చేపలు ప్రేమగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?

ల్యాబ్‌లోని చేపల తొట్టెలో అంతుచిక్కని క్లిక్‌మనే శబ్దాల నుంచి.. హ్యాడాక్ ఫిష్‌ల లయబద్ధమైన ధ్వనులు, టోడ్‌ఫిష్‌ల పాటల వరకూ నీటిలో అసలు చేపలు ఎలా మాట్లాడుకుంటాయనే అంశంపై శాస్త్రవేత్తలు దృష్టిసారిస్తున్నారు.

అసలు చేపలు ఒకదానితో మరొకటి ఎలా మాట్లాడుకుంటాయని మీరు చేపల తొట్టిపై దృష్టిసారించినప్పుడు, నీటిలో దాదాపు ఎలాంటి శబ్దమూ లేదని అనిపించే చాలా చిన్న శబ్దాలు, చిన్నచిన్న నీటి బుడగలు మీరు గమనించొచ్చు.

కానీ, నిజానికి సముద్రాలు శబ్దాలతో కళకళలాడుతుంటాయని న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్ ఆరన్ రైస్ చెప్పారు. క్లిక్‌మనే శబ్దాలు, గుర్రుపెట్టడం, నీటిలో అలజడి సృష్టించినప్పుడు వచ్చే శబ్దాలు, చిన్నచిన్న అరుపులతో నీటిలో ఒకచేప మరొక చేపకు సంకేతాలు పంపిస్తుంటుంది.

టోడ్‌ఫిష్ లాంటి కొన్ని చేపలు మరొక చేప కోసం పాటలు కూడా పాడుతుంటాయి. మరికొన్ని చేపలైతే హెర్రింగ్ చేస్తాయి. అంటే తమ జీర్ణనాళాల నుంచి వచ్చే శబ్దాలతో ఎదుటి చేపలకు సంకేతాలు పంపిస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

భిన్నమైన అవసరాల కోసం ఈ సంకేతాలను చేపలు ఉపయోగిస్తుంటాయి. ప్రత్యర్థులు వస్తున్నప్పుడు హెచ్చరించేందుకు, అప్రమత్తం చేసేందుకు, శృంగారానికి ఆహ్వానించేందుకు కూడా ఇలాంటి శబ్దాలను ఉపయోగిస్తుంటాయి.

అరిస్టాటిల్ రచనల నుంచి సంప్రదాయ మత్స్యకార జానపదాల వరకూ గమనిస్తే, చేపలు మనం అనుకున్నదానికంటే ఎక్కువగానే మాట్లాడుకుంటాయని తెలుస్తుందని రైస్ చెబుతున్నారు. చేపలు చేసే శబ్దాలను నీటిలో ఏర్పాటుచేసిన పరికరాల సాయంతో మనం వినొచ్చు.

1930ల నుంచి నీటిలో శబ్ద తరంగాల పర్యవేక్షణలో చాలా పురోగతి కనిపించింది. ప్రస్తుతం హైడ్రోఫోన్స్‌గా పిలిచే అండర్‌వాటర్ మైక్రోఫోన్ల సాయంతో నీటిలో జీవజాతుల శబ్దాలను గమనిస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో జలాంతర్గాములను పసిగట్టేందుకు అభివృద్ధిచేసిన టెక్నాలజీ సముద్రం అడుగున, నదులు, సరస్సుల్లో చేపలు ఎలా మాట్లాడుకుంటున్నాయో గమనించేందుకు సాయం చేస్తోంది.

కాడ్, ట్యూనా, ట్రౌట్, సాల్మన్ లాంటి ‘రే ఫిన్నిడ్ ఫిష్’ జాతుల్లో ప్రస్తుతం గుర్తించిన 34,000 నుంచి 35,000 జాతుల్లో కేవలం 4 శాతం వాటిపై మాత్రమే శబ్ద తరంగాల ఉత్పత్తి విషయంలో పరిశోధకులు అధ్యయనం చేయగలిగారు.

అయితే, ఇప్పటివరకు అంతుచిక్కని ఈ చేపల కమ్యూనికేషన్ వ్యవస్థలో కేవలం పైపై సంగతులపై మాత్రమే దృష్టి సారించగలిగామని రైస్ చెప్పారు. మూడింట రెండొంతుల చేపలు నీటి అడుగున శబ్దాలు చేస్తూ ఉండొచ్చని ఆయన అన్నారు.

2024 ఫిబ్రవరిలో జర్మనీలోని పరిశోధకులు డానియోనెల్లా సెరెబ్రమ్‌గా పిలిచే ఒక చిన్న పారదర్శకమైన చేపను సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం కనుక్కొన్నారు. తన శరీరంతో పోల్చినప్పుడు ఈ చేప చాలా పెద్ద శబ్దం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. తమ ల్యాబొరేటరీలోని ఫిష్‌ ట్యాంక్‌లలో క్లిక్‌మనే శబ్దాలను విశ్లేషించిన అనంతరం వారు ఈ అవగాహనకు వచ్చారు.

12 మి.మీ.ల పొడవైన ఈ చేప 140 డిసిబెల్స్ శబ్దాలను ఉత్పత్తి చేసేందుకు ‘‘స్విమ్ బ్లాడర్’’గా పిలిచే అవయవాన్ని ఉపయోగిస్తోంది. అయితే, ఈ శబ్దం దేని కోసం చేస్తోందో పరిశోధకులకు అంతుచిక్కలేదు. కేవలం, మగ చేపలు మాత్రమే ఈ శబ్దం చేస్తున్నాయని, బహుశా గుంపులో తమ స్థానాన్ని నొక్కి చెప్పేందుకే ఈ శబ్దాలు చేస్తూ ఉండొచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

పునరుత్పత్తి, చోటుల గురించి సాధరణంగా చేపలు గొడవలు పడుతుంటాయి. సాధారణంగా చెప్పుకోవాలంటే ఆహారం, గూడు, సెక్స్ కోసం చేపలు కొట్లాడుకుంటాయని రైస్ చెబుతున్నారు. ఈ శబ్దాలు మనకు స్పష్టంగా వినిపించకపోయినప్పటికీ, చేపలకు బానే అర్థం అవుతూ ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘నీటి అడుగున శబ్దాలు గాలిలో కంటే ఐదు రెట్ల వేగంతో కదులుతుంటాయి’’ అని ఫ్లోరిడా యూనివర్సిటీలోని ఎకాలజిస్టు ఆడ్రే లూబీ చెప్పారు. ‘‘మీరు చేపల తొట్టెలో తలపెట్టి శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో దృష్టి సారిస్తే, దాని మూలాలను కనుక్కోవడం చాలా కష్టం. అదే సమయంలో చేపలు ఈ విషయాన్ని ఇట్టే కనుక్కోగలవు’’ అని ఆయన తెలిపారు.

లూబీ ఇప్పటివరకూ 1,200కుపైగా చేపల శబ్దాలను సేకరించారు. ఫిష్‌సౌండ్స్ అనే లైబ్రరీలో వీటిని పొందుపరిచారు. ఈ శబ్దాల్లో గుర్రు పెట్టడాలు, కిచకిచలు.. ఇలా చాలా శబ్దాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని ఎదుటి చేపలకు సంకేతాలు పంపే శబ్దాలను స్పష్టంగా గుర్తించొచ్చు.

ప్రేమ భాషలు...

టోడ్‌ఫిష్ చూడటానికి చాలా సన్నంగా, కొట్లాటకు దిగేలా కనిపిస్తుంటాయి. కానీ, ఇవి అద్భుతంగా పాటలు పాడగలవని లూబీ చెప్పారు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని గల్ఫ్ టోడ్‌ఫిష్‌పై ఆయన అధ్యయనం చేపడుతున్నారు.

ప్రత్యుత్పత్తి సమయంలో నదీ ముఖద్వారాలు, నీళ్లలోని కొండ అంచులు, సముద్రపు నాచు ఉండేచోట తమ గూళ్ళ సమీపంలో ఈ మగ చేపలు ఆడవాటిని ఆకర్షించేందుకు గుంపులుగుంపులుగా పాటలు పాడుతుంటాయని లూబీ చెప్పారు.

ఇవి గుర్రు పెడుతున్నట్లుగా పాటలను మొదలు పెడతాయి, ఆ తర్వాత ‘బూప్’ శబ్దాలు చేస్తాయి. అయ్‌స్టర్ టోడ్‌ఫిష్ లాంటి ఇతర టోడ్‌ఫిష్‌లు బోటు విజిల్ తరహా శబ్దాలు ఉత్పత్తి చేస్తుంటాయి. మేల్ బియర్డెడ్ టోడ్‌ఫిష్ అయితే, ఆడ చేపలను ఆకర్షించేందుకు హాంక్ శబ్దాన్ని చేస్తుంది.

రంగురంగుల్లో కనిపించే ఉప్పునీటి చేపలైన డామ్‌సెల్ఫిష్‌లు కూడా మంచి పాటలు పాడుతాయి. పశ్చిమ పసిఫిక్‌లోని పగడపు దిబ్బల్లో జీవించే అంబోన్ డామ్‌సెల్ఫిష్‌లోని మగ చేపలు ఆడ చేపలను ఆకర్షించేందుకు మరో అడుగు ముందుకువేస్తున్నాయి.

తైవాన్‌లోని ఒక పగడపు దిబ్బలోని ఈ జీవులపై అధ్యయనం చేసినప్పుడు.. ఒక హైపిచ్ సౌండ్లను గుర్తించారు. ఇక్కడ ఆడ చేపలను ఆకర్షించేందుకు కారు అద్దంపై నీళ్లను తుడిచేటప్పుడు రబ్బరు చేసే శబ్దాలను మగ చేపలు చేస్తున్నట్లు గమనించారు. తమ గూళ్లను రక్షించేందుకు కొన్ని డామ్‌సెల్ఫిష్‌లు నోటి పళ్లను కొరుకుతూ శబ్దాలు కూడా చేస్తున్నట్లు కనిపెట్టారు.

మగ హ్యాడాక్ చేపలు కూడా కొన్ని పాటలు, లయబద్ధమైన శబ్దాలతో ఆడ చేపలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ శబ్దాలే ఆడ చేపల్లో ఉద్రేకానికి కారణం అవుతాయి.

స్నేహితులకు సంకేతాలు..

హెర్రింగ్, షేడ్స్, సార్డీన్‌లాంటి చేపల కుటుంబమైన క్లూపీడేలోని కొన్ని జాతులైతే ఇతర చేపలతో మాట్లాడేందుకు చేసే శబ్దాలపై ఎన్నో జోకులు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ చేపలు జీర్ణ నాళాల్లోని శబ్దాల సాయంతో ఇతర చేపలకు సంకేతాలు పంపిస్తుంటాయి.

‘‘ఈ చేపలపై శాస్త్రవేత్తలు జోకులు వేసుకుంటారు. ఈ చేపల శబ్దాలను మొదట గుర్తించినవారు వీటికి ‘ఫాస్ట్ రిపిటీటివ్ టిక్స్’ అని పేరు పెట్టారు. వీటినే ఫార్ట్ సౌండ్స్ అని కూడా జోకులు వేసుకునేవారు’’ అని లూబీ అన్నారు.

పసిఫిక్ హెర్రింగ్‌పై జరిపిన ఒక అధ్యయనంలో ఈ శబ్దాలకు.. ఆ చేపలు ఏ ఆహారం తీసుకుంటున్నాయి? అవి గాల్చి పీల్చుకుంటున్నాయా? లాంటి అంశాలతో సంబంధంలేదని తేలింది. దీంతో జీర్ణ సమయంలో వచ్చే గ్యాస్ లేదా నోటి ద్వారా పీల్చుకునే గాలే ఈ శబ్దాలకు కారణమనే వాదన తప్పని రుజువైంది.

సాధారణంగా ఈ చేపలు వాటి మలద్వార ప్రాంతంలోని గ్యాస్‌ను కడుపు లేదా స్విమ్ బ్లాడర్ ద్వారా బయటకు పంపిస్తూ ఈ జీర్ణాశయ శబ్దాలను చేస్తుంటాయి. కొన్ని సెకన్ల పాటు వినిపించే ఈ శబ్దాలు ఎక్కువగా రాత్రిపూట సంకేతాలను పంపించేందుకు ఉపయోగిస్తూ ఉండొచ్చని లాబీ అన్నారు.

వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకు..

కొన్ని చేపలు ఇతర చేపలను ఆకర్షించడానికి కాకుండా, దూరంగా ఉంచేందుకు కూడా ఇలాంటి శబ్దాలను చేస్తుంటాయి. ఉదాహరణకు స్క్వీకర్ క్యాట్‌ఫిష్‌ను తీసుకోండి. ఇది తన ప్రత్యర్థులను భయపెట్టేందుకు కరకరమనే శబ్దం చేస్తుంటుంది.

మరొక జాతి అయిన బ్లాక్‌బార్ ట్రిగ్గర్‌ఫిష్ అయితే, ఇతర జాతులు బెదిరించినప్పుడు, చిన్న డప్పు కొట్టే తరహా శబ్దాలను చేస్తుంది. ఇది దాదాపు 85 మిల్లీ సెకండ్లపాటు మాత్రమే ధ్వనిస్తుంది.

సొర చేపల కుటుంబానికి చెందిన స్ట్రింగేస్‌ చేపలు కూడా శబ్దాలను చేస్తుంటాయని స్వీడిస్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది.

ఇదివరకు పిల్లలకు ఆహారం ఇచ్చేటప్పుడు సొర చేపలు, ఆ కుటుంబానికి చెందిన మరికొన్ని మాత్రమే శబ్దాలు చేస్తాయని గతంలో భావించేవారు. కానీ, ఇప్పుడు రేస్ చేపలు కూడా ఆహారం ఇచ్చిన తర్వాత శబ్దాలు చేస్తాయని తాజాగా తేలింది.

అయితే, మాన్‌గ్రూవ్ విప్రేస్, కౌటెయిల్ స్ట్రింగ్‌రేస్ కూడా ఏదైనా ముప్పుకు గురైనప్పుడు హైఫ్రీక్వెన్సీ శబ్దాలు చేస్తాయని పరిశోధకులు గమనించారు.

గూడును కాపాడుకునేందుకు

కొన్ని సందర్భాల్లో చేపలు చేసే శబ్దాలు చాలా సంక్లిష్టంగానూ ఉంటాయి. యూరప్, మధ్యధరా, ఏడ్రియాటిక్ సముద్ర ప్రాంతాల్లో కనిపించే కార్క్‌వింగ్ రాసే చేపలు నాలుగు భిన్న రకాల శబ్దాలను చేస్తుంటాయి. వీటిలోని ఆడ కర్క్‌వింగ్ చేపలపై అధ్యయనం అనంతరం ఈ శబ్దాలను గుసగుసలు, తీవ్రమైన గుసగుసలు, క్లిక్‌లు, ఫ్లాప్‌లుగా వర్గీకరించారు.

కార్క్‌వింగ్ రాసెస్ వేగంగా తమ నోర్లను మూసి తెరుస్తూ, దవడలతో క్లిక్‌మనే శబ్దాలు చేస్తుంటాయి. ఇతర చేపలపై దాడి చేసేటప్పుడు లేదా దాడిని తిప్పికొట్టేటప్పుడు, ఈ శబ్దాలు కాస్త గట్టిగా వినిపిస్తాయి. ప్లాప్ శబ్దాల విషయానికి వస్తే, మగ చేపలు ఆహారం లేదా గూడుకట్టుకునే పదార్థాలు తీసుకొచ్చినప్పుడు ఆడ చేపలకు వినిపించేలా ఈ శబ్దాలు చేస్తుంటాయి.

మహా సముద్రాల్లో శబ్దాలు

చేపలు తమతో తాము మాట్లాడుకునేందుకు ఉపయోగించుకునే సంకేతాల గురించి కొత్త విషయాలు తెలిసేకొద్దీ కొత్త కొత్త సమస్యలు కూడా బయటకు తెలుస్తున్నాయి.

షిప్పింగ్, చమురు, గ్యాస్ అన్వేషణతోపాటు తీరాల్లో పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో నీటిలోని చేపల కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయని, వీటి వల్ల చేపలు మాట్లాడుకోవడం కష్టం అవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రద్దీగా ఉండే రోడ్డు పక్కన నిలబడి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి ప్రయత్నించినట్టే ఇది ఉంటుందని రైస్ చెప్పారు. ‘‘పక్క నుంచి ఒక ట్రక్ వెళ్తే ఎదుటివారు చెప్పేది వినడం ఎంతో కష్టం అవుతుంది కదా. ఎదుటివారు చెప్పేది మనకు సరిగా వినపించదు. ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకుంటాం’’ అని ఆయన అన్నారు.

పెరుగుతున్న ఈ శబ్దాలతో చేపలపై ఒత్తిడి పెరిగి, కొన్ని శారీరక దుష్ప్రభావాలు కూడా రావచ్చు.

నౌకల వల్ల వచ్చే శబ్దాలతో తిమింగలాల మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింటోందని ఇప్పటికే అర్థమైంది. శబ్దాలు మరీ ఎక్కువైనప్పుడు చేపల ఇంద్రియాల పనితీరులోనూ మార్పు వస్తుందని అధ్యయనాల్లో తేలింది.

డస్కీ డామ్‌సెల్ఫిష్‌పై చేపట్టిన ఒక అధ్యయనంలో విపరీతమైన శబ్దంతో సంగీతం లేదా ధ్వనులకు వీటిని గురించేసినప్పుడు వీటిలో ఆందోళన పెరుగుతోందని, మతిమరుపు కూడా వస్తోందని వెల్లడైంది.

ఇప్పటికీ చాలావరకూ చేపల కమ్యూనికేషన్ వ్యవస్థ అంతుచిక్కకుండా ఉన్నప్పటికీ, వీటి గురించి మరింత తెలుసుకునేందుకు వీటి రికార్డులను సేకరించడం చాలా ముఖ్యం.

‘‘దీనిలో చాలా అంతుచిక్కని విషయాలు ఉన్నప్పటికీ, అసలు చేపలు ఎలా జీవిస్తున్నాయి? ఇతర జీవులతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి? లాంటివి తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఈ విషయంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది’’ అని రైస్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-28T08:52:57Z dg43tfdfdgfd