PAWAN KALYAN: పిఠాపురంకు రామ్ చరణ్, సురేఖ కొణిదెల.. ‘అన్నయ్య’కి బదులుగా కొడుడు, వదిన

ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరబోతోన్నాయి. సోమవారం నాడు పోలింగ్ జరగబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీదే అందరి దృష్టి పడింది. ఈ సారి జన సేనాని, పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ గెలుపు కోసం పవన్ కళ్యాణ్‌తో పాటుగా మెగా ఫ్యామిలీ కూడా కష్టపడుతోంది. మెగా హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు రోడ్ల మీదకు వచ్చి ప్రచారాలు చేశారు.

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అయితే ఏకంగా చిరంజీవి ఓ వీడియో సందేశాన్ని వదిలాడు. అంతకు ముందు అయితే పిఠాపురంలో చిరంజీవి పర్యటిస్తాడని, పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేస్తాడని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అవేవీ లేకుండా సింపుల్‌గా ఓ వీడియోని రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నాడు చిరంజీవి. తన తమ్ముడిని గెలిపించండని పిఠాపురం ప్రజల్ని వేడుకున్నాడు. ఇక నేడు ఢిల్లీ నుంచి వచ్చి బేగంపేట్ ఎయిర్ పోర్టులో చిరంజీవి మాట్లాడిన మాటలతో చాలా విషయాలపై క్లారిటీ వచ్చింది.

ఎన్నికల ప్రచారానికి తాను రావాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోలేదని, తమ కంఫర్ట్‌నే పవన్ కళ్యాణ్ కోరుకుంటాడని మెగాస్టార్ అన్నాడు. ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని, మరోవైపు తన తమ్ముడికి అండగా ఉన్నానని చెప్పేందుకే వీడియోని రిలీజ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి పిఠాపురానికి వెళ్లకపోయినా కూడా రామ్ చరణ్, సురేఖ కొణిదెల మాత్రం వెళ్తున్నారు.

శనివారం నాడు రామ్ చరణ్, సురేఖ కొణిదెల ఇద్దరూ కూడా పిఠాపురంకు వెళ్లనున్నారు. అక్కడి కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జన సేనాని, పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఈ పూజలు చేస్తున్నారా? అన్నది రేపు తెలుస్తుంది. అక్కడి మీడియాతో రామ్ చరణ్ ఏమైనా మాట్లాడుతాడా? సురేఖ ఏమైనా స్పందిస్తారా? అన్నది చూడాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-10T15:22:32Z dg43tfdfdgfd