మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం... ఎలా ఉందో చూశారా?

మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రముఖుల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేయడం సాంప్రదాయంగా ఉంది. మేడం టుస్సాడ్స్ మ్యూజియం దుబాయ్ లో ఇటీవల అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ఘనత అందుకున్న అతికొద్ది మంది స్టార్స్ లో అల్లు అర్జున్ ఒకరిగా నిలిచారు. తాజాగా అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో లాంచ్ చేశారు. ఈ అరుదైన క్షణాలను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

హీరోగా అల్లు అర్జున్ మొదటి సినిమా 2003 మార్చి 28న విడుదలైంది. అదే రోజున మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం లాంచ్ చేశారు. ఇది చాలా ప్రత్యేకం అంటున్నారు అల్లు అర్జున్. ఈ 21 ఏళ్ల జర్నీలో తనకు అండగా ఉండి, ప్రేమ కురిపించిన ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. అభిమానులు గర్వపడే సినిమాలు చేస్తానని హామీ ఇచ్చాడు. 

అల వైకుంఠపురంలో చిత్రంలో అల్లు అర్జున్ రెడ్ కోట్ ధరించిన సూపర్ స్టైలిష్ లుక్ ఒకటి ఉంటుంది. అదే గెటప్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ దుబాయ్ మ్యూజియం లో ఏర్పాటు చేశారు. టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ కి మాత్రమే ఈ ఘనత దక్కింది. ప్రభాస్ మైనపు విగ్రహాలు లండన్, బ్యాంకాక్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలలో ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయిలో ఏర్పాటు చేశారు. 

మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. విడుదల తేదీ సమీపిస్తుండగా నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారని సమాచారం. ఆగస్టు 15న పుష్ప 2 వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 

2024-03-29T02:00:12Z dg43tfdfdgfd