సొంతంగా ఒకరు.. పంతంతో మరొకరు..

ఐఏఎస్‌… కావాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ దాన్నే ఆశయంగా పెట్టుకొని అందుకొనేదాకా నిద్రపోని వాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వాళ్లకు అత్యున్నత స్థాయి పాఠశాలలు, కళాశాలలతో పనిలేదు. పెద్ద కోచింగ్‌ సెంటర్లే కావాలన్న అవసరమూ లేదు. తమను తాము నమ్మి, కష్టమే పునాదిగా ముందడుగు వేశారీ యువతులు. నిండా పాతికేండ్లు లేకుండానే అఖిల భారత సర్వీసుల్లో అతిపెద్ద హోదాను అందుకున్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించే ఈ ఇద్దరమ్మాయిల కథలు ఎందరికో స్ఫూర్తిదాయకం.

భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఒకటి. దేశస్థాయిలో ఉన్నతోద్యోగిగా నిలబెట్టే ఈ సర్వీసులు ఊరించే కలలా కనిపిస్తాయి చాలా మందికి. ఆకర్షణీయమైన ఈ పరీక్ష అంతే కష్టసాధ్యమైనదనీ చెబుతారు అభ్యర్థులు. కానీ, ఈ సివిల్స్‌ ర్యాంకు కొట్టాలంటే కోచింగ్‌ సెంటర్లలో ఏండ్లు గడపాల్సిందే అన్నమాటలో అంత నిజం లేదు అని నిరూపించింది విదుషీ సింగ్‌. జోధ్‌పూర్‌కి చెందిన ఆమె ఢిల్లీలోని ప్రఖ్యాత శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో డిగ్రీ చేసింది.

ఒక పక్క డిగ్రీ సబ్జెక్టులు చదువుకుంటూనే మరోపక్క సివిల్స్‌కీ సన్నద్ధమైంది. ఆ పరీక్షను ఎదుర్కొనడానికి పునాదిగా పనికొచ్చే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. నిజానికి డిగ్రీకి ముందు నుంచే విలువైన అంశాలను సేకరించి చదివేది. సమకాలీన విషయాలను విశ్లేషించుకునేది. అలా తనను తాను పరీక్షకు సన్నద్ధం చేసుకోవడంతో ఏ కోచింగ్‌ సెంటర్‌ అవసరమూ అక్కర్లేదన్న భరోసా వచ్చిందామెకు. సబ్జెక్టు చదవడం, టెస్ట్‌ సిరీస్‌లూ, మాక్‌ ఎగ్జామ్‌లూ రాయడం… ఇదే పనిగా పెట్టుకుంది.

డిగ్రీ పూర్తయ్యాక ఏడాదిలోనే ఎంట్రన్స్‌ పరీక్ష రాసింది. తొలిసారే ఏకంగా అఖిల భారత స్థాయిలో 13వ ర్యాంకు సాధించింది. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌) వచ్చినా, తను మాత్రం ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)ను ఎంచుకుంది. తాతా మామ్మలకు తనను ఆ హోదాలో చూడాలన్న ఆశ ఉండటమే అందుకు కారణం అని చెబుతున్నది. ఇంతా చేసి, ఆమె వయసు కేవలం 21 ఏండ్లే! ఇంత చిన్న వయసులో సొంతంగా చదివి సివిల్‌ సర్వీసెస్‌ కొట్టడం నిజంగా గొప్పే కదూ!

అగన్‌వాడీ నుంచి ఐఏఎస్‌

ఎక్కడ చదివాం అన్నది కాదు, ఎలా చదివామన్నది ముఖ్యం అని చెబుతుంది మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్‌ ప్రాంతానికి చెందిన 23 ఏండ్ల యువతి కథ. అక్కడి బోందరాన్య గ్రామంలో పెరిగింది ఆదివాసీ తెగకు చెందిన మనీషా ధార్వే. తండ్రి గంగారామ్‌ ధార్వే ఇంజినీరే అయినా పల్లెల్లో ఉండి, ఆ ప్రాంతానికి సేవ చేయాలన్నది ఆయన ఆశయం. భార్యతో కలిసి చుట్టు పక్కల స్కూళ్లకు వెళ్లి పేద పిల్లలకు పాఠాలు చెప్పేవారు. దీంతో మనీషా కూడా ఊళ్లోనే పెరిగింది.

అందుకే మనీషాకు ప్రైవేటు కాన్వెంటుల సంగతులు, ఐఐటీ ఫౌండేషన్‌ల ముచ్చట్లు తెలియవు. ఊళ్లో ఉన్న అంగన్‌వాడీ బడిలో తొలి అడుగులు వేసింది. తర్వాత ఎనిమిదో తరగతి వరకూ అక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఇంటర్మీడియెట్‌ జిల్లా కేంద్రమైన ఖర్‌గోన్‌లో పూర్తి చేసింది. అయితే తొలి నుంచీ ఆమె చురుకైన విద్యార్థి. అన్ని తరగతుల్లో మంచి గ్రేడ్‌లు సాధించేది. తనను తాను పెద్ద ఆఫీసర్‌గా చూసుకోవాలనుకునేది.

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి కోరింది. మొదట సందేహించినా తర్వాత సరేనన్నారు. కానీ తొలిసారి పరీక్ష ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టలేదు. దాంతో ఊరికి తిరిగి వచ్చేసింది. అయినా సరే పట్టుదలతో చదివింది. మరో రెండు సార్లూ పరీక్ష రాసింది. విఫలమైంది. నాలుగోసారి మరింత గట్టిగా ప్రయత్నించింది. 257 ర్యాంకు సాధించి 23 ఏండ్ల వయసులోనే అత్యున్నత సర్వీస్‌ అయిన ఐఏఎస్‌కు ఎంపికైంది. ఇప్పుడా చుట్టుపక్కల వాళ్లందరికీ ఆమె కలెక్టర్‌ మనీషమ్మ!

2024-07-03T21:08:59Z dg43tfdfdgfd