మెమొరీ లాస్: వయసుతోపాటు పెరిగే మతిమరుపును అదుపు చేసే నాలుగు సూత్రాలివే...

‘‘జ్ఞాపకశక్తి(మెమరీ) అనేది ఒక డైరీ లాంటిది. జీవితకాలం అది మనతోనే ఉంటుంది’’

ఐరిష్ రచయిత ఆస్కార్ వైల్డ్ (1854-1900) ఈ విధంగా జ్ఞాపకశక్తిని నిర్వచించారు.

అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ మన జీవితంలో అనుభవించిన కొన్ని విషయాలను మరచిపోతుంటాం. అది మనల్ని కలవరపరచడమే కాకుండా, బాధాకరంగా కూడా అనిపిస్తుంది.

అయితే, జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదాన్ని కాస్త తగ్గించుకోవచ్చని మెమరీపై అధ్యయనం చేస్తున్న ప్రముఖ న్యూరోసైంటిస్టులలో ఒకరు, కాలిఫోర్నియా యూనివర్సిటీలో డైనమిక్ మెమరీ ల్యాబోరేటరీ డైరెక్టర్, ప్రొఫెసర్ చరణ్ రంగనాథ్ అన్నారు.

‘‘వై వీ రిమెంబర్: ది న్యూ సైన్స్ ఆఫ్ మెమరీ’’ అనే పుస్తకాన్ని రాసిన ఈయన బీబీసీతో మాట్లాడారు.

మన జీవితంలో ఎదురైన పలు విషయాలను గుర్తుంచుకునేందుకు మన మెదడుపై ప్రభావం చూపుతున్న నాలుగు అలవాట్లను ఆయన గుర్తించారు.

వీటిని ఆయన తన పుస్తకంలో వివరించారు. అంతేకాక, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా చెప్పారు.

1. సరైన నిద్ర లేకపోవడం

వయసు పెరుగుతున్న కొద్ది నిద్రపోయే గంటలు తగ్గిపోతుంటాయి.

పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు వంటివి నిద్రపై ప్రభావం చూపుతుంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హాని కలిగించే ఇబ్బందులు.

మెదడు పనితీరుపై 25 ఏళ్ల పాటు ఈ న్యూరోసైంటిస్ట్ పనిచేశారు.

‘‘తగినంత నిద్రపోకపోతే, మెదడు పనితీరు తగ్గుతుంది. ఏకాగ్రత కుదరదు. చిరాకుగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు’ అని రంగనాథ్ తెలిపారు.

రాత్రిపూట మెదడు కేవలం హానికరమైన కారకాలను బయటికి పంపడమే కాకుండా, తనలోని బ్యాటరీలను రీచార్జ్ చేసుకుంటుంది. ఇది సంఘటనలను మరచిపోకుండా చేస్తుంది.

మంచి నిద్ర కావాలంటే పడుకోవడానికి ముందు ఫోన్లను, కంప్యూటర్లను వాడొద్దని, ఎక్కువగా తినొద్దని, ఆల్కాహాల్, కెఫీన్ లాంటివి తాగొద్దని రంగనాథ్ సూచిస్తున్నారు.

ఏదైనా కారణంతో రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టనివారు, నిద్రపోని వారు పగటిపూట కొద్దిసేపు నిద్రపోవడం మంచిదన్నారు.

పగటిపూట నిద్రలో కూడా జ్ఞాపకశక్తి ప్రయోజనాలను పొందవచ్చని చెప్పారు.

2. మల్టీ టాస్కింగ్

నేటి పోటీకర, బిజీ ప్రపంచంలో ఒకేసారి వివిధ పనులు చేయడమన్నది సానుకూల అంశంగా చూస్తున్నారు. కానీ, ఇది మన జ్ఞాపకశక్తికి చేటు చేస్తుందని రంగనాథ్ హెచ్చరించారు.

కారణం ఏంటంటే.. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది మన చేస్తున్న పనులు పూర్తి చేసేలా సాయం చేస్తుంటుంది.

కానీ, ఒక పని నుంచి ఇంకో పనికి వెంటవెంటనే మారుతుంటే, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లో సామర్థ్యం తగ్గిపోతుంది. వివిధ పనులలో పాల్గొనేటప్పుడు పలు న్యూరాన్ల మధ్య పోటీ మన మెదడులో నెలకొంటుంది.

ఈ పోటీ వల్ల ఒకే సమయంలో వివిధ రకాల పనులను సమర్థవంతంగా, కరెక్ట్‌గా చేయడం కష్టమవుతుందని వివరించారు.

క్లాస్ వింటూ ఈమెయిల్ చెక్ చేయడం వల్ల, ఇది కేవలం ఒక్క విషయాన్ని మాత్రమే గుర్తుంచుకునేలా చేస్తుంది. తొలుత వింటున్న దాన్ని మీరు గుర్తుపెట్టుకోలేరు.

‘‘మీ లక్ష్యాలు మారుతున్నప్పుడు న్యూరాన్లు కూడా పక్కదోవపడుతుంటాయి. దీంతో కాన్ఫరెన్స్‌లో జరిగే విషయాలను సరిగ్గా గుర్తుంచుకోలేరు. ఒక పని నుంచి మరో పనికి మారేందుకు మెదడులోని చాలా ఫంక్షన్లను వాడుతూ ఉంటారు. దీంతో జ్ఞాపకం ఉంచుకోవడం కష్టమవుతుంది’’ అని ఆయన చెప్పారు.

వివిధ పనులు ఒకేసారి చేయడాన్ని తగ్గించుకునేందుకు, ఒకదాన్ని పూర్తి చేయకుండా మరో పనిని ప్రయత్నించకూడదు. అంతేకాక, లక్ష్యం నుంచి పక్కదోవ పట్టకుండా చూసుకోవాలని రంగనాథ్ సూచించారు.

కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు ఈమెయిల్, మెసేజ్ నోటిఫికేషన్లు రాకుండా ఫోన్లు సైలెంట్‌లో పెట్టుకోవాలన్నారు.

స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా చూడటం కూడా మరో ప్రశ్నగా నిలుస్తుంది. ఇది నేటి యువతలో ఎలాంటి ప్రభావం చూపుతుందనే? ప్రశ్నలు వస్తున్నాయి.

‘‘కచ్చితంగా దీనివల్ల కొన్ని సానుకూల, ప్రతికూల పర్యవసనాలు ఉన్నాయి. కానీ, ముఖ్యమైన అంశం ఏంటంటే.. మెమరీకి మంచివి కానీ అలవాట్లను ఫోన్ల ద్వారా పిల్లలు అభివృద్ధి చేసుకుంటున్నారు’’ అని ఆయన అన్నారు.

3. ఒకే రకమైన పనులు చేయడం

మనం ఊహించిన దానికి భిన్నంగా, అన్ని విషయాలను గుర్తుంచుకునేలా మన మెదడు ప్రోగ్రామ్ చేయలేదు.

ఇది ఎంపిక చేసుకున్న అంశాలనే గుర్తుంచుకునేలా రూపొందుతుంది.

‘‘మనం అనుభవించిన చాలా అంశాలను లేదా సేకరించిన సమాచారాన్ని కొన్ని రోజుల తర్వాత మర్చిపోతుండవచ్చు’’ అని రంగనాథ్ వివరించారు.

మన మెదడులో అడ్రినలీన్, సెరోటోనిన్, డోపమైన్ లేదా కార్టిసాల్ వంటి రసాయనాలను విడుదల చేసే భయం, కోపం, ఆశ, సంతోషం, ఆశ్చర్యం లేదా ఇతర భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సంఘటనలు లేదా అనుభవాలు మాత్రమే గుర్తుండిపోతాయి.

ఈ రసాయనాలు మన జ్ఞాపకశక్తికి అవసరమయ్యే మెదడు ప్లాస్టిసిటీకి సాయం చేస్తాయి.

‘‘మెదడులోని ప్లాస్టిసిటీ అనేది పనులు నిర్వర్తించేందుకు సాయం చేస్తుంది’’ అని ఈ కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వివరించారు.

వయసు పెరుగుతున్న కొద్దీ దీని సామర్థ్యం తగ్గుతుందని అన్నారు.

బ్యాంకు అకౌంట్‌, సెల్ ఫోన్‌ లేదా ఈమెయిల్ యాక్సెస్‌కు మార్చిన పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకునే పనులు వయసు పెరుగుతున్నా కొద్ది కష్టంగా మారతాయి.

ఒకసారి మీరు పాస్‌వర్డ్ మార్చిన తర్వాత, కొత్త దాన్ని గుర్తుంచుకునేలా పాత పాస్‌వర్డ్ మర్చిపోయేలా న్యూరాన్లు పనిచేస్తాయి.

ప్లాస్టిసిటీని కాపాడుకునేందుకు ఏకరూపతను లేదా రొటీన్ పనులను తగ్గించడం సరైన మార్గమని ఈ నిపుణులు చెప్పారు.

4. అతివిశ్వాసంగా ఉండటం

‘‘కొంతమంది తమకు మంచి జ్ఞాపకశక్తి ఉందని భావిస్తుంటారు. కానీ, అన్ని సమయాల్లో అలా జరగదు. ఒకానొక దశలో వ్యక్తులు ఈ విషయాన్ని గుర్తిస్తారు’’ అని రంగనాథ్ అన్నారు.

అన్ని విషయాలను గుర్తుంచుకునేలా మన మెదడు రూపొందలేదు.

సగటున రోజుకు 34 గిగాబైట్ల సమాచారాన్ని అమెరికన్ల మెదడులోకి వెళుతుందని ప్రొఫెసర్ రంగనాథ్ అంచనా వేశారు.

గతాన్ని గుర్తుంచుకోవడం జ్ఞాపకశక్తి ఉద్దేశ్యం కాదు. గత నుంచి ముఖ్యమైన సమాచారాన్ని తీసుకుని, ప్రస్తుతాన్ని అర్థం చేసుకుని, భవిష్యత్‌కు సిద్ధం కావడమే జ్ఞాపకశక్తి అని వివరించారు.

టీకాలు, టాబ్లెట్లు లేవు...

‘‘జ్ఞాపకశక్తిని సంరక్షించుకునేందుకు ప్రజల ముందు చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, వాటిని వారు అనుసరించరు. ఎందుకంటే, మాత్ర లేదా టీకా కోసం వారు చూస్తారు. జీవనశైలిని మార్చుకోకుండానే, తేలికగా దీన్ని పొందవచ్చని వారి అభిప్రాయం’’ అని రంగనాథ్ అన్నారు.

ఏమిటా మార్గాలు...

మంచి నిద్రపోవడం, ఒత్తిడిని ఎలా అధిగమించాలో నేర్చుకోవడం, మైండ్‌ఫుల్‌నెస్ విధానాలను అనుసరించడం.. ఇవన్నీ మీ మెదడు పక్కదోవపట్టినప్పుడు గుర్తించి మీకు సాయం చేస్తాయని అన్నారు.

దీర్ఘకాలంలో అనుసరించాల్సిన విధానాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.

‘‘ఆహారం ఎన్నో విషయాలకు సాయం చేస్తుంది. మొక్కల నుంచి వచ్చే ఆహారం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది’’ అని చెప్పారు.

‘‘శారీరక వ్యాయామం, ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చాలా మంచివి. ఎందుకంటే, ప్లాస్టిసిటీని పెంపొందించి, మీ మెదడు పనితీరును మెరుగుపరిచే పదార్థాలను ఇవి పెంచుతాయి’’ అని అన్నారు.

ఈ విధానాల ద్వారా వయసు పెరుగుతున్నప్పటికీ ప్రజలు తమ జ్ఞాపకశక్తిని కాపాడుకుంటున్నారని పలు అధ్యయనాలలో తేలిందని రంగనాథ్ చెప్పారు. డిమెన్షియా ముప్పును మూడోవంతు తగ్గించుకున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-09T13:15:01Z dg43tfdfdgfd