సినిమా రివ్యూ-ప్రసన్న వదనం: ఇంకాస్త ప్రసన్నంగా ఉండొచ్చు....

ప్రతీ సినిమాకు ఒక ఆత్మ ఉంటుంది. ప్రతి హీరోకి ఒక మార్క్ ఉంటుంది. కొంతకాలం తర్వాత హీరో ఆ మార్క్ నుంచి ఎదిగే ప్రయత్నం చేస్తారు.

నిస్సహాయ వాతావరణంలో అమాయకత్వం, ఆర్థిక బలం లేని కుటుంబ వాతావరణం నేపథ్యంగా ఇప్పటివరకు సుహాస్ సినిమాలు చేశాడు. అందులో ఊహలకు, కమర్షియల్ అంశాలకు అవకాశం చాలా తక్కువే ఉంది.

తన ‘పర్సనాలిటీ ట్రెయిట్స్’ ఒకే రకంగా ఉండేలా కథల్లో జాగ్రత్త తీసుకుంటూ ఎదుగుతున్న నటుడు సుహాస్. ఆ పరిధిని దాటి కొంత వైవిధ్యత-కమర్షియాలిటీ ఎలిమెంట్స్ ఉన్న జోనర్‌లోకి ఈ ‘ప్రసన్న వదనం’ సినిమాతో ప్రవేశించాడు. కనుక ఇది కచ్చితంగా సుహాస్ సినీ కెరియర్ లో ఓ కొత్త ప్రయోగమే.

ఇకపోతే కథ ఓ కొత్త అంశానికి చెందింది. ఈ సినిమాలో కథానాయకుడు (సుహాస్) ఎదుటి వ్యక్తి ముఖంలోని అన్ని భాగాలను చూడగలిగి, స్వరం వినగలిగి కూడా మనుషుల ముఖాలను, వారి గొంతులను గుర్తు పట్టలేని స్థితి(ఫేస్ బ్లైండ్‌నెస్)లో ఉంటాడు.

ఆ వైద్య పరిస్థితి వల్ల హీరో ఎదుర్కొనే బాధలు చూపించడమో లేక దాని ఆధారంగా హాస్యం పుట్టించడమో లేక ఒక క్రైమ్ జోనర్‌లో, సామాజిక అంశంతో కూడా ఈ సినిమా కథను నడిపించవచ్చు.

కానీ, సినిమాను గంభీరంగా మొదలుపెట్టి, మధ్యలో హాస్యం, మధ్యలో క్రైమ్ కలిపేసి కలగాపులగడం చేయడం వల్ల ఈ సినిమా ఆత్మ ఉన్న ‘ఫేస్ బ్లైండ్ నెస్ ‘అన్న కాన్సెప్ట్ లోతుగా ప్రేక్షకుల్లో రిజిస్టర్ కాదు.

ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటారు. ఉన్నట్టుండి ఆ అమ్మాయిని ఆ అబ్బాయి వేగంగా వస్తున్న బండి కిందకు తోసేస్తాడు. ఆమె చచ్చిపోతుంది. ఇది హీరో చూస్తాడు.

ఈ సన్నివేశం ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

ఆ అమ్మాయి ఎవరు? అతను ఎవరు? అసలు ఎందుకు ఆమెను చంపి ఉంటాడు? అసలు మనుషుల ముఖాల్నే గుర్తు పట్టలేని మన హీరో ఈ క్రైమ్‌ను ఎలా సాల్వ్ చేస్తాడు.

ఇది నిజంగానే మంచి కథ. కానీ, అసలు ఏ ప్రయత్నం లేకుండా చాలా సింపుల్‌గా హత్య చేసిన వాడు ఎవరో ప్రేక్షకుడికి తర్వాతి సన్నివేశంలోనే తెలిసిపోతుంది. సరే, వాడు స్వతహాగా అది చేయలేదు, ఎవరి కోసమో చేశాడు.

ఆఖరికి అది కూడా కొంత ఊహించగలిగేలా ఉండి, ఇంటర్వెల్ సమయానికి ఎవరు చంపారో తెలిసిపోతుంది . ఇదంతా కూడా ప్రేక్షకులకు హీరో ప్రయత్నం లేకుండానే కనిపించే దృశ్యాలు. దీనితో ఈ జోనర్‌లో ఉండే ‘హీరో తెలివితేటలు, పడే కష్టాలు, లాజికల్ ఇంటెలిజెన్స్’ వంటివి ఎక్కడా కనిపించవు. అందుకే ఇందులో హత్య ఉంది కానీ,పెద్ద మిస్టరీ లేదు.

ఇకపోతే కేవలం హీరో బాధపడే ‘ఫేస్ బ్లైండ్ నెస్’ విషయానికి వస్తే, ఓపెనింగ్ సీన్‌లో అతనికి తన ముఖమే అద్దంలో అనేక ముఖాలుగా కనిపించడం అన్నది ఆ సమస్య తీవ్రతను స్పష్టం చేస్తుంది. అతను చుట్టూ ఉన్న వారితో మెలుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎంత కాంప్లెక్స్‌గా ఉంటుందో చూడాలి అనే తహతహ కలుగుతుంది.

కానీ, అతను మనుషులను గుర్తు పట్టలేకపోవడమే ఏదో సహజమైన అంశంగా కనిపిస్తుంది తప్ప ఇది ‘ఫేస్ బ్లైండ్‌నెస్‘ వల్ల అనే అంశం మనకు సినిమాలో తర్వాత ఎక్కడా కనిపించదు. దీనివల్ల ఈ మెడికల్ కండిషన్ ప్రభావం అన్నది పెద్దగా ప్రేక్షకుల ఎమోషన్స్‌ను ప్రభావితం చేయదు.

సుహాస్ సినిమాలంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్. అతను ఏ పాత్ర చేసినా, అది ఎంత సాధారణమైనది అయినా సరే, ఆ కనక్షన్ వల్లే అతను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

కానీ ఈ సినిమాలో లవ్ ట్రాక్ అన్నది సుహాస్ ప్రయత్నించిన ఓ కొత్త అంశం అనే అనుకోవచ్చు. సాధారణంగా సుహాస్ సినిమాల్లో నాయికలు సహజంగా ఉంటారు. కమర్షియల్ లవ్ ఉండదు. కానీ ఈ సినిమాలో అది కనిపిస్తుంది.

నిజమే...కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే సినిమాలు ఎలా ఆడతాయి? కానీ, కమర్షియల్ ఎలిమెంట్ ఉంటే బావుంటుందేమో అని అనుకుని దాన్ని సినిమాలో భాగం చేస్తే కథ దెబ్బ తింటుంది.ఈ సినిమాలోనూ అదే జరిగింది.

ఒక అమాయకురాలిని హత్య చేశారు. ఫేస్ బ్లైండ్ నెస్ ఉన్న హీరోను అందులో ఇరికించారు. ఈ కథలో బాధ ఉంది. కానీ ఈ ‘ఎమోషనల్ ఇంటెన్సిటీ’ని అనుభూతి చెందేలోగానే కథ పాత్రల ప్రమేయం లేకుండా నడిచిపోతూ ఉంటుంది.

హత్య మిస్టరీ ముందే తెలిసిపోయి, ఫేస్ బ్లైండ్ నెస్ ఉన్నా పెద్ద ఇబ్బంది ఏం లేకుండా అంతా తేలిపోవడం ఎందుకో అటూ కమర్షియల్ ఎలిమెంట్‌ను,ఇటూ కాన్సెప్ట్ ఎలిమెంట్‌ను ప్రేక్షకులు పట్టుకుని ఉండేలా చేయలేకపోయింది.

ఈ మూడు జోనర్స్ కాకుండా సైకలాజికల్ పంథాలో నడిచి ఉంటే ఈ సినిమా తప్పక ఓ మాస్టర్ పీస్ అయ్యేది. కథ చెప్పడానికి-ఆ కథను ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి మధ్య కొంత స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ ఈ సినిమాలో లేదు.

ఇక కథ విషయం పక్కన పెడితే, హర్ష ఈ సినిమాలో చక్కగా నటించాడు. సుహాస్‌ని ఈ సినిమాలో చూస్తున్నప్పుడు ఇటువంటి సినిమాలకు తను కూడా తన నార్మల్ మార్క్‌ను వదిలి ఇంకా కొంత కొత్తగా ప్రయత్నించాలేమో అనిపిస్తుంది.

ఈ సినిమాలో సరోగసి లాంటి అంశాన్ని పెట్టినా కూడా, ఆ గంభీర నేపథ్యం ఈ సినిమాలో కనిపించదు. సామాజికంగా తనే ఆరోగ్యపరంగా కష్టంలో ఉండి, ఎదుటి వ్యక్తికి సాయం చేయాలన్న సంస్కారం ఉన్న నాయకుడి ఔదార్యం కూడా చాలా మామూలుగా అనిపిస్తుంది. ఈ సినిమాకు పాటలు కూడా పెద్ద అసెట్‌గా నిలబడలేదు.

కానీ, ఇప్పుడు వస్తున్న మామూలు ఊకదంపుడు సినిమాల కన్నా కచ్చితంగా బావుంది. కాకపోతే గొప్ప సినిమా అయ్యే అవకాశం ఉండి కొంత గందరగోళంలో పడి మామూలు సినిమాగా మారిపోయిందే అనిపిస్తుంది. ప్రతినాయక పాత్రకు బలం మాత్రమే కాదు,ఆ పాత్ర ప్రెజెన్స్ లో ఒక ‘Anonymity ఉండాలి. ఆ మ్యాజిక్ ఈ సినిమాలో మిస్ అయ్యింది .

‘Always make the audience suffer as much as possible’ అంటాడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్.

ఆ సఫరింగ్ ప్రతీసారి ఒక అంశం గురించే కావల్సిన అవసరం లేదు. కానీ ఆ సఫరింగ్‌ని ‘సాధారణత్వం’గా మారిస్తే మాత్రం గొప్ప ప్రయత్నం కూడా సాధారణ ప్రయత్నంగానే మిగిలిపోతుంది.

గొప్ప అంశాలను ఎన్నుకోవడం కన్నా కూడా ఏ అంశాన్ని అయినా గొప్పగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడమే సినిమా గొప్పతనానికి గీటు రాయి. తెలుగు సినిమాల్లో ఈ గీటు రాయి నిర్ధారణలు కమర్షియల్ మూకలో కలిసిపోయి, స్పార్క్ ఉన్న సినిమాలను కూడా తమలో కలిపేసుకుంటూ, వాటి ఆత్మను మింగేస్తున్నాయి. అలా ఆత్మ మింగేయబడిన సినిమానే ఈ ‘ప్రసన్నవదనం.’

గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-05-05T11:20:31Z dg43tfdfdgfd