న్యూస్ రీడర్ షాకింగ్ వార్తలు: ‘రాక్షసుడైన నా తండ్రి సొంత కూతుర్నే వదల్లేదు’ అంటూ సొంత కథ వెల్లడి

జర్నలిస్ట్ జువాన్ పెడ్రో మంగళవారం మధ్యాహ్నం న్యూస్ బులెటిన్‌ను ఒక అసాధారణమైన షాకింగ్ స్టోరీతో మొదలుపెట్టారు. దేశ రాజకీయాల గురించో, ఆర్థికవ్యవస్థకు సంబంధించిన సంచలన వార్త కాదది.

తన వ్యక్తిగత జీవితంలోని భయంకరమైన కథతో వార్తల్ని మొదలుపెట్టారు.

అర్జెంటీనాలోని రొసారియోకు చెందిన చానెల్ 3 న్యూస్ ప్రోగ్రామ్‌లో జువాన్ పెడ్రో అలెర్ట్ తన సొంత కథను చెప్పుకొచ్చారు.

వెంటనే ఆయన కథ దేశమంతటా పాకింది. జాతీయ రేడియో, టీవీ చానెళ్లు అతని ఇంటర్వ్యూల కోసం బారులు తీరాయి.

చానెల్ 3కి మరో పేరు ఎల్టర్స్ టీవీ. ఈ చానెల్‌లోని ప్రధాన వ్యక్తుల్లో ప్రజెంటర్ జువాన్ పెడ్రో అలెర్ట్ కూడా ఒకరు. మధ్యాహ్నం న్యూస్ బులెటిన్ ‘డి 12 ఎ 14’లో, దుర్మార్గుడైన తండ్రి కారణంగా చిన్నతనం నుంచి తాను అనుభవించిన కష్టాలను గుర్తుచేసుకుంటూ 27 నిమిషాల పాటు తన కథను వీక్షకులతో పంచుకున్నారు.

టెలివిజన్ స్టూడియోలో కెమెరా ముందు కూర్చొని ఆయన తన కథను చెప్పారు.

ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

నేను మీ అందరికీ తెలుసు. 18 ఏళ్లుగా నేను మీడియాలో పనిచేస్తున్నా. నేను ఎన్నో వార్తల్ని చెప్పాను. తొలిసారిగా ఇప్పుడు నా సొంతకథను చెప్పబోతున్నా. ఇది నా జీవితంలో జరిగిన కథ’’ అంటూ ఆయన మొదలుపెట్టారు.

‘‘నా తరహాలో కష్టాలను ఎదుర్కొంటున్న వారికి, కఠిన పరిస్థితుల్ని అనుభవించిన వారికి సహాయపడాలని నేను కోరుకుంటా. చాలా ఏళ్ల క్రితం, అంటే ఒక దశాబ్దం కిందట నా తండ్రికి దూరంగా ఉండాలని నేను నిర్ణయించుకున్నా. క్రమంగా నా కుటుంబానికి దూరమయ్యాను. మా ఇంట్లో జరిగిన కొన్ని విషయాలు నాకు నచ్చలేదు. నన్ను చాలా బాధించాయి. చిత్రవధ చేశాయి.

అప్పటినుంచి మా ఇంట్లో అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలని అనుకున్నా. సమస్యను అన్వేషించడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. నిజాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాను. ఒకరోజు నా ప్రశ్నలకు సమాధానం దొరికింది. నిజం బయటపడింది. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది.

నిరుడు నా తండ్రి మీద గృహహింస కేసు పెట్టాను. శారీరకంగా, మానసికంగా, ఉద్వేగాల పరంగా ఇలా అన్నిరకాలుగా మా నాన్న దుర్మార్గంగా ప్రవర్తించారు. నాతో సహా మా ఇంట్లోని అందర్నీ ఆయన భయబ్రాంతులకు గురిచేశారు.

https://www.instagram.com/p/C58aReOOWsW/?utm_source=ig_embed&ig_rid=94ad823d-6956-4fe7-85ac-25db887bcac5

ముగ్గురు సంతానంలో నేనే పెద్దవాడిని. నా చెల్లెలుతో కలిసి మా నాన్నపై ఫిర్యాదు చేశాను. నా చెల్లి ప్రశాంతంగా జీవించాలని మాత్రమే నేను కోరుకున్నా. ఎందుకంటే, మా నాన్నకు ఎదురుపడిన ప్రతీసారి ఆమె భయంతో వణికిపోతుంది. మొహంలో రక్తం చుక్క లేకుండా పాలిపోతుంది. భయంతో ప్యానిక్ అటాక్‌కు గురవుతుంది’’ అని చెప్పారు. 0

తన తండ్రి హింసాత్మకంగా వ్యవహరించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఆయన చెప్పారు.

‘‘నా చెల్లికి మూడేళ్ల వయస్సున్నప్పటి నుంచే మా నాన్న ఆమెను లైంగికంగా వేధించాడు. ఆయనకు హెచ్‌ఐవీ వ్యాధి కూడా ఉంది. నా తండ్రి తన సొంత కూతుర్నే లైంగికంగా హింసించాడు.

దీనివల్ల నా చెల్లికి చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అదృష్టవశాత్తు, ఆమెకు వ్యాధి సోకలేదు. కానీ, ప్యానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్, నిద్రలేమి, జుట్టు రాలిపోవడం, బరువు కోల్పోవడం వంటి నా చెల్లి అనుభవించిన బాధలన్నింటినీ నేను చూశాను.

నాన్న ప్రవర్తనతో విసిగిపోయి చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని ఆమె నాతో చెప్పింది.

నాన్నపై ఫిర్యాదు చేయమని, క్రిమినల్ కేసు పెట్టమని నేనే తనను బలవంతం చేశాను. లాయర్ల ఫీజుల సంగతి నేనే చూసుకున్నాను. ఎట్టకేలకు మేం అతనిపై కేసు పెట్టాం. సైకలాజికల్ రిపోర్ట్ సమర్పించాం. మా నాన్న అకృత్యాలకు నేనే సాక్షిని. ఎందుకంటే, నా చిన్నతనంలో నా కళ్లముందే ఆయన నా చెల్లిని లైంగికంగా వేధించాడు. తర్వాత అదంతా ఒక ఆట అని అనుకునేలా చేశాడు.

నేను, నా సోదరుడు మా చెల్లికి పిచ్చి పట్టింది అనుకునేలా చేశాడు. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని మమ్మల్ని నమ్మించాడు.

నా తల్లి కూడా బాధితురాలే. మూడు వారాల క్రితం మేం చేసిన ఈ క్రిమినల్ ఫిర్యాదు గురించి మా నాన్నకు తెలిసింది.

తాను చేసిన అకృత్యాలు, దుర్మార్గాలను ఎదుర్కోవడం ఇష్టం లేక తన ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాడు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసి నేను షాకయ్యా. మూడేళ్ల కూతురిపై హెచ్‌ఐవీతో లైంగిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టినరోజే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో చేసిన తన చివరి మెసేజ్‌లలో కూడా ఆయన మా చెల్లిని పిచ్చిదనే ప్రస్తావించారు.

ఇప్పుడు, నేను నా చెల్లికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సోఫీ, నేనేం చెప్పదల్చుకున్నానంటే నీ జీవితంలోని హారర్ సినిమా ముగిసింది. నా రాక్షసుడు నీకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఇకపై నిన్ను ఎవరూ బాధపెట్టారు. హాని కలిగించరు.

ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే, కొత్త జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి. ఇప్పటివరకు జీవితంలో ఎంతో పోరాడావు. నువ్వు స్వేచ్ఛగా బతకాలి. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవివి. హాయిగా జీవించు సోఫీ, లెట్స్ ఫ్లయ్’’ అంటూ తన చెల్లి ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించిన జువాన్ ఇంకొన్ని రహస్య సంగతులను కూడా చెప్పారు.

https://twitter.com/elTresTV/status/1780990850585047172

‘‘హింసాత్మక వాతావరణం, లైంగికంగా వేధించే తండ్రి, భర్త చేసే నేరాలకు బాధితురాలు, సహచరురాలు అయిన ఒక తల్లి, తప్పుడు పనులు సహజమే అనే భావన కల్పించే ఆ ఇంట్లో నేను ఒక వ్యక్తిని చాలా నమ్మాను. చాలా సందర్భాల్లో ఆయన నాకు తండ్రి పాత్ర పోషించాడు. అతను నా మేనమామ. మా ఇంట్లోని పరిస్థితులను అదనుగా తీసుకున్న ఆయన నన్ను, నా సోదరుడిని లైంగికంగా వేధించాడు. నాకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి ఈ వేధింపులు మొదలుపెట్టాడు.

నాకు 12, 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మా ఇంట్లో జరుగుతున్న ఘటనల్ని నేను గ్రహించాను. తల్లిదండ్రులు ఏమీ చేయలేని స్థితిలోఉన్న ఆ ఇంట్లో నేను హెచ్చరించినా పెద్ద ఫలితం లేకపోయింది.

నన్ను, నా సోదరుడిని ఆయన లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు.

చివరకు 2022లో దీని గురించి నేను బయటపెట్టాను. ఈ అంశంపై ఫిర్యాదు చేయడం చాలా కష్టం. కానీ, ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని ఆ పని చేయగలిగాను.

నేను చాలా నెలల పాటు డిప్రెషన్‌లో ఉన్నా. ఇదంతా మనసులో పెట్టుకొని ఇక్కడికొచ్చి వార్తలు చదవడం చాలా కష్టంగా ఉండేది.

కారులో కూర్చొని ఏడుస్తూ ఆఫీసుకు వచ్చేవాడిని. గొంతులో బాధంతా దాచుకొని ఈ కార్యక్రమం చేస్తాను. ఎవరికీ తెలియకుండా ఒక గదిలో తాళం వేసుకొని ఏడుస్తాను. దీనిగురించి ఎవరికీ తెలియాలని నేను అనుకోలేదు.

జీవితం అంటే విరక్తి ఏర్పడింది. నవ్వలేకపోయేవాడిని. నా వ్యక్తిగత జీవితాన్ని ఇది చాలా ప్రభావితం చేసింది. కానీ, ఈరోజు నేను ఎప్పటికంటే మానసికంగా చాలా దృఢంగా ఉన్నాను.

చాలా థెరపీలు తీసుకున్నా. ఇకపై కూడా థెరపీలకు వెళ్తాను. అవసరమైతే వారాంతాల్లో కూడా థెరపీ తీసుకుంటా.

నాకున్న చిన్న స్నేహితుల సమూహాం, వారు చూపించే ప్రేమ నన్ను ఇంకా నడిపిస్తున్నాయి’’ అని ఆయన చెప్పారు.

లైంగిక వేధింపులకు గురైన పురుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘ఈ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ భార్యకు, మీ పిల్లలకు, స్నేహితులకు, సైకాలజిస్టులకు మీలో చాలామంది ఈ విషయం చెప్పి ఉండరు.

కానీ, దీన్నుంచి బయటపడే ఒకే ఒక మార్గం ఆ బాధ గురించి మాట్లాడండి.

మీరు నిశ్శబ్ధంగా ఉంటే వేధింపులకు పాల్పడేవారికి ప్రయోజకరంగా మారుతుంది. ఇలాంటి వాటిపై ధైర్యంగా మాట్లాడే మహిళల నుంచి స్ఫూర్తి పొందండి.

‘‘మాట్లాడండి, సహాయం కోరండి, ఒకరికొకరు అండగా ఉండంది. ఇదే దీన్నుంచి బయటపడే మార్గం’’ అని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-20T09:54:22Z dg43tfdfdgfd