స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది

స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది

టైటిల్ : లా పతా లేడీస్​ 

డైరెక్షన్ :  కిరణ్​ రావ్​ 

కాస్ట్ :  ప్రతిభ రాంటా, స్పర్ష్​ శ్రీవాత్సవ, రవి కిషన్​, నితాన్షి గోయల్​, ఛాయ కదమ్

ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్​​

దీపక్​ కుమార్​ (స్పర్ష్​ శ్రీవాత్సవ), ఫూల్​ (నితాన్షి గోయల్​)ను పెండ్లి చేసుకుంటాడు. ఆ తరువాత దీపక్​ వాళ్లు ఉండే ముర్తి అనే ప్లేస్​కి రైల్లో బయల్దేరతారు. ఆ రోజు ఎంతో పవిత్రమైన తృతీయ. అందుకని చాలామంది పెండ్లిండ్లు చేసుకుంటారు. దాంతో ఆ రైలంతా కొత్తగా పెళ్లయిన జంటలతో నిండిపోయి ఉంటుంది. దీపక్​, ఫూల్​ ఆ ట్రైన్​లో మరో కొత్త జంట పక్కన కూర్చుంటారు. పెళ్లికూతుళ్లందరూ తమ ముఖాలను ఎరుపు రంగు ముసుగుతో కప్పుకున్నారు. 

దిగాల్సిన స్టేషన్​​ రాగానే దీపక్​ పొరపాటున మరో పెళ్లి కూతురు (ప్రతిభ రాంటా)ని తీసుకుని దిగి, వాళ్లింటికి తీసుకెళ్తాడు. పుష్ప తన ముసుగును తొలగించేసరికి ఆ ఇంటి వాళ్లంతా షాక్​ అవుతారు. ఇక మిగతా కథంతా దీపక్​ మిస్​ అయిన తన భార్యను వెతకడంతో ఉంటుంది. సినిమా అంతా ఎంటర్​టైనింగ్​గా ఉంటూనే సమాజానికి మెసేజ్​ ఇస్తున్నట్టు ఉంటుంది. ఆఖరి అరగంట ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది.

 సినిమా చూశాక ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. అలాగే ఆలోచనల్లో  కూడా పడేస్తుంది. ఈ మధ్యకాలంలో మహిళా క్యారెక్టర్లను అంత బాగా రాసిన సినిమా ఇది. నటీనటులంతా చాలా బాగా నటించారు. మరీ ముఖ్యంగా ప్రతిభ, రవి కిషన్​లు షో స్టీలర్స్​ అని చెప్పొచ్చు. సినిమా ప్రేక్షకుల మనసు మీద ఏదో ఒక రకంగా ముద్ర వేస్తుంది. కాకపోతే కాస్త స్లోగా నడుస్తుంది. సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న విషయాలను హైలైట్​ చేసింది. కుటుంబం అందరూ కలిసి చూడదగిన సినిమా.

పాత సబ్జెక్ట్​తో...

టైటిల్ : దిల్​ దోస్తి డైలమా​​​ 

డైరెక్షన్ :   ​​డెబ్బీ రావు 

కాస్ట్ :   అనుష్క సేన్​, కుష్​ జోత్వాని, తన్వీ అజ్మీ, శిశిర్ శర్మ, సుహాసిని ములే, అర్జున్​ బెర్రీ, శృతి సేథ్​, ఖలీద్ సిద్దిఖీ, పరిణితా సేథ్​, విశాఖ పాండే, రేవతి పిళ్లయ్​, ఎలిషా మేయర్​

ప్లాట్​ ఫాం : అమెజాన్​ ప్రైమ్​ వీడియో

ఈ వీడియో సిరీస్​ను అండాలీబ్​ వాజిద్​  రాసిన ‘అస్మారాస్​ సమ్మర్​’ అనే యంగ్​ అడల్ట్​ నవల ఆధారంగా తీశారు.అస్మారా(అనుష్క సేన్​) బెంగళూరులో ఉండే టీనేజర్​. తన బెస్ట్​ ఫ్రెండ్స్​ తానియా, నైనాలతో కలిసి షాపింగ్​ చేయడం, సరదాగా తిరగడం తప్ప వేరే ఆలోచన ఉండదు. అస్మారా సమ్మర్​ హాలీడేస్​కి కెనడాకి వెళ్దాం అని ప్లాన్​ చేస్తుంది. కానీ ఆ తరువాత జరిగిన ఒక సంఘటన వల్ల అస్మారాని తల్లి (శృతి సేన్​) ఎలాగైనా సరైన బాధ్యత తెలిసేలా చేయాలి అనుకుంటుంది. అందుకు గ్రాండ్​పేరెంట్స్​ ఉంటున్న ఊరికి పంపేయాలి అని డిసైడ్​ అవుతుంది. 

కానీ అస్మారాకు మధ్యతరగతి వాతావరణంలో ఉంటున్న ఆ ఇంటికి వెళ్లడం ఇష్టం ఉండదు.  అయినా కూడా బలవంతంగా అస్మారాను అక్కడికి పంపిస్తారు. నానమ్మ​ (తన్వీ అజ్మీ) ‘నలుగురు ఏం అనుకుంటారు?’ అని ఆలోచించే నేచర్​ అస్మారాకు నచ్చదు. తాతయ్య ​(శిశిర్​ శర్మ) లిబరల్​గా ఉంటాడు. అస్మారా తన ఫ్రెండ్స్​తో తను కెనడాలో ఉన్నట్టే చెప్తుంటుంది. అలా జరిగిపోతున్న ఆమె సెలవుల జర్నీలో నెమ్మదిగా ఆమెకు ఆ ఊరు నచ్చడం మొదలవుతుంది. ప్రత్యేకించి ఫరాజ్​ (కుష్​ జోత్వాని), రుక్సానా(విశాఖ పాండే), పక్కింట్లో ఉండే (సుహాసిని ములే) మనవళ్లు మనవరాళ్లు అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది ఈ వెబ్​ సిరీస్​ చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఈ సిరీస్​ చూడాలంటే కావాల్సింది ఓపిక. ఖాళీ టైం. 

స్టంట్స్​ సక్సెస్​ తెచ్చాయా?

టైటిల్ : క్రాక్​​, డైరెక్షన్ :  ఆదిత్య దత్​​ 

కాస్ట్ :  విద్యుత్​ జమ్వాల్​, అర్జున్​ రాంపాల్​, నోరా ఫతేహి, అమీ జాక్సన్​, ప్లాట్​ ఫాం : డిస్నీ+హాట్​స్టార్​​​

క్రాక్​– జీతేగా తో జియేగా అంటూ ఫిబ్రవరిలో థియేటర్స్​లో విడుదలైన ఈ సినిమా ఇప్పడు ఓటీటీకి వచ్చింది. పోలాండ్​లో మైదాన్​ అనే క్రీడా ప్రపంచం ఒకటి ఉంటుంది. దానికి కింగ్​ దేవ్​ (అర్జున్​ రాంపాల్​). అక్కడ ప్రపంచవ్యాప్తంగా స్టంట్స్​లో నిష్ణాతులైన యువతకు రేస్​లు పెడుతూ గెలిచిన వాళ్లకి కోట్లల్లో బహుమానం ఇస్తుంటాడు. ఇదిలా ఉంటే డబ్బు విషయంలో శిఖరాన ఉండాలని ఆలోచించే ముంబయికి చెందిన సిద్ధార్థ్​ దీక్షిత్​ అసియాస్​ సిద్ధు(విద్యుత్​ జమ్వాల్​) మైదాన్​లోకి ఎలాగైనా వెళ్లాలి అనుకుంటాడు. 

అదే మైదానంలో అంతకుముందు తన అన్న ప్రాణాలు కోల్పోయాడని తెలిసినా తల్లీతండ్రి వద్దని చెప్పినా వినకుండా వెళ్తాడు అక్కడికి. మొదటి టాస్క్​ గెలిచాక మైదాన్​ సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​ అలియా (నోరా ఫతేహి) ప్రేమలో పడతాడు. దేవ్​ స్పోర్ట్స్​ పేరిట ఇల్లీగల్​ కార్యక్రమాలు చేస్తున్నాడని తెలుసుకున్న పోలీస్​ ఆఫీసర్​ నోవక్​ (అమీ జాక్సన్​) అతన్ని అరెస్ట్​ చేసేందుకు ప్లాన్​ చేస్తుంది. అప్పుడామెకు ఆ పని సిద్ధు వల్లనే  అవుతుందని తెలుస్తుంది. ఆమె ప్లాన్​ను సిద్ధు ఒప్పుకుంటాడా? తన అన్న మరణానికి కారణం ఏంటనేది తెలుసుకుంటాడా? మైదాన్​లో విన్నర్​గా నిలిచాడా? లేదా? అనేది సినిమా. క్లైమాక్స్​ ట్విస్ట్​ ప్రేక్షకుల ఊహకు అందదు. సీక్వెల్​ ఉంటుందనే హింట్ చివర్లో ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T04:56:40Z dg43tfdfdgfd