చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి : డీవై చంద్రచూడ్

చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి : డీవై చంద్రచూడ్

  • ఒకప్పుడు పిల్లలపై చేయి చేసుకోవడం సాధారణం: సీజేఐ
  • ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నరు
  • ఐదో తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్​ను గుర్తు చేసుకున్న జస్టిస్​ చంద్రచూడ్
  • ఫిఫ్త్ క్లాస్ లో ఇచ్చిన పనిష్మెంట్​ను గుర్తు చేసుకున్న సీజేఐ
  • ఖాట్మాండులో ‘జువెనైల్ జస్టిస్’ సదస్సులో ప్రసంగం 

న్యూఢిల్లీ:  స్కూళ్లలో చిన్నారులపై చేయి చేసుకోవడాన్ని ఇప్పుడు తీవ్రంగా చూస్తున్నామని.. కానీ, కొన్నేండ్ల కింద ఇది చాలా సాధారణ విషయమని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. చిన్నప్పుడు తనను టీచర్ బెత్తంతో కొట్టిన దెబ్బలు ఇప్పటికీ మరిచిపోలేదని చెప్పారు. ఆ పనిష్మెంట్ తన జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చిందని వెల్లడించారు. 

ఐదో తరగతి చదువుతున్నప్పుడు టీచర్ ఎందుకు కొట్టిందో  సీజేఐ వివరించారు. ఆదివారం ‘జువెనైల్‌ జస్టిస్‌’ అంశంపై నేపాల్‌ రాజధాని ఖట్మాండులో జరిగిన సమ్మిట్​కు ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘పిల్లలను డిసిప్లేన్​లో ఉంచేందుకు ఇప్పటి టీచర్లు వాళ్లని కొడితే పెద్ద తప్పుగా పరిగణిస్తున్నారు. కానీ.. కొన్ని దశాబ్దాల కింద కొట్టడం అసలు తప్పే కాదు. మీరు పిల్లలతో ప్రవర్తించే తీరు.. వాళ్ల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఒక చిన్న తప్పు చేశా. 

దానికి మా టీచర్ బెత్తంతో కొట్టారు. ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు క్లాస్ రూమ్​లో జరిగిన ఘటన ఇప్పటికీ నా కండ్ల ముందు తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో నేను క్రాఫ్ట్ నేర్చుకుంటున్నాను. అసైన్​మెంట్ కోసం సూదులు తీసుకురావాలి. అయితే, నేను అసైన్​మెంట్​కు మ్యాచ్ అయ్యే సూదులు తేలేదు. ఈ విషయం తెలుసుకున్న మా టీచర్ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెత్తంతో నా చేతిపై చాలా బలంగా కొట్టారు. చేతిపై కాకుండా ఎక్కడైనా కొట్టాలని రిక్వెస్ట్ చేసినా.. టీచర్ వినిపించుకోలేదు. చేయిపైనే బెత్తంతో కొట్టారు. దీంతో నా కుడి చేయి మొత్తం కందిపోయింది. అవమానంతో 10 రోజుల దాకా నా చేతిని ఎవరికీ చూపించలేదు’’అని సీజేఐ చెప్పారు. 

పిల్లల అవసరాలను గుర్తించాలి

తన టీచర్ కొట్టిన బెత్తం దెబ్బలు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘‘ఇప్పుడు కూడా నేను ఏ పని చేసినా తప్పులు జరగకుండా జాగ్రత్త పడ్తాను. ఆ టైమ్​లో మా టీచర్ కొట్టిన బెత్తం దెబ్బలే గుర్తుకొస్తాయి. అప్పుడు నాకు ఫిజికల్​గా గాయమైంది.. కానీ నా మనసులో శాశ్వతంగా ముద్రపడిపోయింది. 

జువెనైల్ చట్టాలపై చర్చిస్తున్నప్పుడు.. న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న పిల్లల బలహీనతలు, వారి ప్రత్యేక అవసరాలను మనం గుర్తించాలి’’అని సీజేఐ అన్నారు. కొన్ని ముఠాలు చిన్నారులను బలవంతంగా నేర కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చూపులేని పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారని, టీనేజ్, దివ్యాంగులకు కూడా ఈ ముప్పు ఉందన్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:30:05Z dg43tfdfdgfd