లవ్ బ్రెయిన్.. ప్రేమతో చంపేసే వింత రోగం.. ఆ యువతి అతి ప్రేమకు బాయ్‌ఫ్రెండ్ ఉక్కిరిబిక్కిరి

ప్రియుడికి అదే పనిగా ఫోన్లు చేసి, విసిగెత్తిస్తోన్న ఓ యువతి.. చివరకు తన విపరీత ప్రవర్తనతో ఆస్పత్రి పాలైంది. ప్రియుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు అని ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి రోజూ 100 సార్లు ఫోన్ల చేసే ఆమెకు ‘లవ్ బ్రెయిన్’ అనే వ్యాధి ఉన్నట్టు తేలింది. అరుదైన ఈ కేసు చైనాలో వెలుగుచూసింది. జియావో అనే 18 ఏళ్ల యువతి.. తన ప్రియుడి పట్ల అసభ్య ప్రవర్తనను ప్రదర్శించి ఆసుపత్రిలో చేరినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఆమె తీవ్రమైన పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతుందని వైద్యులు భావిస్తున్నారు.

స్థానిక నివేదికల ప్రకారం.. జియావో అసాధారణ ప్రవర్తన విశ్వవిద్యాలయంలో చేరిన మొదటి ఏడాదిలోనే ప్రారంభమైంది. తన బాయ్‌ఫ్రెండ్‌పై ఎక్కువగా ఆధారపడిన ఆమె.. రోజంతా ఫోన్లు చేస్తూ అతడి గురించి ఆరా తీసేది. ప్రియురాలి ప్రవర్తనతో యువకుడు ఉక్కిరిబిక్కిరికి గురయ్యాడని, ఇది వారి మధ్య సంబంధాలను దెబ్బతీసిందని తేలిందని పేర్కొన్నాయి. జియావో తన ప్రియుడికి ఒకే రోజు 100 సార్లు ఫోన్ చేసినా అతడు సమాధానం చెప్పకపోవడంతో పరిస్థితి విషమించింది. కోపంతో ఇంట్లోని వస్తువులను పగలుగొట్టింది. దీంతో ఆమె ఏమైపోతుందోనని భయపడిన ప్రియుడు పోలీసులను ఆశ్రయించాడు.

బాల్కనీ నుంచి దూకుతానని బెదిరింపులకు దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యపరంగా కానప్పటికీ రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఈ రకమైన ప్రవర్తనను ‘లవ్ బ్రెయిన్’‌గా పరిగణిస్తారు. జియావోకు చికిత్స అందజేసిన ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ డు నా మాట్లాడుతూ... బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కొన్నిసార్లు ఆందోళన, నిరాశ, బైపోలార్ డిజార్డర్ వంటి ఇతర పరిస్థితులతో కలిసి సంభవించవచ్చని తెలిపారు. అటువంటి పరిస్థితులు బాల్యంలోని అనుబంధాలతో ముడిపడి ఉండవచ్చని డాక్టర్ డు వ్యాఖ్యానించారు. తన మెసేజ్‌లకు తక్షణమే ప్రియుడు స్పందించాలని ఆశించిందని అన్నారు.

జియావో అనారోగ్యానికి కారణాన్ని వెల్లడించని ఆయన.. కానీ బాల్యంలో తల్లిదండ్రులతో ఆరోగ్యకరమైన సంబంధం లేని వ్యక్తులలో ఇది తరచుగా సంభవిస్తుందని చెప్పారు. కొన్ని తేలికపాటి కేసులు భావోద్వేగ నిర్వహణ పద్ధతులతో మెరుగుపడవచ్చని, జియావో వంటి తీవ్రమైన కేసులకు వైద్య చికిత్స అవసరమని డాక్టర్ డు నొక్కి చెప్పారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T03:43:51Z dg43tfdfdgfd