శ్రీ శారదా పీఠంలో ఘనంగా మహా పూర్ణాహుతి..

విశాఖ శ్రీ శారదా పీఠంలో రెండు రోజుల పాటు జరిగిన హోమాలు మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం హోమ ప్రక్రియ సాంప్రదాయబద్ధంగా, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగింది. పీఠ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక భావం సంతరించుకుని అమ్మవారి నామ స్మరణతో ప్రతిధ్వనించింది. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆధ్వర్యంలో ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ హోమాలు నిర్వహించారు.

అనంతరం పీఠాధిపతులు భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ ఎండలు తీవ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఋత్వికులు వేడి తాపానికి చలించకుండా యాగాన్ని పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉందని స్వామివారు తెలిపారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నం లో మాత్రమే ఉన్న రాజశ్యామలా అమ్మవారి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు అన్నారు.

Zero Interest Loan: భారీ శుభవార్త.. సొంత ఇంటి నిర్మాణానికి వడ్డీ లేని రుణం.. ఉచితంగానే..

దర్శనం చేసుకుంటేనే సకల అభీష్టాలు నెరవేరేటటువంటి శక్తి స్వరూపం శ్రీ రాజ శ్యామలా అమ్మవారు అని స్వామి తెలిపారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేశము, రాష్ట్రము మరింత అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో యాగాన్ని నిర్వహించామని అన్నారు. యాగంకు వచ్చిన ప్రతి ఒక్కరికి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలనే కాంక్షతోనే ఈ యాగం నిర్వహించడం జరిగింది అన్నారు.

విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇంతటి పవిత్ర హోమాలను తిలకించడం తమ అదృష్టమని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేసారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ రాజ్యసభ సభ్యులు వై వి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యులు ఆడారి ఆనంద్ మరియు అన్నం రెడ్డి అదీప్ రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మరియు పూజ స్వామీజీల ఆశీస్సులు అందుకున్నారు.

2024-05-06T09:30:20Z dg43tfdfdgfd