సామాజిక ధీరుడు బసవేశ్వరుడు : పి. భాస్కరయోగి

సామాజిక ధీరుడు బసవేశ్వరుడు : పి. భాస్కరయోగి

ఇయ్యాల మనం ఏ సంస్కరణ ముఖ్యంగా ‘కులతత్వం’ వదిలి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం సుమారు 9 వందల ఏండ్ల క్రితమే ఆచరణలోకి తెచ్చిన ధీశాలి బసవేశ్వరుడు.  క్రీ.శ 1131లో  కర్నాటక ప్రాంతంలో హింగుళేశ్వర భాగవాటి (బాగెవాడ)లో శివాచార పరాయణులైన దంపతులు మండెగ మాదిరాజు,  మాదాంబ పుణ్య దంపతులకు బసవేశ్వరుడు జన్మించాడు.  చిన్న వయసులోనే ఉపనయన సంస్కారం తిరస్కరించి శివభక్తుడై కర్నాటక ప్రాంతంలో సంచలనం సృష్టించాడు. ఆనాడు చాళుక్య చక్రవర్తి బిజ్జలుడు ఆ ప్రాంతపు రాజు.

ఆయన దగ్గర ఆస్థాన మంత్రి బలదేవుడికి బసవణ్ణ వరుసకు మేనల్లుడు. బసవణ్ణ సోదరి నాగలాంబిక, బావ శివస్వామి దంపతుల ఆదరణతో బసవణ్ణ చేస్తున్న సాధన,  ప్రయత్నం, వీరశైవ మత ప్రచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది.  ఆ తర్వాత చాళుక్య చక్రవర్తి కొలువులో  కోశాధికారిగా,  దండనాయకుడిగా,  భండారిగా,  ప్రధానమంత్రిగా  బాధ్యతలు  నిర్వర్తించిన బసవేశ్వరుడు సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి, మతాన్ని సామాజిక రుగ్మతలపై అస్త్రంగా ప్రయోగించాడు. ఆనాడు ప్రజల్లో  వేళ్లూనుకున్న వర్గభేదాలు, అజ్ఞానం, అంధవిశ్వాసాలపై యుద్ధం ప్రకటించిన బసవేశ్వరుడు పూర్తిగా సఫలీకృతుడయ్యాడు.

స్త్రీల ఉద్ధరణ, కులతత్వ నిర్మూలన, నిమ్నకులాల్లో ఆత్మన్యూనత  పోగొట్టి ఆత్మవికాసం కల్పించాడు. వారిని తన అనుయాయులుగా మార్చుకుని అందరినీ ఒకచోట చేర్చి, వారి అనుభవాలను పంచుకునేందుకు ‘అనుభవమంటపం’  స్థాపించిన అసమానధీరుడు  బసవేశ్వరుడు. తాను బ్రాహ్మణ కులంలో జన్మించినా పూర్వాచారాలను కొన్నింటిని తిరస్కరించి సనాతన ధర్మంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు. 

బోయకులంలో జన్మించిన వాల్మీకి

అందరూ ఒక్కటేననీ సృష్టిలోని  సమానత్వంపై తీవ్ర ప్రకటన చేస్తూ..‘పుట్టుకతో కులం నిర్ణయించడం పాపం. ప్రతి మనిషి వాళ్లు చేసే మంచి పనుల వల్ల, సత్ర్కియల వల్ల యోగ్యత నిర్ణయించబడుతుంది. వాళ్లు అవలంబించే వృత్తిని బట్టి అతడి కులం నిర్ణయించడం దురదృష్టం’ అంటాడు బసవణ్ణ.  హింసా ప్రవృత్తి  ఉన్నవాడే నీచ కులస్థుడు అని ఎలుగెత్తి చాటిన బసవణ్ణ అస్పృశ్యుడని పిలువబడిన శివనాగుమయ్యతో కలిసి గుర్రం ఎక్కి తిరిగాడు. అందరూ జన్మతా సమానమేననీ, వృత్తి గౌరవం ఉండాలని ప్రబోధించాడు బసవణ్ణ.  మహాభారతం రచించిన వ్యాసమహర్షి బెస్త స్త్రీకి జన్మించాడు. ఉపనిషత్తుల్లో సత్యానికి ఉదాహరణగా చెప్పే జాబాలి వేశ్యాపుత్రుడు. వాల్మీకి బోయకులంలో జన్మించాడు.  

మాతంగికి పుట్టినవాడు మార్కండేయుడు.  కటికె కులంలో పుట్టినవాడు ధర్మవ్యాధుడు, మండోదరి కప్పలను అమ్ముకొని జీవించిన వ్యక్తి కూతురు. కిరాతునికి పుట్టినవాడు అగస్త్యుడు. మంగలి కులస్థుడు కౌండిన్య మహర్షి. కుమ్మరి కులస్థుడు కశ్యపుడు.. ఇలా ఎందరో మహర్షుల పేర్లు గోత్రాలుగా మనం చెప్పుకుంటున్నాం. మరి మహర్షులే ఇలా తక్కువ కులంలో జన్మించి గొప్ప వాళ్లైతే ఇక మనకు కుల అహంకారం ఎందుకని బసవణ్ణ సంచలనాత్మక వచనాలు చెప్పాడు. 

శివ భక్తులకు కులం లేదు

‘ఏ కులమైతేనేమి శివలింగమున్నవాడే కులజుడు. కులమునెంతురా శరణములందు’ అని బసవేశ్వరుడు సూచించాడు. ‘నేను ఉత్తమ కులంవాణ్ని’ అనే భావన రానీయవద్దని సంగమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. తాను విప్లవాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన వీరశైవ మతం స్వీకరించి లింగధారులైనవారంతా శివభక్తులే అని వారికి కులం లేదని ప్రకటించాడు. అంతేగాకుండా తాను ఏ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాడో వాటి ఫలితాలను తన జీవితకాలంలోనే కళ్లతో చూసిన సంస్కర్త బసవేశ్వరుడు. బసవేశ్వరుడి జీవితంలోని భక్తాగ్రేసరులంతా ఎక్కువగా కింది కులస్థులే.  

మడివాలు మాచయ్య,  బెజ్జ మహాదేవి,  మేదర కేతయ్య, మాదిగ కక్కయ్య, హరళయ్య వంటి దళిత, శూద్ర శివభక్తులకు తన జీవితంలో బసవేశ్వరుడు స్థానం కల్పించాడు. అన్ని కులాలవారిని బసవేశ్వరుడు తన శిష్యకోటిలో చేర్చుకున్నాడు. అంధవిశ్వాసాలు, అనవసర ఆచారాలను బసవేశ్వరుడు తిరస్కరించాడు. 12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు కులం, అస్పృశ్యత నివారణకు వెతికిన పరిష్కారం నేటి ఆధునిక యుగంలో ఆచరించలేకపోవడం విచారకరం. బసవేశ్వరుడు ఓ క్రాంతి పురుషుడు. ఓ జగద్గురువు. 

- డా. పి. భాస్కరయోగి,

సోషల్​ ఎనలిస్ట్

©️ VIL Media Pvt Ltd.

2024-05-10T02:51:30Z dg43tfdfdgfd