మీరు ఫేమస్ కావాలని అనుకుంటున్నారా.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు !

సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారివరకు సంగీతం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. మనసుకు ప్రశాంతతను కలిగించి ఊహల లోకంలో విహరింపజేసే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సంగీతం లేనిదే మానవ మనుగడ లేదని కూడా చెప్పుకోవచ్చు. మనిషి ఒత్తిడిని జయించడానికి సంగీతం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సాంప్రదాయ సంగీత కళలను నేటి తరానికి మరింత చేరువ చేయడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. మనిషికైనా మరణం ఉంటుందేమో కానీ మరణం లేనిది ఏదైనా ఉందంటే అది సంగీతం మాత్రమే.

అలాంటి సాంప్రదాయ కళలు, సంగీతాన్ని నేర్చుకోవాలని ఎంతోమందికి ఆసక్తి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్ లో చాలా మందికి సంగీతం, భరతనాట్యము ఇలా సాంప్రదాయ కళలు నేర్చుకోవాలని ఉంటుంది .అలాంటి వారి కోసం కర్నూలు పట్టణంలోని శారద సంగీత నృత్య కళాశాల శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రభుత్వ శారదా సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వయోలిన్, మృదంగం,నాదశ్వరం, కూచిపూడి వంటి వాటిలో చేరేందుకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ముని ప్రసాద్ తెలిపారు.

2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 సంవత్సరాలు సర్టిఫికెట్ కోర్సు, రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన అడ్మిషన్స్ నేటి నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అప్లికేషన్ రుసుము రూ.50లు కాగా.. కోర్స్ కాలవ్యవధిని బట్టి రూ.1600లు ఫీజు చెలించాల్సి ఉంటుందని వారు తెలిపారు. గాత్రం, వయోలిన్, మృదంగం,నాదస్వరం, కూచిపూడి వంటి వాటిలో సర్టిఫికెట్ కోర్సు చేయాలనుకునే వారికి నాలుగు సంవత్సరాల పాటు క్లాసులు ఇక్కడ నిర్వహిస్తారు.

అదే విధంగా డిప్లొమా వారికి 2 సంవత్సరాల కాల వ్యవధి కోర్సు ఉంటుందని, ఆసక్తి గలవారు కర్నూల్ లోని ప్రభుత్వ శారదా సంగీత, నృత్య కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

2024-07-03T05:30:35Z dg43tfdfdgfd