ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు 500 మందికిపైనే.. తల్లి భవానీకి నోటీసులు!

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైగింక వేధింపుల కేసులో సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ దిశగా కీలక అడుగులు వేసిన సిట్.. దేశం విడిచివెళ్లిపోయిన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం రెండోసారి లుక్‌ఔట్ నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలో ఆయన తండ్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను శనివారం సాయంత్రం అరెస్టు చేసింది. బాధిత మహిళ కిడ్నాప్‌ కేసులో రేవణ్ణను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆయన పెట్టుకున్న మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు తిరస్కరించింది. మహిళలపై అత్యాచారం కేసులో బాధితులు ఐదారు వందల మంది వరకు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు, హెచ్‌డీ రేవణ్ణ సతీమణి భవాని రేవణ్ణకు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇంట్లో భవాని లేని సమయంలో మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు నమోదైన కేసులో ఆమె ఈ నోటీసులు ఇచ్చారు. అటు, లైంగిక దౌర్జన్యాలకు గురైన బాధిత మహిళలను పోలీసులు.. హాసనలోని రేవణ్ణ నివాసానికి తీసుకొచ్చి విచారించారు.

ప్రజ్వల్‌ రేవణ్ణ కేసులో విచారణ వేగవంతం చేయాలని సిట్‌ అధికారులను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. అవసరమైతే బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేసి తక్షణమే అతడ్ని అరెస్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కేసుపై సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ‘బాధితుల ప్రాణాలకు ఎటువంటి హాని రాకుండా చూడాలని పేర్కొన్నారు.

కాగా, సీబీఐ త్వరలోనే బ్లూ కార్నర్‌ నోటీస్‌ జారీ చేయనుందని, తద్వారా ప్రజ్వల్‌ కదలికలను గుర్తించేందుకు సాధ్యమవుతుందని సిట్ అధికారులు పేర్కొన్నారు. విమానాశ్రయాల నుంచి సమాచారం రాగానే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ప్రధాని నిందితుడు ప్రజ్వల్‌.. జర్మనీ నుంచి దుబాయ్‌కి అక్కడి నుంచి హంగేరీలోని బుడాపె్‌స్టకి వెళ్లినట్టు సిట్‌ గుర్తించింది. రేవణ్ణ, ప్రజ్వల్‌ల నివాసాలలో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించి, పలు ఆధారాలను సేకరించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T02:47:08Z dg43tfdfdgfd