పప్పులో కాలేసిన కంగనా.. ప్రత్యర్ధిని టార్గెట్ చేయబోయి సొంత పార్టీ ఎంపీపైనే విమర్శలు..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్‌ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) పప్పులో కాలేశారు. ప్రత్యర్థి పార్టీ నేతను టార్గెట్ చేయబోయి.. సొంత పార్టీ నేతపైనే ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఇరువురు నేతల పేర్లలోని మొదటి పదం ఒకటి కావడంతో కంగనా గందరగోళానికి గురయి అడ్డంగా ప్రతిపక్షాలకు దొరికిపోయారు. కంగనా మాట్లాడిన వీడియోను ట్రోల్ చేస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్‌ను బీజేపీ బరిలోకి దింపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మండి పరిధిలోని సురేంద్రనగర్‌లో కంగనా.. ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్ష పార్టీల నేతలపై విమర్శలు గుప్పించే ప్రయత్నంలో ఆమె బొక్కబోర్లాపడ్డారు. ‘అవినీతిపరుల పార్టీ ఇక్కడ ఉంది.. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలని కలలు కనే రాహుల్‌ గాంధీ, రౌడీయిజం చేసి.. చేపలు తినే తేజస్వీ సూర్య వీరిలో ఉన్నారు’ అని అన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు బదులు బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పేరును ఉచ్చరించి ఆరోపణలు చేశారు.

తాజాగా, కంగనా రనౌత్‌ మాట్లాడిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌..‘ఈమె ఎవరు?’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కాంగ్రెస్ సైతం.. ఎంపీగా పోటీ చేసేందుకు ఆమెకు ఉన్న అర్హతలేంటి? అని ప్రశ్నించింది. చివరి దశ (ఏడో దశ)లో జూన్‌ 1 న మండి నియోజకవర్గంలో పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు, మంత్రి విక్రమాదిత్య సింగ్‌ పోటీ చేస్తున్నారు.

వారసత్వ రాజకీయాలకు చెందిన విక్రమాదిత్య సింగ్, రాహుల్ గాంధీలు అమలు సాధ్యం కాని హామీలు గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, అభివృద్ధి విషయంలో అరచేతుల్లో వైకుంఠం చూపుతున్నారని కంగనా దుయ్యబట్టారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T07:26:11Z dg43tfdfdgfd