పవన్ కల్యాణ్ ఆస్తులెన్ని, అప్పులెన్ని? ఎన్నికల అఫిడవిట్‌లో ఏముంది?

పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు.

గొల్లప్రోలు నుంచి ర్యాలీగా బయలుదేరి పిఠాపురం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలు కూడా వెల్లడించారు.

పవన్ కల్యాణ్ ఎన్నికల అఫివిట్‌‌లో ఏముందంటే..

పవన్ కల్యాణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తన పేరుతో బ్యాంకు నిల్వలు, బాండ్లు, వాహనాలు, బంగారం వంటివి కలిపి రూ. 41 కోట్ల 65 లక్షల విలువ చేసే ఆస్తులున్నాయి.

అందులో రూ. 2 కోట్ల విలువ చేసే 1,680 గ్రాముల బంగారం, డైమండ్లు ఉన్నాయి.

తన భార్య కొణిదెల అన్నా పేరిట 215 గ్రాముల బంగారం సహా మొత్తం రూ. కోటి 22 వేల విలువైన ఆస్తులున్నాయి.

పవన్ కల్యాణ్ తన పేరిట రూ. 94 కోట్ల 41 లక్షల విలువైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. తన భార్య పేరిట మరో రూ. కోటి 95 లక్షల విలువైన భూములున్నట్టు పవన్ వెల్లడించారు.

తన నలుగురు పిల్లలు దేశాయ్ అకీరా నందన్ మేజర్ కాగా, మరో ముగ్గురు మైనర్ల పేరిట కూడా ఆస్తులున్నాయి. మైనర్లు అయిన కొణిదెల పోలిన, మార్క్ శంకర్ల పేరిట ఒక్కొక్కరికీ రూ. 11 కోట్ల ఖరీదైన భూములున్నట్టు పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ అప్పులెన్ని?

తనకు రూ. 65 కోట్ల 76 లక్షల రూపాయలకు పైగా అప్పులున్నట్టు అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అప్పులు ఎవరెవరి దగ్గర తీసుకున్నారన్న వివరాలను వెల్లడిస్తూ పలువురు నిర్మాతలు, నిర్మాణ సంస్థల పేర్లు పేర్కొన్నారు. పవన్‌కు అప్పు ఇచ్చిన వారిలో మైత్రీ మువీ మేకర్స్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటుగా చిరంజీవి భార్య కొణిదెల సురేఖ కూడా ఉన్నారు.

నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో 1984లో పదో తరగతి పాస్ అయ్యానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తనకు 10 కార్లు, ఒక హార్లీ డేవిడ్‌సన్ బైక్ ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

2024-04-23T12:59:44Z dg43tfdfdgfd