సాగర్ టెయిల్ పాండ్​ నుంచి ఏపీ నీళ్ల చోరీ

సాగర్ టెయిల్ పాండ్​ నుంచి ఏపీ నీళ్ల చోరీ

  • దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్రా ఆఫీసర్లు
  • రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే టెయిల్​పాండ్ నుంచి దోపిడీ
  • కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్న తెలంగాణ అధికారులు

హైదరాబాద్/హాలియా, వెలుగు: తాగునీటి కోసమని కుడి కాల్వ నుంచి నీటిని తీసుకెళ్తున్న ఏపీ.. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి దొంగచాటుగా జలాలను తరలించుకుపోతున్నది. సాగర్ ప్రాజెక్టుకు దిగువన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి సమీపంలోని చిట్యాల దగ్గర నిర్మించిన టెయిల్​పాండ్ నుంచి ఏపీ అధికారులు నాలుగు టీఎంసీల నీళ్లను విడుదల చేసుకున్నారు. 

4 రోజులుగా టెయిల్​పాండ్ నుంచి పులిచింతల ప్రాజెక్ట్​కు వాటర్​ను రిలీజ్ చేసుకుని.. ఏపీ అవసరాల కోసం వాడుకుంటున్నారు. తాగునీటి కోసం ఇటీవల కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. రెండు రాష్ట్రాల ఈఎన్​సీలు ఈ మీటింగ్​లో పాల్గొన్నారు. 500 అడుగుల వరకు నీటిని తీసుకునేందుకు అవకాశం ఇచ్చిన త్రిసభ్య కమిటీ.. తెలంగాణకు 8.695 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల జలాలను కేటాయించింది. అయితే, ఇప్పటికే ఏపీ మూడు విడతలుగా నీటిని విడుదల చేసుకుంది.

అది చాలదన్నట్టు టెయిల్​పాండ్ నుంచి సాగర్​లోకి టర్బైన్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేయాల్సిన నీటిని ఏపీ దొంగ చాటుగా ఎత్తుకెళ్లిపోయింది. సాగర్​ నుంచి విద్యుదుత్పత్తి చేసుకున్నాక దిగువకు వెళ్లే నీటిని స్టోర్ చేసేందుకు చిట్యాల దగ్గర టెయిల్​పాండ్​ను నిర్మించారు. వాటిని మళ్లీ దిగువకు పంపించకుండా సాగర్​లోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఏపీ ఆ నీటిని వాడేసుకోవడంతో పాండ్ లో బండరాళ్లు, ఇసుక తేలాయి. ఏపీ తోడేసుకున్న నీళ్లు పోను ప్రస్తుతం టెయిల్ పాండ్​లో మరో 2.9 టీఎంసీల జలాలు మాత్రమే ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏపీ వ్యవహారంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తున్నది. నీటిని దొంగచాటుగా ఏపీ తరలించుకుపోయిన సంగతి తెలిసి.. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్​మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అధికారులు గురువారం టెయిల్​పాండ్​ను పరిశీలించారు. జలాశయంలో నీరు తగ్గిపోవడంతో మిషన్ భగీరథకు అందించాల్సిన నీటి కోసం అక్కడ ఏర్పాటు చేసిన అదనపు మోటార్లను నదిలోకి దింపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T01:16:00Z dg43tfdfdgfd