‘మొబైల్ టార్చ్ వెలుతురులో సిజేరియన్ ఆపరేషన్ చేశారు, నా కోడలు, మనవడు చనిపోయారు’

ముంబయిలోని భందుప్ మున్సిపల్ ఆస్పత్రిలో కరెంట్ లేకపోవడంతో గర్భిణీకి మొబైల్ టార్చ్ వెలుతురులో సిజేరియన్ ఆపరేషన్ చేశారు.

ఈ ఆపరేషన్‌లో తల్లి, నవజాతు శిశువు ఇద్దరూ చనిపోయారు.

తమ ఇంట్లోకి చిన్నారి రాబోతుందని ఉత్సాహంగా ఉన్న అన్సారి కుటుంబానికి ఈ ఘటన తీరని బాధను మిగిలింది.

‘‘నాకు బాబు ముఖం చూపించినప్పుడు, పిల్లాడు మృతి చెంది ఉన్నాడు. కానీ, బాబు నోట్లో ఏదో చెత్త ఉందని, వాటిని శుభ్రపరుస్తామని చెప్పారు. బాబు బాగుంటాడు. భయపడకండి అని చెప్పారు. కానీ 5-10 నిమిషాల తర్వాత వచ్చి, బాబు చనిపోయాడని అన్నారు’’ అని కన్నీటితో చెప్పారు బాబు తండ్రి ఖుస్రుద్దీన్ అన్సారి.

ఇలాంటి సంఘటనలు గతంలోనూ ఈ ఆస్పత్రిలో జరిగాయి. అప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైంది.

‘‘బాబు పుట్టేటప్పుడు, కడుపులో నుంచి కిందకి జారుతాడు. కానీ, నా కోడలు కడుపులో బాబు ఇంకా పైవైపే ఉన్నాడని డాక్టర్లు చెప్పారు. అందుకే, పై నుంచి కిందకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆ సమయంలోనే కడుపులో బాబు చనిపోయాడు. సర్జరీ కోసం వారు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత బయటకు వచ్చి నా కొడుకు సంతకం చేయించుకున్నారు. ఏదో జరుగుతోందని అనిపించింది’’ అని నజ్బున్ నిసా అన్సారి తెలిపారు.

‘‘నా కోడలిని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లినప్పుడు, కరెంట్ పోయింది. మొబైల్ టార్చ్ వెలుతురులోనే వారు సిజేరియన్ చేశారు. నా కోడలు, మనవడు మరణించినప్పటికీ, వారు బాగున్నట్లు మాకు చెప్పారు’’ అని అన్నారు.

అసలేం జరిగింది?

ముంబయిలోని తూర్పు సబర్బన్ హనుమాన్ నగర్ ప్రాంతంలో 26 ఏళ్ల షాహిదున్ అన్సారి, తన భర్తతో కలిసి ఉండేవారు. డెలివరీ కోసం ఏప్రిల్ 29న ఉదయం 8 గంటలకు భందుప్‌లోని సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హాస్పిటల్‌లో ఆమె చేరారు.

డాక్టర్ ఆమెను పర్యవేక్షించిన తర్వాత, సాధారణ కాన్పు అవుతుందని చెప్పారు. కానీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కడుపులో బిడ్డ కదలికలను బట్టి కుటుంబ సభ్యులు మరోసారి డాక్టర్‌ను సంప్రదించారు. తొలి కాన్పు కదా కాస్త సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు.

మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లారు కుటుంబ సభ్యులు. తల్లి, బిడ్డ పరిస్థితి బాగుందని డాక్టర్ చెప్పారు.

షాహిదున్ నొప్పులు భరించలేకపోతుండటంతో, సిజేరియన్ చేయమని వారు డాక్టర్‌ను కోరారు. కానీ, సాధారణ కాన్పు అవుతుందని డాక్టర్ చెబుతూ వచ్చారు.

డాక్టర్ సూచన మేరకు సాయంత్రం పూట షాహిదున్‌కు టీ, బిస్కెట్లు ఇచ్చారు. సాయంత్రం వేళ కడుపులోని బిడ్డ హార్ట్ రేటు 110గా ఉంది. ఇప్పుడు ప్రసవం చేయాలని, వెంటనే ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు.

'అనుమతి లేకుండానే ఆపరేషన్ చేశారు...'

కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే షాహిదున్ ప్రైవేట్ భాగాన్ని బ్లేడ్‌తో డాక్టర్ కోశారని మృతి చెందిన గర్భిణీ బంధువు రెహమునీసా చెప్పారు.

ఆమె కడుపులో నుంచి బలవంతంగా బిడ్డను తీసేందుకు ప్రయత్నించారు. ఆమె శరీరమంతా రక్తం ధారలై పారింది.

బిడ్డ హార్ట్ రేటు 40కి వచ్చినట్లు డాక్టర్ చెప్పారు. డాక్టర్ బయటకు వచ్చి, డాక్యుమెంట్లపై ఖుస్రుద్దీన్ సంతకం పెట్టించుకుని వెళ్లారు.

ఆమె శరీరమంతా రక్తం కనిపించింది. ఏం చేయాలో తమకు అర్థం కాలేదని రెహమునీసా చెప్పారు. ఆమెను సిజేరియన్ రూమ్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు డాక్టర్ చెప్పారన్నారు.

అక్కడకు తీసుకెళ్లేందుకు కనీసం ఆస్పత్రిలో నర్సులు కూడా లేరు. ఆమె వేసుకున్న గౌను రక్తంతో తడిచిపోయింది.

‘‘ఇదంతా చూస్తున్నప్పుడు కంటనీరు ఆగలేదు. ఆమె గౌనును తీసేయమని డాక్టర్ అడిగారు. సిజేరియన్ గదికి తీసుకెళ్లేందుకు కనీసం వీల్‌చెయిర్ లేదా స్ట్రెక్చర్ లాంటివేమీ లేవు. ఆమె వెనుక ఒక గుడ్డను పెట్టుకుని, సిజేరియన్ గదికి తీసుకెళ్లాం. అదే సమయంలో, ఆస్పత్రిలో కరెంట్ పోయింది’’ అని రెహమునీసా తెలిపారు.

‘‘షాహిదున్‌కు బాగా నొప్పులు వస్తున్నాయి. నా ముఖం చూస్తుంది. ఆమెను ఓదార్చేందుకు చాలా ప్రయత్నించాను. ఆపరేషన్ తర్వాత, బాబును బయటకు తీశారు. బాబు తండ్రిని పిలిచారు. బాబు పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, నోట్లోకి చెత్త వెళ్లిందని, దాన్ని శుభ్రపరుస్తున్నామని తెలిపారు’’ అని ఆమె చెప్పారు.

అంతా బాగుంటుందన్నారు. కానీ, అప్పటికే పిల్లాడు చనిపోయాడు. ఆ విషయాన్ని వారు తమ వద్ద దాచారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘‘కొంత సమయం తర్వాత డాక్టర్ బయటికి వచ్చి, పిల్లాడు చనిపోయారని చెప్పారు. తల్లిని మరో ఆస్పత్రికి తరలిస్తున్నట్టు తెలిపారు. అంబులెన్సులో పేషెంట్‌ను తరలించేందుకు కనీసం వారి వద్ద స్టాఫ్ కూడా లేరు. మేమే పట్టుకుని అంబులెన్స్ ఎక్కించాం. వారి వద్ద ఆక్సీజన్ సౌకర్యం కూడా లేదు. ఆమె నోట్లో నుంచి నురుగ వచ్చింది’’ అని రెహమునీసా తెలిపారు.

‘‘సియోన్ ఆస్పత్రికి మా కూతుర్ని తరలించాం. అక్కడకు చేరుకున్నాక షాహిదున్ మరణించినట్లు వారు చెప్పారు. శుభవార్త వినేందుకు మేం ఆస్పత్రికి వెళ్లాం. కానీ, డాక్టర్లు మాకు తీరని బాధను మిగిల్చారు’’ అని రెహమునీసా చెప్పారు.

షాహిదున్, ఖుస్రుద్దీన్ అన్సారీలు తమ తొలి వివాహ వార్షికోత్సవం ఈ నెల 15న జరుపుకోనున్నారు.

ఖుస్రుద్దీన్‌ దివ్యాంగుడు. చాలా కాలానికి పెళ్లి కుదరడంతో అన్సారి కుటుంబమంతా సంతోషించింది. ఏడాదిలోనే శుభవార్త వినబోతుండటం వారికి మరింత సంతోషం కలిగించింది.

ఈ తొమ్మిది నెలల పాటు షాహిదున్ క్రమం తప్పకుండా చెకప్‌లకు వెళ్లారు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్లు అన్నారు. ఏప్రిల్ 29న ఆస్పత్రిలో చేరిన తర్వాత, సాయంత్రం వరకు అంతా బాగానే ఉంది.

ఘటనపై విచారణ కమిటీ

ఈ కేసులో కేఈఎం, శివ్, నాయర్ ఆస్పత్రులకు చెందిన పది మంది వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.

ఈ కమిటీ వారం రోజుల్లో తన నివేదికను సమర్పిస్తుందని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వైద్య విభాగం ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ దక్షా షా బీబీసీకి చెప్పారు.

ఆస్పత్రిలో జనరేటర్ ఉందని, కానీ, ఆరోజు ఆ ప్రాంతమంతా కరెంట్ పోయిందని, అప్పటికీ తమ బృందం పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించిందని దక్షా షా తెలిపారు.

మొబైల్ టార్చ్ వెలుతురులో సిజేరియన్ చేశారన్న దానిపై అడగగా.. ‘‘పరిస్థితిని మా బృందం బాగానే హ్యాండిల్ చేసింది. అదే రోజు, మొబైల్ టార్చ్ వెలుతురులో మరో సాధారణ కాన్పు చేశారు. కరెంట్ కోసం మేం ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నాం’’ అని తెలిపారు.

పూర్తి నివేదిక అందుబాటులోకి వచ్చిన తర్వాతనే దీనిపై విచారణ ప్రారంభిస్తామని, అప్పుడే అసలేం జరిగిందో చెప్పగలమని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ భందుప్ పశ్చిమ ‘ఎస్ విభాగపు’ మెడికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అవినాష్ వాయదండే చెప్పారు.

మున్సిపల్ ఆస్పత్రిలో సౌకర్యాల లేమి

సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్యంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు ఈ మున్సిపల్ విభాగానికి చెందిన మాజీ కార్పొరేటర్ జాగృతి పాటిల్ ఆరోపించారు.

‘‘మున్సిపల్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవు. పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ సంఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 12.30కు నేను ఆస్పత్రికి వెళ్లాను. తెల్లవారుజామున 4.50 వరకు అక్కడే ఉన్నా. పదేపదే కాల్స్ చేశాక, ఆస్పత్రి డీన్ అర్ధరాత్రి 2.30కు అక్కడకు వచ్చారు. ఏప్రిల్ 27 నుంచి ఆస్పత్రి జనరేటర్ పనిచేయడం లేదు. దీనిపై మేం అడ్మినిస్ట్రేషన్‌కు పలు ఫిర్యాదులు చేశాం’’ అని జాగృతి పాటిల్ బీబీసీకి చెప్పారు.

ఒకవేళ జనరేటర్ పనిచేయకపోతే, ముంబయి లాంటి నగరాల్లో తేలికగా ప్రత్యామ్నాయ విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు జాగృతి పాటిల్. బ్యాటరీతో నడిచే లైట్లను పెట్టుకోవచ్చన్నారు.

మొబైల్ టార్చ్ వెలుతురులో ఆపరేషన్ చేయడం చాలా సీరియస్ విషయమని చెప్పారు.

తమ స్టాఫ్ తప్పు ఉందని ఆస్పత్రి డీన్ డాక్టర్ చంద్రకళ కదమ్ అంగీకరించారు. దీనిపై రాతపూర్వక లేఖను కూడా సమర్పించారు. కానీ, ఇప్పటి వరకు వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. మహిళ, నవజాతు శిశువు మరణించినప్పటికీ, డాక్టర్లు ఎవర్ని కాపాడేందుకు ప్రయత్నించారని జాగృతి పాటిల్ ప్రశ్నించారు.

ఈ ఘటనపై మరింత సమాచారం కోసం ఆస్పత్రి డీన్‌ను కలిసేందుకు ప్రయత్నించగా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

‘నా చెల్లి చనిపోయింది’

‘‘షాహిదున్ మా తోబుట్టువుల్లో చిన్నది. పెళ్లి తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రావడంతో ఆమె చాలా సంతోషపడింది. ప్రతి రోజూ ఫోన్‌లో మాట్లాడేది. ఆమెకు ఎలాంటి సమస్య లేదు. కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యకరంగానే ఉండేవాడు’’ అని ఆమె సోదరి చెప్పారు.

‘‘పుట్టే బిడ్డ కోసం ఇంటి నుంచే కొన్ని వస్తువులు తీసుకు రమ్మని చెప్పింది. ఆమె కోసం అన్ని తీసుకొచ్చాను. తన కోసం బ్యాగ్ సర్దుకొని వస్తే, ఇప్పుడు నిర్జీవంగా పడి ఉంది. బిడ్డ, నా చెల్లి ఇద్దరూ మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. నా చెల్లిని కావాలనే చంపేశారు. చెల్లి మరణంతో నాన్న షాక్‌కు గురయ్యారు ’’ అని చెల్లి మరణంపై షాజహాన్ తన బాధను వివరించారు.

కరెంట్ బాధ్యత ఎవరిది?

ఈ మొత్తం వ్యవహారంలో అసలు విద్యుత్ అంతరాయానికి బాధ్యత ఎవరన్నది తెలియడం లేదు.

‘‘ఆస్పత్రిలో కరెంట్‌కు మా విభాగానిది బాధ్యత కాదు. ఆ ప్రాంతంలో విద్యుత్ అంతరాయానికి అసలు కారణమేంటన్నది మాకు తెలియదు. అసలు ఆస్పత్రిలో జనరేటర్ ఆన్ లేదా ఆఫ్‌లో ఉందో తెలియదు’’ అని విద్యుత్ విభాగంలో అడిషినల్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రికల్‌గా పనిచేస్తున్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ మయూర్ భగవత్‌ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-05-06T08:05:01Z dg43tfdfdgfd