హింసించాడంటూ మరో ముగ్గురు మహిళలు కూడా ఫిర్యాదు చేశారు.

‘‘మిగిలిన బాధితులు కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో అతని గుట్టు రట్టయింది’’’ అని జేడ్ చెప్పారు.

నలుగురి మహిళలపై పలుమార్లు అత్యాచారాలు, లైంగిక హింస చేసిన అభియోగాలపై అవిస్‌ కోర్టు ముందు హాజరయ్యారు. తరువాత బెయిల్ పై విడుదలయ్యారు. తదుపరి విచారణ మార్చి 2019గా నిర్ణయించారు.

కానీ, సమస్య ఏమిటంటే జేడ్ అక్కడి నుంచి అదృశ్యమైపోయారు.

తోడేళ్ళ డెన్‌ను అమ్మేసి...

కిమ్ అవిష్ తన ‘తోడేళ్ళ డెన్’ను 245000 పౌన్లకు అమ్మేశారు.

తరువాత ఓ విమాన టిక్కెట్ కొనుక్కుని కాలిఫోర్నియాలోని మోనాస్టరీ బీచ్‌కు చేరుకున్నారు.

ఈ ప్రాంతం స్థానికంగా ‘మార్చురీ బీచ్’గా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ నీటిలో తరచూ జనం మునిగి పోతుంటారు.

ఇక్కడే అవిస్ తన నకిలీచావును సృష్టించారు.

‘‘ఆ సమయంలో అతను కోల్పోవడానికి ఏమీ లేదు. తను కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు అతను నిస్సంకోచంగా ఏ పనైనా చేయగల సమర్థుడు’’ అని జేడ్ చెప్పారు.

అమెరికాలో అవిస్‌తో పాటు ఉన్న ఆయన పెద్ద కుమారుడు తన తండ్రి బీచ్ లో అదృశ్యమైనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికారులు మూడురోజులపాటు గాలించాకా ఆయన బీచ్‌లో మునిగిపోలేదని, అదంతా నాటకమని. ఓ సీరియల్ రేపిస్ట్ తప్పించుకున్నాడని అర్థం చేసుకున్నారు.

మాంటెరీ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పోలీసు డాక్యుమెంట్స్‌లో అవిస్ అదృశ్యమైన తరువాత ఆయన కాలిఫోర్నియా తీరం వెంబడి తిరిగినట్టుగా నమోదై ఉంది.

ప్రత్యక్ష సాక్షి ఒకరు అవిస్ ను ఓ ‘వెర్రి స్కాట్స్ మాన్’గా అభివర్ణించగా, మరొకరు మోంటానా ప్రాంతానికి అవిస్ వెళ్ళిన విషయం గురించి చెప్పారు.

కొన్ని నెలల తరువాత కొలరాడో స్ప్రింగ్స్ నగర సమీపంలోని కొండల వద్ద రాళ్ళు, రత్నాలు అమ్మే దుకాణానికి అసాధారణ యాసతో మాట్లాడే అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తి వచ్చారు. ఈ ప్రాంతం అవిస్ అదృశ్యమైన చోటు నుంచి 1,300 మైళ్ళ దూరంలో ఉంది.

ఆ వ్యక్తి త పేరు కామెరున్ మెక్ గ్రెగర్ అని చెప్పుకున్నారు. ఎంజీ అనే మహిళ నడిపే ఆ దుకాణంలో దాదాపు 3వేల డార్లను ఖర్చు చేశారు.

‘‘ అతని వ్యవహారం ఏదో తేడాగా ఉందనిపించింది’’ అని ఎంజీ చెప్పారు. ఆ వ్యక్తి తను స్కాటిష్ అని చెప్పుకున్నారు. ఆయన వీపుపై అసంపూర్ణంగా గీసిన పెద్ద తోడేలు టాటూ ఉంది.ఆయన చాలా రఫ్ గా కనిపించారు. ఆయన వద్ద బోలెడు డబ్బు కూడా ఉంది. తన చుట్టూ ఆయన ఎప్పుడూ డబ్బు వెదజల్లుతూ కనిపించేవారు’’ అని ఆమె చెప్పారు.

‘‘ఆయన అందరికి ఆహారాన్ని కొనిపెట్టేవారు. బహుశా ఆయన స్నేహితులను కూడా ఇలాగే కొనుక్కుని ఉంటారు’’ అని ఎంజీ చెప్పారు.

తాను అమెరికా పౌరుడినని ఆయన ఎంజీకి చెప్పారు.

‘‘నేను ఆయన పాస్‌పోర్ట్ చూడాలనుకుంటున్నట్టు చెప్పగానే. ఆయన పిచ్చి ఎక్కినట్టుగా ప్రవర్తించారు. పైగా ఆయన మంత్రగత్తెల వేట గురించి మాట్లాడారు. ఆయన విషయంలో ఏదో తేడాగా ఉందని గ్రహించాను’’ అని ఆమె చెప్పారు.

నకిలీ మనిషి

కామెరన్ మెక్‌గ్రెగర్ అనే వ్యక్తి అసలు కాదని, నకిలీ అని ఎంజీ నమ్మడం మొదలుపెట్టారు.

‘‘నేను ఆయన కారు లైసెన్స్ ప్లేట్ ను ఫొటో తీశాను. ఆ పోటోను తన స్నేహితుడైన ఓ పోలీసుకు ఇచ్చి, దాని సంగతేంటో కనుక్కోమని కోరాను’’ అని ఆమె తెలిపారు.

దీని తరువాత సరిహద్దుల వెంట పారిపోయే వారిని వేటాడే ప్రభుత్వ ఏజెన్సీ యూఎస్ మార్షల్స్ నుంచి ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.

‘‘మీరు ఆయన నుంచి దూరంగా ఉండండి. అతను ప్రమాదకారి’’ అని వారు ఆమెను హెచ్చరించారు.

అవిస్ కామెరన్ మెక్‌గ్రెగర్‌గా పేరు మార్చుకుని ఆ ప్రాంతంలో జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆధారాలను యూఎస్ మార్షల్స్ సేకరించగలిగారు.

ఆపైన అవిస్ కు వచ్చిన ఫోన్ కాల్ ఆయనను ఓ మోటెల్‌కు తీసుకువెళ్ళింది.

ఈ విషయం తెలుసుకుని స్థానిక పోలీసులు, మార్షల్స్ మోటెల్ ను చుట్టుముట్టారు.

ఆయన తప్పించుకుపోవడానికి అవకాశం ఉన్న ప్రతి మార్గం వద్దా కాపుకాశారు.

ఆయన పోలీసులకు చిక్కిన క్షణాన్ని పోలీసులు తమ బాడీ కెమెరాల్లో బంధించారు.

అవిస్ అరెస్ట్ అయిన సమయంలో ఆయన వద్ద 50 వేల అమెరికన్ డాలర్ల నగదు,

బంగారు కాయిన్లు, అమెరికాలో ఆయన కొనుగోలు చేసిన బ్రాండ్ న్యూ వ్యాన్ ఉన్నాయి.

నగదును తిరిగి ఇవ్వలేమని, వ్యాన్ మాత్రం అవిస్‌కు తిరిగి ఇచ్చేశారు.

దీని తరువాత ఎంజీకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు.

ఆమె వ్యాన్‌ను 20వేల అమెరికన్ డాలర్లకు విక్రయించారు.

ఇందులో చాలా డబ్బును అవిస్ కు పంపానని ఆమె చెప్పారు.

కానీ తనకు ఒక్క పైసా కూడా రాలేదని అవిస్ చెప్పారు.

అవిస్ ఫెడరల్ జైలులో ఉన్నప్పుడు ఎంజీ మూడుసార్లు ఆయనను కలుసుకున్నారు.

తన అరెస్ట్ వెనుక ఎంజీ ఉన్నట్టు అవిస్ ఏనాడూ గుర్తించలేకపోయారు.

స్కాంట్లాండ్‌ జైలుకు తిరిగొచ్చిన తరువాత చివరిసారిగా అవిస్‌ను ఎంజీ కలుసుకున్నారు.

ఎడిన్ బర్గ్ జైలులో అవిస్ ను చూసిన తరువాత ఎంజీ ఆయనకు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నారు.

‘‘నీకీ విషయం తెలుసా,నీ బాగోతాన్ని బయటపెట్టింది నేనే’’అని అవిస్ కు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు

కొన్ని నెలలు గడిచిపోయాకా అవిస్ ను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

నలుగురి మహిళలపై అత్యాచారాలు, లైంగిక నేరాలకు పాల్పడిన అభియోగాలపై జూన్ 2021లో ఆయనకు కోర్టు శిక్ష విధించింది.

లైంగిక నేరాలకు గానూ 12 ఏళ్ళు, కోర్టు ముందు హాజరు కావడంలో విఫలమైనందుకు మూడేళ్ళు కలిపి మొత్తం 15 ఏళ్ళు శిక్ష విధించింది.

అవిస్‌ను ఎడిన్‌బర్గ్ జైలుకు తరలించారు.

ప్రస్తుతం ఆయన అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు.

‘‘ఆయన మళ్ళీ జనజీవితంలో రావాలని నేను కోరుకోవడం లేదు’’ అని జేడ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-03-28T16:50:39Z dg43tfdfdgfd