నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చా.. ఎలాంటి ఫలితాలుంటాయంటే..

ఇటీవల కాలంలో శ్రీ వారాహి అమ్మవారు ఎక్కువగా ప్రాచుర్యం పొందారని చెప్పాలి. కారణాలు ఏవైనా రాజకీయ నాయకులు, అలాగే చాలా మంది ప్రముఖులు వారాహి అమ్మవారిని నమ్మిన తర్వాత ఆవిడ ప్రాచుర్యం బాగా పెరిగింది. అనాదిగా ఉన్న అవతారమైనపట్టికీ ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ నేతలు ఆమెను కొలవడంతో చాలావరకు పాపులర్ అయ్యారని చెప్పాలి. అయితే వారాహి అమ్మవారికి కూడా నవరాత్రులు ఉంటాయని అమ్మవారి విషయంలో చాలామంది భక్తులు కఠిన నియమాలను భక్తి ప్రపత్తులు పాటించి, పూజిస్తారని అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారని మీకు తెలుసా.! వారాహి అమ్మవారిని ఎవరు పూజించవచ్చు..! ఎలా పూజించాలి..! నియమాలు ఏమిటి..! వంటి విషయాల కోసం ఈ కథనం చూడండి.

శ్రీ వారాహి అమ్మవారి రూపం, అవతారం చాలా మహిమ కలది. ఆమె శ్రీ లలితా దేవత సైన్యాధికారిణిగా పిలుస్తారు. లలితా అమ్మవారికి ఇద్దరు బలమైన శక్తి దేవతలు‌ అండగా ఉంటారు. ఇద్దరిలో ఒకరు మంత్రిగా, ఇంకొకరు సైన్యాధ్యక్షులుగా చెబుతారు. మంత్రిగా శ్రీ శ్యామలదేవి, సైన్యాధిపతిగా శ్రీ వారాహి అమ్మవారు నియోగించబడ్డారని పురాణాల ప్రకారం తెలుస్తున్నది. వారాహి అమ్మవారిని వార్తాలీ అని, శక్తి రూపిణి అని అలాగే దండనాధి అని కూడా అంటారు. అమ్మవారిని శత్రువులను సంహారం చేసే శక్తి దేవతగా కూడా కొలుస్తారు. రాజ్యాధికారం కావాలన్నా.. భూ సామ్రాజ్యాధికారం కావాలన్నా ఎటువంటి భూ ఆధిపత్యం కోసం ఉద్దేశించినా అమ్మవారిని ఒకప్పటి రాజ్య పాలన చేసే వారు క్లిష్టమైనటువంటి సమయంలో కొలిచి, అర్చించిన సకల సంపదలు కలిగి ఉంటారని పురాణ కథనాలు ఉన్నాయి.

ఇక కలియుగం కాబట్టి.. ఈ యుగంలో వారాహి అమ్మవారిని కొలవాలనికునేవారు తక్కువగా ఉంటారు. ‌అయితే అందరూ అమ్మవారిని కొలవవచ్చు. ముఖ్యంగా భూభాగాలు, అలాగే భూ సమస్యలు, భూ లావాదేవీల సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న చాలా భూ సమస్యలను తీరుస్తారని నమ్మిక. గతంలో చాలామంది వారాహి అమ్మ వారిని నమ్మి, భూ వివాదాల నేపథ్యంలో శత్రు బాధల నివారణ, పరిష్కారం కోసం పూజించారని అలా కొలిచిన వారికి భూ వివాద సమస్యలు తొలగి, కఠినతరమైన సమస్యలు పరిష్కారమై సుఖశాంతులతో వర్ధిల్లారని కూడా వేద పండితుల కందుకూరి బాల సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.

ఇక అమ్మవారి నవరాత్రులు కూడా ఈ ఏడాదిలో ఉన్నాయని వేద పండితుల కందుకూరి బాల సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ నెల జూలై 6 నుంచి 15 వరకు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయని తెలిపారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా కొలవచ్చని, ఎంతటి వారైనా, సామాన్యులైన ఎవరైనా అమ్మవారిని కొలుచుకోవచ్చని, అమ్మవారిని పూజించవచ్చని తెలిపారు. అమ్మవారి ప్రతిమల, ఫోటో ఏదైనా పెట్టి నవరాత్రులు చేయవచ్చని, నవరాత్రుల ప్రతీ రోజు లలితా సహస్ర పారాయణమైనా చేయవచ్చని అన్నారు. అదే విధంగా అమ్మవారి వివిధ పేర్లు తలుచుకుంటూ వారాహి, వార్తాళి,‌ దండనాధ, శక్తి రూపిని అంటూ కొలవచ్చని అంటున్నారు.

2024-07-03T07:45:58Z dg43tfdfdgfd