ప్రాచీ నిగమ్: స్టేట్ ‌టాపర్‌ అమ్మాయికి మీసాలు ఉన్నాయంటూ ఆన్ లైన్‌లో ట్రోలింగ్, బాధితురాలు ఏమన్నారు?

ఉత్తరప్రదేశ్ బోర్డు పరీక్షల ఫలితాలు వచ్చి ఐదవ రోజు. ఉదయం 7.30కు స్కూల్ ప్రాంగణమంతా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకున్న విద్యార్థులతో కిటకిటలాడుతుంది.

ఉదయం జరిగే అసెంబ్లీ సెషన్ కోసం పిల్లలంతా నిల్చుని ఉన్నారు. 55 లక్షల మంది విద్యార్థులలో ఉత్తరప్రదేశ్ బోర్డు నిర్వహించిన హైస్కూల్ పరీక్షలో ప్రాచీ నిగమ్ అగ్రస్థానంలో నిలిచారు.

కొంత సమయం తర్వాత, తెల్లటి సల్వార్ కుర్తా, ఎర్రటి దుపట్టా వేసుకున్న ప్రాచీ నిగమ్ రావడం చూశాం. ప్రాచీ కోసం మేం ఎంతో సేపటి నుంచి అక్కడ వేచిచూస్తున్నాం.

స్కూల్‌లోకి ప్రాచీ రాగానే, స్నేహితులు ఆమెను చూసి సంతోషంగా దగ్గరకు వెళ్లారు. ఆ రోజు ప్రాచీ నిగమ్ ఇంటర్వ్యూ ఇవ్వబోతుందని ప్రతి ఒక్కరికీ తెలుసు.

గత వారం రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని సితాపూర్ జిల్లా మహముదాబాద్ ప్రాంతంలోని సీతా ఇంటర్ కాలేజీలో పండగ వాతావరణం నెలకొంది.

ఇందుకు కారణం ప్రాచీ నిగమ్, శుభం వర్మతో సహా 19 మంది విద్యార్థులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బోర్డు నిర్వహించిన హైస్కూల్, ఇంటర్‌మీడియట్ పరీక్షల్లో ర్యాంకులు సాధించారు.

టాపర్లను చూసి చాలామంది ఎంతో గర్వంగా ఫీలయ్యారు. కానీ, ప్రాచీ నిగమ్ మాత్రం కొందరు వ్యక్తుల నుంచి ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

కారణం, శరీరంలోని జన్నుపరమైన సమస్యలు. ఆమె పై పెదాలపై వెంట్రుకలు కనిపించడమే.

‘‘ఒకవేళ టాప్ రాకపోయుంటే, పట్టించుకునే వారే కాదు’’

‘‘ఈ ట్రోలింగ్‌ను, జనాలను చూసిన తర్వాత, ఒకటి లేదా రెండు మార్కులు తక్కువ వచ్చుంటే బాగుండేదనిపిస్తుంది. టాప్ రాకపోయుంటే, జనాలు నేనెలా ఉన్నానని పట్టించుకునే వారే కాదు. తొలిసారి హైస్కూల్‌లో నా ముఖంపై వెంట్రుకలు పెద్దగా పెరిగాయని అనిపిస్తుంది. హైస్కూల్ బోర్డు పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత, ప్రజలు చేసిన ట్రోల్‌లు నాకు ఈ విషయాన్ని తెలియజేశాయి’’ అని ప్రాచీ అన్నారు.

ప్రాచీ ముఖంపై వెంట్రుకలు, 9వ తరగతిలో ఉన్నప్పటి కంటే ఎక్కువగా పెరిగాయి. ప్రాచీ ఎలా కనిపిస్తుందనే విషయంపై ఇప్పటి వరకు స్కూల్‌లో కానీ, ఇంట్లో కానీ ఎప్పుడూ ఎవరూ కామెంట్ చేయలేదు. ప్రాచీ తన ముఖంపై వెంట్రుకలు పెరుగుతున్నాయని గుర్తించలేదు కూడా.

ప్రాచీకి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. అతను ఇంజనీర్‌ కావాలనుకుంటున్నాడు. ఈ సారి హైస్కూల్‌ బోర్డు పరీక్షల్లో ప్రాచీ నిగమ్‌కు 591 మార్కులు వచ్చాయి.

‘‘నేను ఒకవేళ అగ్రస్థానంలో నిలవకపోయుంటే, ఇంత ఫేమస్ అయ్యేదాన్నే కాదు. సోషల్ మీడియా నన్ను చాలా ఫేమస్ చేసింది. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఇంట్లో రోజంతా జనమే ఉంటున్నారు’’ అని ప్రాచీ నవ్వుకుంటూ చెప్పారు.

కానీ, పదేపదే ఫోన్ కాల్స్ రావడం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రాచీకి ఇబ్బందిగా మారింది.

‘‘ప్రతి ఇంటర్వ్యూలో ట్రోలింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. గత వారం రోజులుగా, నేనెలా ఉన్నాను అని అడుగుతూ నోటీసు చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు, నేను చికిత్స తీసుకుంటాను. ప్రస్తుతమైతే నా దృష్టంతా చదువులపైనే’’ అని ప్రాచీ చెప్పారు.

సోషల్ మీడియా చూడటం మానేసిన ప్రాచీ

ఫలితాలు వచ్చిన తొలి రెండు రోజుల తర్వాత నుంచి సోషల్ మీడియా చూడటం మానేశారు ప్రాచీ. ఆ ట్రోల్స్ తన చదువులపై ప్రభావం చూడకూడదని ప్రాచీ భావించారు.

అయితే, ఇంత చిన్న వయసులో తనను అంత ఎక్కువ ఫేమస్ చేసినందుకు సోషల్ మీడియా ట్రోలర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తన ముఖంపై వెంట్రుకలు పెద్దగా లేకుండా ఉండే, తాను ట్రోలింగ్‌కు గురయ్యేదాన్ని కాదని చెప్పారు. ఒకవేళ ట్రోలింగ్‌కి గురికాకపోతే, ఇంతమంది జనాలు ఇంటికి వచ్చేవారు కాదన్నారు.

ప్రస్తుతం ప్రాచీ తన ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఐఐటీ జేఈఈ పరీక్ష రాసి ఇంజనీర్ అవ్వాలన్నది ఆమె కల.

‘‘ఏ ట్రోలర్‌కు కూడా కనీసం రెండు నిమిషాలు ప్రాచీతో మాట్లాడే ధైర్యం ఉండదని కచ్చితంగా చెప్పగలను’’ అని సీతా ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ రమేశ్ వాజ్‌పేయి అన్నారు.

‘‘మేం ఆమెకు చాలా ధైర్యాన్ని ఇచ్చాం. ఇవన్నీ ఆమె అంతర్గత రూపాన్ని దెబ్బతీయలేవు. ఎవరైతే అందమే అంతా అని భావిస్తారో వారిది తప్పుడు ఆలోచన. ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఆమెకు ఉచిత చికిత్స అందిస్తామని అన్నారు.’’ అని రమేశ్ వాజ్‌పేయి తెలిపారు.

‘‘నా కూతురు ఎలా ఉంటే అలానే మాకిష్టం’

తన రూపురేఖలపై ఎన్నడూ కాలేజీలో స్నేహితుల నుంచిగానీ, టీచర్ల నుంచిగానీ ఎలాంటి కామెంట్లు రాలేదని ప్రాచీ చెప్పారు.

10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత డాక్టర్‌ను కలుద్దామని కొన్ని నెలల కిందటే తల్లి ఆమెతో అన్నారు.

‘‘నా కూతురు పై పెదవులపై వెంట్రుకలు పెరుగుతున్నాయన్న విషయంపై మేం ఎక్కువగా దృష్టి పెట్టలేదు. మాకు మా కూతురు ఇలానే ఇష్టం. ఆమెను పార్లర్‌కు తీసుకెళ్లాలని ఎన్నడూ ఆలోచించలేదు. పై పెదవులపై వెంట్రుకులు ఎక్కువగా పెరుగుతుండటంతో, పరీక్షలు అయిపోయాక, డాక్టర్‌ను కలుద్దామని అనుకున్నాం. కానీ, అంతకుముందే, ప్రజలు ఈ గందరగోళ పరిస్థితులను క్రియేట్ చేశారు’’ ప్రాచీ తల్లి మమతా నిగమ్ చెప్పారు.

‘‘నా కూతురు సామర్థ్యాలను కాకుండా ఆమె శరీరాకృతిపై ఎక్కువగా ప్రజలు దృష్టిపెట్టడంపై బాధగా అనిపిస్తుంది. మా కూతురు ట్రోలింగ్‌కు గురైన వెంటనే, ఈ విషయాలన్ని నిన్ను ప్రభావితం చేయకూడదు అని ఆమెను కూర్చోబెట్టి సున్నితంగా వివరించాం. ఎట్టిపరిస్థితుల్లో ఇవి నీపై ప్రభావం చూపకూడదు అని చెప్పాం. మా ఇంట్లో ఎవరూ కూడా ఫోన్ తీసి, సోషల్ మీడియా చూడటం లేదు. ఎందుకంటే, మాకంత సమయం లేదు’’ అని ఆమె అన్నారు.

ప్రాచీ తండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు.

‘‘నిజం చెప్పాలంటే, ట్రోలర్స్‌కు ఏమైనా చెప్పాలని కూడా నాకు అనిపించడం లేదు. చాలా మంది ప్రాచీకి సపోర్టు ఇచ్చేందుకు వచ్చారు. వాళ్లందరికీ నేను కృతజ్ఞతలు. నాకు కోపం లేదని చెప్పడం లేదు. చాలా బాధవేసింది. కోపం వచ్చింది. ఒక వ్యక్తి గురించి వ్యక్తిగతంగా తెలియనప్పుడు, ఎలా కామెంట్ చేయగలరు? అలాంటి వ్యక్తులపై ఏదైనా చర్యలు తీసుకోవాలి. మరొకరి భావోద్వేగాలతో ఆడుకోకూడదు’’ అని ప్రాచీ తండ్రి చంద్ర ప్రకాశ్ నిగమ్ చెప్పారు.

‘‘టాప్ వచ్చిన తర్వాత, కాస్త ఒత్తిడిగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రజలకు నాపై ఆశలు పెరిగాయి. అందుకే ఇప్పుడు నేను కాస్త కష్టించాల్సి ఉంటుంది. ట్రోల్స్ చదివేందుకు నాకు సమయం లేదు. ఎవరి శరీరాకృతి అయితే సాధారణ అమ్మాయిలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుందో అలాంటి అమ్మాయిలకు నేను ఒకటి చెప్పాలనుకున్నా. అసలు బాధపడవద్దు. ట్రోలింగ్స్‌ను పట్టించుకోవద్దు. చదువుపై దృష్టిపెట్టండి. అప్పుడే ముందుకు వెళ్లగలం’’ అని ప్రాచీ సూచించారు.

ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా ప్రాచీ క్లాస్‌మేట్స్ క్యాంపెయిన్

ప్రాచీ క్లాస్‌మేట్స్ ఆమెకు మద్దతుగా సోషల్ మీడియా #DontTrollPrachi అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.

ప్రాచీ క్లాస్‌మేట్ హేమంత్ వర్మ ఉత్తరప్రదేశ్ బోర్డు నిర్వహించిన హైస్కూల్ పరీక్షల్లో తొమ్మిదవ స్థానంలో నిలిచారు.

‘‘నేను ఇన్‌స్టాగ్రామ్ వాడతాను. ప్రాచీ కోసం చాలా పోస్టులకు రిప్లయి ఇచ్చాను. చాలామంది నన్ను నానారకాలుగా అన్నారు. అసభ్యకర పదాలు వాడారు. కానీ, మేం ప్రాచీకి మద్ధతుగా ఆ పోస్టులకు సమాధానం చెబుతూనే ఉన్నాం. ప్రాచీని ట్రోల్ చేయొద్దని ప్రతి ఒక్కరికీ చెబుతున్నాం. ఆమె ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’ అని హేమంత్ వర్మ అన్నారు.

‘‘సోషల్ మీడియాలో ప్రాచీని ట్రోల్ చేయడం ప్రారంభించిన తర్వాత, మేమందరం కలిసి క్యాంపెయిన్ ప్రారంభించాం. ఏమీ తెలియకుండానే ఇంట్లోనే కూర్చుని ఒకరిపై ట్రోల్ చేయడం తేలికనే. ప్రాచీ నిగమ్ రికార్డును ట్రోలర్లు సాధించలేరు’’ అని ప్రాచీ మరో క్లాస్‌మేట్ జ్ఞానేంద్ర వర్మ చెప్పారు.

‘‘ప్రస్తుతం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ ట్రోల్స్‌ను చూసుంటారు. శరీరంలోని జీవపరమైన సమస్యలతో శరీరాకృతి మారుతున్న అమ్మాయిల తల్లిదండ్రులు ఈ ట్రోల్స్‌ను చూసిన తర్వాత వారి కూతుర్లకు ఎలా చదువు చెప్పించగలరు? ఒకవేళ పేరు వస్తే, తన కూతురు ఎక్కడ ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడతారు’’ అని జ్ఞానేంద్ర వర్మ అన్నారు.

కౌన్సిలర్లు ఏం చెబుతున్నారు?

18 ఏళ్లుగా లక్నోలో కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్న సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ నేహా ఆనంద్ దీని గురించి మాట్లాడారు.

‘‘ప్రాచీ, ఆమె తల్లిదండ్రులు చెప్పిన విషయాలను నేను వీడియోలో చూశాను. టీచర్లు, తల్లిదండ్రులు ఆమెను అర్థం చేసుకోగలరు. ఆమె ఇలాంటి వాటిని పట్టించుకోదు కాబట్టే చదువుల్లో టాప్ ర్యాంక్ దాకా వచ్చారు.’’ అని చెప్పారు.

‘‘ఇటీవల కాలంలో, బాడీ షేమింగ్ అనేది పిల్లల్లో బాగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల చాలా మంది పిల్లలు డిప్రెషన్‌లో కూరుకుపోతున్నారు. వారు ఆత్మన్యూనత భావనల్లోకి వెళ్తున్నారు. వారికి వారు హాని చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, టీచర్ల, తల్లిదండ్రుల బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి’’ అని చెప్పారు.

‘‘ఇలాంటి వాతావరణం పిల్లల్లో పెరుగుతున్నప్పుడు, వారి సామర్థ్యాలు, బలాలపై మరింత దృష్టిపెట్టేలా వారిని ప్రోత్సహించాలి. బాహ్య అందాన్ని పట్టించుకోకుండా చూడాలి’’ అని నేహా చెప్పారు.

ముఖ్యమైన సమాచారం...

మెడిసిన్, థెరపీతో మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. దీని కోసం సైకియాట్రిస్ట్ సాయం తీసుకోవాలి. అంతేకాక, కింద పేర్కొన్న హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.

సామాజిక న్యాయం, సాధికారత శాఖ హెల్ప్‌లైన్ - 1800-599-0019(13 భాషలలో అందుబాటు)

హ్యూమన్ బిహేవియర్, అలైడ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ - 9868396824, 9868396841, 011-22574820

హిట్‌గజ్‌హెల్ప్‌లైన్ – ముంబై - 022- 24131212

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరోసైన్స్ - 080 - 26995000

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-27T12:34:41Z dg43tfdfdgfd