నేనేం చేశానని నా గొంతు నొక్కారు..సీఎం మాట్లాడే మాటలు ఈసీకి కనపడ్తలేవా? : కేసీఆర్

నేనేం చేశానని నా గొంతు నొక్కారు..సీఎం మాట్లాడే మాటలు ఈసీకి కనపడ్తలేవా? : కేసీఆర్

గోదావరిఖని, వెలుగు : ఈసీ తనపై నిషేధం విధించినా తన గొంతు మాట్లాడుతుందని బీఆర్ఎస్  చీఫ్  కేసీఆర్  అన్నారు. తానేం చేశానని తన గొంతు  నొక్కారని ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్  రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఈసీకి వినిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్​ తరపున శుక్రవారం రాత్రి కేసీఆర్  ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. తన బ‌స్సుయాత్రతో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు వణికిపోతున్నారని అన్నారు.

‘‘ఎన్నిక‌ల ప్రచారంలో మ‌తం గురించి మాట్లాడడం త‌ప్పు.  దేవుళ్ల బొమ్మలు చూపించ‌డం త‌ప్పు. బీజేపీ నాయ‌కులు.. మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడినా ఈసీ ప‌ట్టించుకోవ‌డం లేదు. ముఖ్యమంత్రి రేవ‌ంత్ రెడ్డి గుడ్లు పీకి గోలీలు ఆడుతానని, పేగులు తీసి మెడ‌లో వేసుకుంటానని మాట్లాడుతున్నా ఈసీ ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ, ప్రజల సమస్యలపై నేను మాట్లాడితే నా మీద నిషేధం విధించారు” అని కేసీఆర్  అన్నారు. ‘‘కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చే ముందు ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడెలా ఉన్నాయి? ఒక్క పెద్దప‌ల్లి జిల్లాలోనే 50 వేల ఎక‌రాలకు పైగా పంటలు ఎండిపోయాయి.

గ‌త ప‌దేండ్లలో ఎన్నడైనా పంట‌లు ఎండినయా? ప‌దేండ్లలో క‌రెంటు కోతలు లేకుండె. ఇప్పుడు ఎందుకు కోత‌లు విధిస్తున్నారో ప్రజలు ఆలోచించాలి” అని కేసీఆర్  వ్యాఖ్యానించారు. సింగ‌రేణిని కాంగ్రెస్  పార్టీ నిండా ముంచిందని, కేంద్రం దగ్గర అప్పులు తీసుకొని 49 శాతం వాటాను కేంద్రానికి ఇచ్చిందని ఆయన ఆరోపించారు. సింగరేణిని అదానీకి అప్పగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్  ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్  అభ్యర్థులను గెలిపిస్తే ఈ అంశంపై లోక్ సభలో నిలదీస్తారని కేసీఆర్  పేర్కొన్నారు. కాగా,  అంతకుముందు మున్సిపల్​ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు కేసీఆర్​ రోడ్​ షో నిర్వహించారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T04:22:56Z dg43tfdfdgfd