టిల్లు స్క్వేర్ రివ్యూ: టిల్లు- లిల్లీ మ్యాజిక్ పనిచేసిందా? సిద్ధు మరో హిట్ కొట్టాడా?

‘డీజే టిల్లు’తో సిద్దు జొన్నలగడ్డ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు టిల్లు పాత్రకు యువతలో ‘కల్ట్’ ఫాలోయింగ్ వచ్చింది.

దీని తరువాత ప్రకటించిన ‘టిల్లు స్కేర్’ సీక్వెల్ సుదీర్ఘకాలం షూటింగ్ జరుపుకొని ఎట్టకేలకు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

మరి, టిల్లు మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? టిల్లు పంచిన వినోదం ప్రేక్షకులను అలరించిందా?

కథ విషయానికొస్తే టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) డీజేగా ఫేమస్ అయిపోతాడు. టిల్లు ఈవెంట్స్ పేరుతో బిజినెస్ మొదలుపెడతాడు. సిటీలో ఎలాంటి ఈవెంట్స్ జరిగినా టిల్లు డీజే కొట్టాల్సిందే.

ఓ క్లబ్బులో లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) టిల్లుకు పరిచయమౌతుంది.

తొలి పరిచయంలోనే ఇద్దరూ చాలా దగ్గరైపోతారు. అయితే లిల్లీ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. తర్వాత ఏం జరిగింది? లిల్లీ ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఆమె రాకతో టిల్లు జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ.

టిల్లునే స్పెషల్ ఎట్రాక్షన్

కథాపరంగా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఒక‌ మూసలోనే వుంటాయి. మొదటి పార్ట్‌లో టిల్లు జీవితంలోకి ‘రాధిక’(నేహా శెట్టి) వచ్చిన తర్వాత జరిగిన హంగామా చూపిస్తే.. టిల్లు స్క్వేర్‌లో రాధిక స్థానంలో లిల్లీ వస్తుంది. తర్వాత కథ నడిచే తీరు, కథనం, సన్నివేశాల నడక ఇవన్నీ డీజే టిల్లునే గుర్తు చేస్తాయి.

డీజే టిల్లులో మాదిరే సీక్వెల్‌లో కూడా టిల్లునే ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రను చాలా వినోదాత్మకంగా రాసుకున్నాడు దర్శకుడు.

ఇక లిల్లీ పాత్రను శ్రుతిమించిన సన్నివేశాలకు వాడుకుంటున్నారా అనే భావన కలిగించినప్పటికీ లిల్లీ అసలు ఉద్దేశం బయటపడిన తర్వాత కథకు అనుగుణంగానే సరస సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని అర్థమవుతుంది.

విరామ ఘట్టంలో చంద్రముఖి పాటను వాడుకున్న తీరు బాగా వర్కవుట్ అయ్యింది.

టిల్లు స్క్వేర్ తొలి సగం అంతా పార్ట్ వన్ రెఫరెన్స్‌లని, అందులో సన్నివేశాలను పదేపదే గుర్తు చేస్తూ ముందుకు సాగుతుంటుంది. అయితే ఇందులో అసలు కథ, లిల్లీ లక్ష్యం ఏమిటనేది ద్వితీయార్ధంలో తెరపైకి వస్తాయి.

ఈ బ్యాక్ డ్రాప్ పాతదే అయినప్పటికీ దాన్ని మలిచిన విధానం మాత్రం నవ్వులు పంచుతుంది.

సింగిల్ హ్యాండ్ సిద్దు

టిల్లు స్క్వేర్‌ను నిలబెట్టింది సిద్దు జొన్నలగడ్డ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. మొత్తం సినిమాను తన భుజాలతో పైనే మోశాడు.

దాదాపు ప్రతి సన్నివేశంలో కనిపిస్తాడు. తన నుంచి వచ్చిన సింగిల్ లైనర్స్ నవ్విస్తాయి.

అవకాశం లేని చోట కూడా తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన స్క్రీన్ ప్రజెన్స్, కామెడీ టైమింగ్, వేషధారణ ప్రతిదీ అలరిస్తుంది.

లిల్లీగా చేసిన అనుమపకి అది పూర్తిగా భిన్నమైన పాత్ర.

ఇప్పటివరకు తనకున్న ఇమేజ్‌కు భిన్నంగా కనిపించింది.

అయితే ఆమె పాత్ర ఊహకు ముందే అందిపోవడంతో పెద్ద సర్ప్రైజ్ వుండదు.

అలాగే ప్రిన్స్ పాత్రను బలవంతంగా ఇరికించినట్టుగా ఉంటుంది.

టిల్లు తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ మరోసారి ఆకట్టుకున్నారు.

మురళీ శర్మ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు.

ఇందులో ఓ సర్‌ప్రైజ్ ఎంట్రీ వుంది.

మిగతా పాత్రలు పరిధిమేర ఉన్నాయి.

టెక్నికల్‌గా ఎలా ఉంది?

రామ్ మిర్యాల అందించిన పాటలు ఆకట్టుకొనేలా ఉన్నాయి.

పాటలను కలర్‌ఫుల్‌గా చిత్రీకరించారు.

భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ట్రెండీగా ఉంది.

సాయి ప్రకాష్ కెమెరాపనితనం బాగుంది.

నిర్మాణ విలువలు పర్వలేదనిపిస్తాయి.

సంభాషణలు హాస్యమే ప్రధానంగా రాసుకున్నారు. ముఖ్యంగా టిల్లు నోటి నుంచి వ‌చ్చిన ప్ర‌తీ మాటా పండింది.

దర్శకుడు కథ కథనాలు కాకుండా టిల్లు పాత్రపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు.

డీజే టిల్లు తో పోల్చుకుంటే ఇందులో సహజత్వం తగ్గింది. అయితే టిల్లు పాత్రను ఇష్టపడే ఆడియన్స్‌కు టిల్లు స్క్వేర్ కూడా నచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2024-03-29T08:21:52Z dg43tfdfdgfd