తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​

తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​

జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్‌‌ హయాంలో తలాపున గోదారి పారుతున్న ధర్మపురి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వలేదని విప్‌‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌ విమర్శించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు, ఎమ్మెల్యేలు వివేక్‌‌ వెంకటస్వామి, వినోద్‌‌కుమార్‌‌‌‌, ప్రేమ్‌‌సాగర్‌‌‌‌రావు, విజయరమణారావు, ఎంఎస్‌‌ రాజ్‌‌ఠాకూర్‌‌‌‌, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు .

ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ బీఆర్ఎస్‌‌ సర్కార్​ ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి రూ.500 కోట్లు ఇస్తానని ఇవ్వలేదని, గోదావరి తలాపున పారుతున్న ఈ ప్రాంత రైతులకు తాగు, సాగునీరు ఇవ్వకుండా సిద్దిపేట, మెదక్, గజ్వేల్‌‌కు తరలించారన్నారు. అసెంబ్లీ సాక్షిగా పత్తిపాక  రిజర్వాయర్ నిర్మిస్తామని మాజీ మంత్రి హరీశ్‌‌రావు ప్రకటించి, ఆ హామీని నెరవేర్చలేదన్నారు. గోదావరిపై ఆధారపడిన లిఫ్ట్‌‌లను ప్రభుత్వమే టెకోవర్ చేయడంతో పాటు ధర్మపురిలో  డిగ్రీ, ఐటీఐ కాలేజీలు, రెవెన్యూ డివిజన్, బస్ డిపో ఏర్పాటు చేయాలనీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌‌‌‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం వాగ్దానాలు చేయదని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎంపీగా వంశీ గెలిపించుకోవాలన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లిలో వంశీ గెలుపు ఖాయమైందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ల అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలు అన్నిటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

 

సంజయ్​కి అన్ని ఆస్తులు ఎక్కడివి: మంత్రి పొన్నం ప్రభాకర్ 

రాజన్నసిరిసిల్ల,వెలుగు: 2019 ఎన్నికలకు ముందు మంగళసూత్రాలు అమ్ముకొని డిపాజిట్‌‌ కట్టినా అని చెప్పిన బండి సంజయ్‌‌కు.. ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎక్కడివని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ ఫైర్​ అయ్యారు. శుక్రవారం సిరిసిల్లలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌‌‌‌కు మద్దతుగా నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు రాగానే బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్త డ్రామాలాడుతాడన్నారు. ఈ విషయంలో ఆయనకు ఆస్కార్ ఇవ్వొచ్చన్నారు. సంజయ్‌‌ చేసిన అవినీతి వల్లే ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించారని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ 2004 నుంచి 2‌‌‌‌014వరకు దేశంలో అన్ని హామీలను నెరవేర్చిందన్నారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. 

కేసీఆర్‌‌‌‌ రాజన్నకే శఠగోపం పెట్టిండు.. 

కేసీఆర్ పదేండ్ల పాలనలో రాజన్న ఆలయానికే శఠగోపం పెట్టారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఇయ్యలేదన్నారు. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించలేదన్నారు. అప్పర్ మానేరు ప్యాకేజీ 9 ఎందుకు పూర్తి చేయలేదని కేటీఆర్‌‌‌‌ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. వేములవాడలో శ్రీ పాద రిజర్వాయర్‌‌‌‌, మర్రిపల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ ప్రాజెక్ట్, ఎర్రచెరువు రిజర్వాయర్లను ఎందుకు పూర్తి చేయలేదన్నారు.  

బండి సంజయ్ అన్ని గ్రామాల్లో అక్షింతలు వచ్చాయా అంటూ గ్రామాల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారన్నారు. రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బండి సంజయ్‌‌ను ఓడించాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.  సభలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌‌‌‌రావు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌‌చార్జి కేకే మహేందర్‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-04T00:37:02Z dg43tfdfdgfd