PARENTING TIPS | మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో పడిపోతారు!

Parenting Tips | శిశు సంరక్షణ చాలా బాధ్యతతో కూడుకున్న అంశం. బిడ్డ ఏడుపును బట్టి ఆకలితో ఏడుస్తున్నదా, కడుపు నొప్పితో బాధపడుతున్నదా అంచనా వేయగలగాలి. పిల్లవాడి ముఖంలో హావభావాలను బట్టి వెళ్లింది ఒకటికా, రెంటికా అని గుర్తించగలగాలి. కానీ, డైపర్లు వచ్చాక పిల్లల కాలకృత్యాల గురించి తల్లిదండ్రులకు పట్టింపు లేకుండా పోయింది. నాలుగైదు గంటలకు ఒకసారి డైపర్‌ మార్చేసి చేతులు కడిగేసుకుంటున్నారు చాలామంది. కానీ, డైపర్ల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. అభం శుభం ఎరుగని చిన్నారులను కష్టపెట్టినట్టే అవుతుంది.

ఒకప్పుడు పిల్లలకు కాటన్‌ వస్త్రంతో తయారు చేసిన గోచీలను డైపర్లుగా వాడేవారు. శిశువులు మలమూత్ర విసర్జన చేసినప్పుడు వాటిని మార్చడం కష్టమే! ఆ సమస్యను అధిగమించడానికే డైపర్లు రంగప్రవేశం చేశాయి. ఇంకేం.. కర్ణుడికి సహజ కవచంలా పిల్లలకు డైపర్లు అతికించేస్తున్నారు తల్లిదండ్రులు. శిశువు పుట్టినప్పటి నుంచి నాలుగైదేండ్లు వచ్చే వరకు డైపర్లు వాడుతూ, తమ పనిని తగ్గించుకుంటున్నారు. అయితే వీటి వాడకం, నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పిల్లలకు సమస్యలు తప్పవంటున్నారు శిశు వైద్య నిపుణులు. యథేచ్ఛగా డైపర్లను వాడుతూ పోతే.. పిల్లలకు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

క్లాత్‌, డిస్పోజబుల్‌ ఇలా డైపర్లలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. చాలామంది మోడ్రన్‌ మామ్స్‌ యూజ్‌ అండ్‌ త్రో డైపర్లకే ఓటేస్తున్నారు. అయితే ఈ డిస్పోజబుల్‌ డైపర్లు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. అందుకే వస్త్రంతో చేసిన డైపర్లలో వాటర్‌ప్రూఫ్‌ రకం ఎంచుకుంటే మంచిది. అంతేకాదు వీటిని అన్ని దుస్తులతో కలిపి కాకుండా, విడిగా ఉతకాలి. అది కూడా వేడి నీటితో శుభ్రం చేయడం మంచిది. ఎలాగూ డ్రైగా ఉంటుంది కదా! అని పిల్లలు యూరిన్‌కు వెళ్లాక డైపర్లు మార్చకుండా ఉంటారు. కానీ, ఇది ఇలాగే కొనసాగితే పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

డైపర్‌ను తొడగడానికి ముందు పిల్లల గజ్జల్లో టాల్కమ్‌ పౌడర్‌ వేయడం మంచిది. ఆఫర్‌లో వస్తున్నాయనీ, తక్కువ ధర ఉందని నాసిరకం డైపర్లను వాడితే రోగాలు కొని తెచ్చుకున్నట్టే! అన్నిటికీ మించి ఇంట్లో ఉన్నప్పుడు కూడా పిల్లలను డైపర్‌లో బంధించడం సరికాదు. వదులుగా ఉండే గోచీ కడితే.. పిల్లలకు సుఖంగా ఉంటుంది. ఈ గోచీలను ప్రతిరోజూ విడిగా వేడినీటిలో ఉతికి.. ఎండకు ఆరబెట్టాలి. బయటికి వెళ్లినప్పుడు మాత్రమే డైపర్లను ఉపయోగించడం మంచిది.

2024-07-03T19:53:43Z dg43tfdfdgfd