పద్మశ్రీ మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. అసలు ఆయన కూలి పనికి వెళ్తున్నారా?

తెలంగాణ జానపద కళాకారుడు, పాలమూరు ముద్దుబిడ్డ.. పద్మశ్రీ మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవ్వడంతో.. ఇది తెలంగాణలో పెద్ద కలకలమే రేపింది. దీనిపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మొగిలయ్యను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

మాట ఇచ్చిన ప్రకారమే.. ఆదివారం మొగిలయ్యను కలిసిన కేటీఆర్.. ఆర్థిక సాయం చేశారు. పద్మశ్రీ మొగిలయ్య.. తెలంగాణకే గర్వకారణం, ఆయన గొప్ప కళాకారుడు అన్న కేసీఆర్.. ఆయన కష్టాల్లో ఉన్నారనీ, ఆయనకు సాయం చెయ్యడంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు.

మొగిలయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్‌తో పాటు అన్ని రకాల హామీలనూ నెరవేర్చాలని ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మొగిలయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణం అన్న కేటీఆర్.. అలాంటి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.

కేటీఆర్ తనకు చేసిన సహాయానికి మొగిలయ్య ధన్యవాదాలు తెలిపారు. రోజువారీ జీవితం గడపడడమే కష్టంగా ఉందన్న ఆయన.. కేటీఆర్ చేసిన సహాయంపై సంతోషం వ్యక్తం చేశారు.

మొగిలయ్య అరుదైన కిన్నెర వాయిద్య వాగ్గేయకారుడు. గత ప్రభుత్వ హయాంలో పద్మశ్రీ అవార్డు పొందారు. ఐతే.. ఆయన కూలిపనికి వెళ్తున్నారంటూ.. ఓ వీడియో తాజాగా వైరల్ అయ్యింది. అందులో ఆయన తన ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. కానీ.. వీడియో పోస్ట్ చేసిన వారు.. ఆయన కూలి పనులకు వెళ్తున్నారని ప్రచారం చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో.. మళ్లీ మొగిలయ్య వార్తల్లో నిలిచారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొగలయ్యకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనాన్ని ప్రకటించింది. 2022లో ‘పద్మశ్రీ’ అవార్డు వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మొగిలయ్యకు రూ.కోటి గ్రాంటు, 600 చదరపు గజాల స్థలం ఇస్తామని తెలిపింది. ఐతే.. రూ.కోటి గ్రాంటు ఇచ్చింది గానీ, ఇంటి స్థలం ఇవ్వలేదు. దాంతో తనకు వచ్చిన డబ్బుతో తుర్కయంజాల్‌లో 95 చదరపు గజాల స్థలం కొని, ఇంటి నిర్మాణం చేపట్టారు. కానీ అది పూర్తి కాలేదు. అందులో భాగంగా ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా.. ఎవరో ఫొటో తీసి.. దాన్ని వైరల్ చేసి.. కూలి పనులు చేస్తున్నారని ప్రచారం చేశారు.

మొగిలయ్య కూలి పనులకు వెళ్లకపోయినా.. ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితి గొప్పగా లేదన్నది వాస్తవం. దీన్ని గమనించిన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మొగిలయ్యను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ వరకూ నెలనెలా రూ.10 వేలు చొప్పున పెన్షన్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

2024-05-05T09:41:34Z dg43tfdfdgfd