బ్యాడ్ ఇంటర్వ్యూ: ‘నన్ను ఆవులా అరవమన్నారు, మోకాళ్ల మీద పాకమన్నారు' అంటూ అనుభవాలు పంచుకున్న కొందరు అభ్యర్థులు

యూకేలోని బ్రిస్టల్‌లో ఉండే ‘లే‘( మహిళ పేరు) ఒక ప్రాసిక్యూటర్ ఆఫీసులో ఇంటర్వ్యూ‌కు హాజరయ్యారు.

ఆమె అక్కడికి వెళ్లిన 20 నిమిషాల తర్వాత ‘ ఇవాళ ఇంటర్వ్యూ రద్దు చేశాం, రేపు రండి’ అని సిబ్బంది చెప్పారు. చేసేదేమీ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే, ఇంటర్వ్యూ రద్దు అనేది అభ్యర్థిని టెస్ట్ చేయడంలో ఒక భాగమని, అందులో మీరు ఫెయిలయ్యారంటూ ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. చివరకు ఆమెకు ఉద్యోగం రాలేదు.

ఈ వ్యవహారమంతా తనకు వింతగా, విచిత్రంగా అనిపించిందని ‘లే’ అన్నారు. తర్వాత ఆమె సొంతం బిజినెస్ ప్రారంభించారు. తన ఆఫీసులో మాత్రం ఇలాంటి చిత్రమైన ఇంటర్వ్యూలకు స్థానం లేకుండా, సరైన హెచ్‌ఆర్ నిబంధనలు పాటిస్తున్నట్లు ఆమె చెప్పారు.

ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నది లే ఒక్కరే కాదు. ఇంటర్వ్యూ ప్రక్రియలో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయని ‘హేస్’ అనే ఒక రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ చెప్పింది.

ఇలాంటి అభ్యంతరకరమైన, చిరాకు పుట్టించే ఇంటర్వ్యూలను ఎదుర్కొన్న డజన్ల కొద్దీ వ్యక్తుల కథలను బీబీసీ విన్నది.

ఇంతకీ బ్యాడ్ ఇంటర్వ్యూలు మనకు ఏం నేర్పుతాయి? వివాదాస్పదం కాకుండా ఇంటర్వ్యూ చేసేవారు ఏం చేయాలి?

ఐక్సిన్ ఫు అనే మహిళ ఒక వర్సిటీలో స్టూడెంట్ అంబాసిడర్ జాబ్ కోసం అప్లై చేసినప్పుడు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైనట్లు చెప్పారు

గ్రూప్ ఇంటర్వ్యూలో ‘‘అభ్యర్ధులంతా మోకాళ్ల మీద పాకండి, ఆవులాగా అరవండి’’ అని కోరారని ఆమె చెప్పారు.

‘‘మేం మూడు, నాలుగు నిమిషాలపాటు అలా చేయాల్సి వచ్చింది.’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

"అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇది కరెక్టు కాదనిపించింది" అని ఫు అన్నారు.

అభ్యర్థులు జోవియల్ (ఉత్సాహంగా, సరదాగా)గా ఉన్నారో లేదో తెలుసుకుంటున్నామని అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి తనతో అన్నారని ఐక్షిన్ ఫు చెప్పారు.

'మీరు ఇంకా ఎన్నాళ్లు బతుకుతానుకుంటున్నారు'

అమెరికాలోని మిస్సౌరీకి చెందిన జూలీ 2022లో పార్ట్‌టైమ్ కాపీ రైటర్‌ జాబ్ కోసం అప్లై చేసి, వీడియో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారు.

అంతా సాఫీగానే జరుగుతోందని ఆమె భావించారు. మధ్యలో అకస్మాత్తుగా 'మీరు ఇంకా ఎన్నాళ్లు బతుకుతానుకుంటున్నారు' అని ఇంటర్వ్యూయర్ అడిగారు.

"నేను 60లలో ఉన్నాను. మరికొంతకాలం వరకు పదవీ విరమణ చేయబోను" అని జూలీ బదులిచ్చారు.

నా నేపథ్యం గురించి..

ఇంటర్వ్యూల సమయంలో వయసే కాదు, చాలా విషయాల్లోనూ వివక్ష కనిపిస్తుంటుంది.

మిలన్‌లోని ఫ్యాషన్ బ్రాండ్‌లో 'ఆన్‌లైన్ పీఆర్' జాబ్ కోసం జరిగిన రెండో ఇంటర్వ్యూలో తాను పుట్టిన ప్రాంతం, నేపథ్యం గురించి ప్రశ్నలడిగారని కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ అయిన పెరల్ కసిర్యే చెప్పారు.

కసిర్యే లండన్‌లో ఉంటున్నారు. చిన్నతనంలో యూరప్‌లో నివసించడానికి, చదువుకోవడానికి ఉగాండాను వదిలి వచ్చేశారు.

తన నేపథ్యం కారణంగా రిమోట్ జాబ్‌కు లండన్ వేతనం కాకుండా ఉగాండా వేతనం చెల్లిస్తానని కంపెనీ యజమాని పట్టుబట్టినట్లు కసిర్యే చెప్పారు.

దీంతో, ఆమె తన అప్లికేషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

‘‘ఎక్కడి నుంచి వస్తారు వీళ్లంతా. వాళ్ల మీద వాళ్లకు కంట్రోల్ ఉండదా’’ అన్నారామె.

తాను ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తున్నపుడు, అడుగుతున్న ప్రశ్నలపై చాలా శ్రద్ధగా ఉంటానని కసిర్యే అంటున్నారు.

కొన్నిసార్లు ఈ వివక్ష, పక్షపాతాలు అనుకోకుండా కూడా ఎదురవ్వొచ్చని, ఒక్కోసారి మనకు తెలియకుండానే వివిక్ష చూపించే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. అయినా, ఇవి ఇంటర్వ్యూ ఎదుర్కొనే వ్యక్తికి ఇబ్బందేనని ఆమె చెప్పారు.

టామ్ (అతని అసలు పేరు కాదు) ఒక ఐటీ ఇంజనీర్. ఆయన ఒకసారి వేర్‌హౌస్ అసిస్టెంట్ కోసం అప్లై చేయగా, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి లేకుండానే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరినట్లు ఆయన చెప్పారు.

తాను అలా చేయలేకపోయానని టామ్ అన్నారు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ‌నే తాను ఇష్టపడతానని ఆయన చెప్పారు.

‘పిల్లలున్నారా’

నియామకం సమయంలో లింగం ఆధారంగా కూడా వివక్షకు గురయ్యారని చాలామంది బీబీసీకి చెప్పారు.

హైరింగ్ ప్లాట్‌ఫారమ్ ‘అప్లైడ్’ నుంచి వచ్చిన డేటా ప్రకారం, నియామక ప్రక్రియలో దాదాపు ఐదుగురు మహిళల్లో ఒకరిని పిల్లలున్నారా? అనే ప్రశ్న అడిగినట్లు తేలింది.

ఇలాంటి ప్రశ్నలు ఎదర్కొన్నవారిలో ‘అప్లైడ్’ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఖ్యాతి సుందరం కూడా ఒకరు. ''నన్ను లెక్కలేనన్నిసార్లు అడిగారు'' అన్నారామె.

అభ్యర్థులను వారి వైవాహిక స్థితి, పిల్లల గురించి ఇంటర్వ్యూలో అడగడం చట్టవిరుద్ధం.

అయినప్పటికీ, సీనియర్ పొజిషన్స్ కోసం అప్లై చేసుకునే మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉందని ‘అప్లైడ్’ సంస్థ గుర్తించింది. ఇక్కడ ఐదుగురిలో ఇద్దరు మహిళలను ఇదే ప్రశ్న అడిగారని తెలిపింది.

‘దీనికి కారణం గర్భం వల్ల కంపెనీ మీద పడే ఆర్ధిక భారం’ అని ఖ్యాతి సుందరం చెప్పారు.

ఎక్కువ వేతనం ఉన్న వారికి ప్రసూతికి సంబంధించిన సెలవులు, డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని, అందుకే వారు దీని గురించి ఆలోచిస్తారని ఖ్యాతి సుందరం అభిప్రాయపడ్డారు.

ఎటువంటి కొలమానం లేదు

బ్యాడ్ ఇంటర్వ్యూ అనిపించుకునే ఇంటర్వ్యూలకు పక్షపాతం ఒక్కటే కారణం కాకపోవచ్చని ఖ్యాతి సుందరం అంటారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ‘ఒక మంచి అభ్యర్ధిని ఎంపిక చేయడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు’

ఇంటర్వ్యూ చేసేవారికి ఖ్యాతి సుందరం సలహా ఏమిటంటే, అభ్యర్థులందరినీ ఒకే రకమైన ప్రశ్నలను అడగడం.

ఐక్సిన్ ఫు తనకు ఎదురైన అనుభవాల నుంచి పాఠం నేర్చుకొన్నానని చెప్పారు. ‘ఆవులా అరవండి’ లాంటి అర్ధంపర్ధం లేని, ఉద్యోగానికి సంబంధంలేని ప్రశ్నలకు దూరంగా ఉండటం నేర్చుకున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-04T10:16:40Z dg43tfdfdgfd