రోహిత్ వేముల తల్లి: ‘నా కొడుకు కులాన్ని పోలీసులు ఎలా నిర్థరిస్తారు? ఇది కేసును పక్కదారి పట్టించే కుట్ర’

రోహిత్ వేముల. ఎనిమిదేళ్ళ కిందట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడా కేసు మరోసారి వివాదంగా మారింది. రోహిత్ వేముల ఎస్సీ కాదంటూ తెలంగాణ పోలీసులు కోర్టుకు ఇచ్చిన నివేదిక దుమారం రేపుతోంది.

రోహిత్ ఆత్మహత్యకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఈ కేసులో నిందితులని చెప్పడానికి సాక్ష్యాలు లేవని పోలీసులు కోర్టుకు నివేదిక ఇవ్వడం వివాదానికి మూలమైంది. దీనికితోడు పోలీసుల రిపోర్టులో రోహిత్ ఎస్సీ కాదని పేర్కొనడం మరోసారి వివాదాస్పదమయ్యింది.

ఈ కేసులో ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం జోక్యం చేసుకుంది.

ఈ కేసులో పునర్విచారణ జరుపుతామని తెలంగాణా డీజీపీ కార్యాలయం ప్రకటించింది.

అయితే పోలీసుల దర్యాప్తు తీరును రోహిత్ వేముల తల్లి రాధిక వేముల తప్పుపడుతున్నారు. ఇదంతా ఓ కుట్ర అని ఆమె అంటున్నారు.

తన కుమారుడి ఆత్మహత్యకు కారకులైనవారందరికీ శిక్షపడేవరకూ తన పోరాటం కొనసాగుతుందని రాధిక బీబీసీ ప్రతినిధి శంకర్ వడిశెట్టి‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం.

బీబీసీ: రోహిత్ దూరమై ఎనిమిదేళ్లు గడిచింది. రోజులు ఎలా గడుస్తున్నాయి?

రాధిక వేముల: ఈ రోజులన్నీ గడ్డు రోజులే. తాజాగా పోలీసులు ఇచ్చిన నివేదిక మరింత బాధ కలిగించింది. కేసు క్లోజ్ చేస్తూ కోర్టుకి నివేదిక సమర్పించడం మీద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. నాకు కూడా చాలా ఇబ్బంది కలిగించింది. వెంటనే తెలంగాణా సీఎంని కలిశాం. ఆయన కూడా న్యాయం చేస్తామన్నారు. కేసుని మళ్లీ రీ ఓపెన్ చేస్తామని సానుకూలంగా స్పందించారు. ఆ కేసుతో పాటుగా అప్పట్లో విద్యార్థుల మీద పెట్టిన కేసులు కూడా రద్దు చేయాలని కోరాను. సీఎం పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

బీబీసీ: రోహిత్ ఎస్సీ కాదంటూ, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొనడంపై మీరేమంటారు?

రాధిక వేముల: అవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు పోలీసులు కులాన్ని ఎలా నిర్థరిస్తారు? క్యాస్ట్ సర్టిఫికెట్‌పై దర్యాప్తు పోలీసులకు ఏం పని? 2017-18లోనే మేము కలెక్టర్‌కు రిపోర్ట్ చేశాం. 2019లో ఎన్నికలు, 2020, 21లో కరోనా పేరుతో దర్యాప్తు చేయలేదు. అసలు విచారణ పూర్తి కాకుండానే ఎలా నిర్థరిస్తారు? ఇదంతా బీజేపీ కుట్రతో జరుగుతోంది.

రోహిత్ ఎమ్మెస్సీ ఎంట్రన్స్‌లో ఆలిండియా ఐదో ర్యాంకర్. జేఆర్ఎఫ్‌లో రెండుసార్లు క్వాలిఫై అయ్యాడు. రోహిత్ వేముల సర్టిఫికెట్లు ఫేక్ అనడం తగదు. అన్నింటినీ ప్రజల ముందుంచుతాను. జనమే గమనిస్తారు. ఫేక్ అన్నది రాజకీయ కుట్ర. మేం నిక్కచ్చి దళితులం. మేం తప్పు చేయం.

బీబీసీ: రోహిత్ ఎస్సీ కాదని, ఆ విషయం బయటపడుతుందనే ఆందోళనతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు?

రాధిక వేముల: రోహిత్ ఎస్సీ కాకపోతే యూనివర్సిటీలో ఎలా చేర్చుకున్నారు? ఆయన సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే కదా చేర్చుకున్నారు? ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నమే ఇదంతా. రోహిత్ ఎస్సీగానే మరణించి, ఎస్సీగా చనిపోయాడు. ఎస్సీ కాకపోతే ఎందుకు సస్ఫెండ్ చేశారు? చనిపోయిన తర్వాత కులం మీద నిందలు వేయడం చాలా తప్పు.

బీబీసీ: రోహిత్ కులం గురించి గుంటూరు కలెక్టర్, గురజాల తహాశీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆయనది వడ్డెర కులం అని నిర్థరించినట్టు పోలీసులు అంటున్నారు?

రాధిక వేముల: ఎలా నిర్థరిస్తారు? నన్ను విచారించాలి కదా. నా వాదన వినాలి కదా. గచ్చిబౌలీ పోలీసులు ఎన్నడూ నన్ను విచారించలేదు. రోహిత్ మరణం తర్వాత కాంతిలాల్ దండే గుంటూరు కలెక్టర్ గా ఉండగా రోహిత్‌ను ఎస్సీనే అని ప్రకటించారు. కానీ వెంటనే మాట మార్చారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తను ఎస్సీ కాదంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారు.

బీబీసీ: రోహిత్ వ్యవహారంలో న్యాయం కోరుతూ దేశమంతా మీరు పర్యటించారు. కానీ ఇప్పుడు మీరు ఆశించిన న్యాయం జరగకపోగా మళ్లీ రోహిత్ నే నిందించేలా రిపోర్టులు వచ్చాయి. వాటిపై ఏమంటారు?

రాధిక వేముల: ఇదంతా కావాలనే చేస్తున్న యత్నం. ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. కాబట్టి ఇప్పుడు వారిని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగమే ఈ ప్రయత్నం.

బీబీసీ: కేసు రీ ఓపెన్ తర్వాత రోహిత్‌కు న్యాయం చేసేలా దర్యాప్తు జరుగుతుందని భావిస్తున్నారా?

రాధిక వేముల: ఖచ్చితంగా ఈసారి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. బీజేపీ, బీఆర్‌ఎస్ భుత్వాలు లేకుండా దర్యాప్తు సాగితే పూర్తిగా న్యాయం జరుగుతుంది.

బీబీసీ: ఏం న్యాయం ఆశిస్తున్నారు?

రాధిక వేముల: రోహిత్ వేముల చావుకి కారకులందరికీ శిక్ష పడాలి. దళిత విద్యార్థుల మీద దాడులు చేసేవాళ్లు భయపడేలా ఉండాలి.

బీబీసీ: రోహిత్ ఉదంతం తర్వాత కూడా ఐఐటీల వంటి చోట్ల పలువురు దాడులకు గురయ్యారు. వాటిని ఎలా చూస్తారు?

రాధిక వేముల: రోహిత్ వేముల మాదిరిగా ఎవరికీ జరగకూడదని నేను పోరాడుతున్నాను. ఇండియాలో విద్యార్థులంతా రోహిత్ లాంటి వారే నాకు. ఒక బిడ్డను కోల్పోయాను. ఇంకెవరినీ పోగొట్టుకోకూడదని ఆశిస్తున్నా.

బీబీసీ: మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి?

రాధిక వేముల: రోజులు అలా గడుస్తున్నాయి. నేను టైలరింగ్ చేస్తున్నాను. చిన్నబ్బాయి రాజా కొంతకాలం హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. కుటుంబానికి పెద్దగా ఆసరా అవ్వలేదు. అందుకే ప్రస్తుతం ఆయన ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నారు.

బీబీసీ: రోహిత్ వేముల చట్టం వెనుక లక్ష్యం ఏమిటి?

రాధిక వేముల: ఆ చట్టం వస్తుందని ఆశిస్తున్నాను. దళిత పిల్లల మీద అన్యాయాలు అరికట్టేలా ఉంటుంది. కాబట్టి ఆ చట్టం రూపొందించాలని కోరుతున్నాను.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-05-06T14:24:53Z dg43tfdfdgfd