నటి హీనా ఖాన్‌కు బ్రెస్ట్ క్యాన్సర్, అమ్మాయిలలో ఈ వ్యాధి ఎందుకింతగా పెరుగుతోంది?

హిందీ నటి హీనా ఖాన్‌ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు.

తాను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధరణ అయ్యిందని హీనా చెప్పారు.

‘‘ఈ వ్యాధితో పోరాడుతున్నప్పటికీ, నేను బాగానే ఉన్నానని మీకందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఈ వ్యాధితో పోరాడేందుకు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. నాకు చికిత్స ప్రారంభమైంది. దీని నుంచి బయటపడేందుకు ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నా’’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఆమె రాశారు.

హీనా ఖాన్ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. ‘యె రిష్తా క్యా కెహలాతా హై’, ‘కసౌటి జిందగీ కీ’ వంటి పలు పాపులర్ టీవీ షోలలో ఆమె నటించారు. బిగ్ బాస్ 11వ సీజన్‌లో కూడా ఆమె పాల్గొన్నారు.

బీబీసీ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మాయిలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

గత పది నుంచి పదిహేను ఏళ్లల్లో చాలా వరకు క్యాన్సర్ కేసులు అమ్మాయిలలోనే నమోదవుతున్నాయని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్) సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్‌వీఎస్ దేవ్ తెలిపారు.

‘‘అమ్మాయిల్లో నమోదవుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఉన్నారు. వీరిలో, 20 నుంచి 30 ఏళ్ల వారు కూడా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు’’ అని ఎస్‌వీఎస్ దేవ్ బీబీసీకి చెప్పారు.

‘’40 నుంచి 45 ఏళ్ల వయసు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 30 శాతం పెరిగాయి. 44 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల్లో ఇలాంటి కేసులు 16 శాతం పెరిగినట్లు నిర్ధరణ అయింది’’ అని చెప్పారు.

పశ్చిమ దేశాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 40 ఏళ్లు దాటిన మహిళల్లో చూస్తుంటామని, 50 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతుంటాయని చెప్పారు.

తాను చూసిన ఒక తల్లి, కూతురు కేసును డాక్టర్ దేవ్ బీబీసీకి వివరించారు. ఆ ఇద్దరికీ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేశామని తెలిపారు. తల్లికి 55 ఏళ్లు ఉంటే, కూతురి వయసు కేవలం 22 ఏళ్లేనని చెప్పారు. ఒకటే రోజు ఆ ఇద్దరికీ బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు.

అంతకుముందు 50 నుంచి 60 ఏళ్ల మధ్యనున్న మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు చాలా సాధారణంగా ఉండేవని, కానీ ఇప్పుడు చాలా వరకు కేసులు 20 ఏళ్లు దాటిన అమ్మాయిలకు కూడా రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని క్యాన్సర్ నిపుణులు డాక్టర్ దేవ్రాత్ ఆర్యా చెప్పారు. ఇది చాలా అసాధారణ విషయమని అన్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ అంశంపై దేవ్రాత్ ఆర్యా తన థిసీస్‌ను సమర్పించారు.

‘‘గణాంకాలను పరిశీలిస్తే, 5 నుంచి 10 శాతం బ్రెస్ట్ క్యాన్సర్‌ కేసులు 20 నుంచి 30 ఏళ్ల మహిళల్లో బయటపడుతున్నాయి. ఇది చాలా ఎక్కువ’’ అని దేవ్రాత్ అన్నారు.

ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, తల, మెడ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులను చూస్తున్నట్లు డాక్టర్ ఆర్యా చెప్పారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

‘నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రొగ్రామ్ రిపోర్టు 2020’ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్‌ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్(ఎన్‌సీడీఐఆర్)లు విడుదల చేశాయి.

ఆ నివేదిక ప్రకారం 2020 నాటికి దేశంలో మొత్తం 13.9 లక్షల క్యాన్సర్ (అన్ని రకాల క్యాన్సర్లు) కేసులు ఉన్నాయని అంచనా. 2025 నాటికి ఈ కేసుల సంఖ్య 15.7 లక్షలకు చేరే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. అందులో 2025 నాటికి అత్యధికంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఉంటాయని, తర్వాత స్థానాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఉంటాయని ఐసీఎంఆర్ తెలిపింది.

28 క్యాన్సర్ రిజిస్ట్రీలు, 58 హాస్పిటల్ క్యాన్సర్ రిజిస్ట్రీలను ఆధారంగా చేసుకుని ఈ అంచనాలను విడుదల చేశారు.

మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఈ గణాంకాల్లో తెలిసింది.

బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

భారత్‌లో ఎందుకు ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయనే దానిపై డాక్టర్ ఎస్‌వీఎస్ దేవ్ వివరించారు.

‘‘భారత్‌ జనాభా పెరిగింది. ఇదే స్థాయిలో కేసులు కూడా పెరిగాయి. యవ జనాభా పెరిగినప్పటి నుంచి, వారిలో ఈ కేసులు అధికంగా రికార్డవుతున్నాయి’’ అని తెలిపారు.

క్యాన్సర్‌కు, జనాభా పెరుగుదలకు సంబంధం ఉందా? అంటే.. ‘‘బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నది వాస్తవం. ఇరవై ఏళ్లల్లో 20 శాతం కేసులు పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి. ఈ విషయాన్ని క్యాన్సర్ రిజిస్ట్రీ కూడా ధ్రువీకరిస్తోంది’’ అని దేవ్ అన్నారు.

‘‘ప్రధాన కారణం జీవనశైలి. ఇక రెండో కారణం జన్యుపరమైన అంశం. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, తర్వాత తరం వారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి’’ అని డాక్టర్ దేవ్ తెలిపారు.

20 నుంచి 30 ఏళ్లున్న మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులకు కారణం జీవనశైలి కంటే జన్యుపరమైన అంశాలే ఎక్కువని డాక్టర్ ఆర్య చెప్పారు.

సంతానోత్పత్తిపై ప్రభావం

క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే కీమో థెరపీ వల్ల మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందని డాక్టర్లు చెప్పారు.

20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు అమ్మాయిల్లో కొందరు అప్పటికే పెళ్లయిన వారుంటే, మరికొందరికి పెళ్లి కావాల్సి ఉంటుంది. అప్పుడే పెళ్లయిన వారు లేదా పిల్లలకు ప్లాన్ చేసుకుంటున్న వారికి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

ఇలాంటి కేసుల్లో, చికిత్స ప్రారంభానికి ముందే రోగితో వివరంగా మాట్లాడతామని డాక్టర్లు చెప్పారు. పూర్తి ప్రక్రియను వివరిస్తామన్నారు.

ఎందుకంటే, చాలా కేసుల్లో కీమో థెరపీ వారి అండాశయంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే, ఓవరియన్ ప్రిజర్వేషన్‌ చేపట్టుకోవచ్చని సూచిస్తామన్నారు. రెండు మూడేళ్లకు కోలుకున్న తర్వాత పిల్లల్ని కనవచ్చన్నారు.

ఒకవేళ అమ్మాయిలు చాలా చిన్న వారైతే, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ లేదా రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పూర్తిగా రొమ్మును తొలగించమని చెప్పారు.

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలేంటి?

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాల్లో సాధారణంగా కనిపించేది బొడిపె రావడం. రొమ్ములో లేదా దానిపై ఎక్కడైనా బొడిపె కనిపిస్తే, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

రొమ్ములో ఏదైనా వాయడం లాంటిది కనిపించినా, అశ్రద్ధగా ఉండకండి. ఒకవేళ రొమ్ములో ఒక భాగంలో వాపు కనిపిస్తే, వెంటనే అలర్ట్ కావాలి.

చర్మం చీదరచీదరగా, చిరాకుగా అనిపించడం, ఎర్రగా మారడం లేదా గట్టిగా మారడం వంటి ఏమైనా మార్పు కనిపించినా, చర్మ ఆకృతిలో మార్పులు వస్తే డాక్టర్లను సంప్రదించాలి.

అమ్మాయిలలో ఇలాంటి క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం కాస్త కష్టమేనని డాక్టర్లు చెప్పారు.

ఈ లక్షణాలు సరిగ్గా బయటపడవని, చిన్న కణితులను గుర్తించలేమని, మామోగ్రఫీ ద్వారా కూడా కొన్నిసార్లు వీటిని గుర్తించలేకపోవచ్చని చెప్పారు.

పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-06-29T08:48:30Z dg43tfdfdgfd